AP Govt GPF Issue: ప్రజలు తిరుగులేని విజయం కట్టబెట్టారు. ఏం చేసినా చెల్లుబాటవుతుంది. అంతా మా ఇష్టం. మమ్మల్ని అడిగేదెవరు? ఢీకొట్టేదెవరు? అన్నట్టుంది ఏపీలో వైసీపీ సర్కారు తీరు. ప్రభుత్వమంటే మేము అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. కానీ అందులో ప్రజలు ఉన్నారన్న విషయం మరిచిపోతున్నారు. అందుకే ప్రజల ఆస్తులను ఇష్టారాజ్యంగా తనఖాలు పెడుతున్నారు. తెగ నమ్ముతున్నారు. ఇదేమని ప్రశ్నించే వారి గొంతు నొక్కుతున్నారు. ప్రజల హక్కులు, బాధ్యతలు, విధులు, వారి మౌలిక వసతులకు ప్రభుత్వం ఒక జవాబుదారి. ఒకరకంగా చెప్పాలంటే సంరక్షణ బాధ్యత మాత్రమే తీసుకోవాలి. కానీ ఏపీలో వైసీపీ సర్కారు అలా అనుకోవడం లేదు. ప్రజలు ఎన్నుకున్నారు కాబట్టి.. ఆ ప్రజలపై సర్వాధికారాలు మావే అన్నట్టు వ్యవహరిస్తున్నారు. వారి ఆస్తులు, పాస్తులు చివరకు వారి బ్యాంకు అకౌంట్ల లో ఉండే సొత్తు కూడా తమవే అంటున్నారు. ప్రైవేటు, ప్రభుత్వం ఒకటే.. ప్రైవేటు ఆస్తి అయినా అది ప్రభుత్వానిదేనన్నట్టు భావిస్తున్నారు.
కష్టార్జితమని చూడకుండా..
ఉద్యోగుల కష్టార్జితం, భవిష్యత్ కోసం దాచుకున్నజీపీఎఫ్ ను వారికి తెలియకుండా మాయం చేశారంటే దానిని ఏమనాలి. ఇది ఉద్యోగులకే కాదు ఏపీ ప్రజలకు కూడా షాకిచ్చిన విషయం. కానీ ఇప్పటివరకూ కనీవినీ ఎరుగని కొత్త మంత్రాంగాన్ని ఇప్పడు జగన్ సర్కారు నెరపడం విస్తుగొలుపుతోంది. ఎవరైనా, ఏ ప్రభుత్వమైనా బ్యాంకు ఖాతాలో నగదు వేయగలదు. కానీ వెనక్కి తీసుకునే పరిస్థితి ఉండదు. కానీ ఎట్టి పరిస్థితుల్లో అది వీలుకాదు. కానీ ఏపీ ప్రభుత్వం మాత్రం రెండు సార్లు ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాల నుంచి ఇట్టే నగదు మాయం చేసింది. అది కూడా ఉద్యోగులకు తెలియకుండా. అదే వేరెవరైనా చేసుంటే అది పెద్ద ఆర్థిక నేరం.
Also Read: APSRTC: ఏపీఎస్ ఆర్టీసీ ఎడాపెడా బాదుడు.. పల్లె వెలుగులనూ వదల్లే…
జప్తులు, ఈడీ కేసులంటూ తెగ హడావుడి నడిచేది. కానీ నగదు కాజేసింది మన ప్రభుత్వం. నగదు మన ఉద్యోగులది కాబట్టి పెద్ద సీరియస్ ఇష్యూ కావడం లేదు. సాధారణంగా ప్రైవేటు ఉద్యోగి అయినా.. ప్రభుత్వ ఉద్యోగి అయినా పీఎఫ్ ఖాతాలో నిధులు సురక్షితంగా ఉంటాయని భావిస్తారు. కానీ తాజా పరిణామంతో అలా నమ్మేందుకు వీలులేదు. ప్రభుత్వ ఉద్యోగికే గ్యారెంటీ లేకపోతే తమ పీఎఫ్ ఖాతాలకు ఎవరు బాధ్యులంటూ ప్రైవేటు ఉద్యోగులు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఖాతాలో పడిన నగదు వెంటనే మాయం కావడం ఏమిటని.. దేశ చరిత్రలో ఇటువంటి పరిస్థితి లేదంటూ ఆర్థిక నిపుణులు సైతం అభిప్రాయపడుతున్నారు. ఉద్యోగుల హక్కులను కాపాడడమే కాకుండా వారి భవిష్యత్ కు భరోసా కల్పించాల్సిన ప్రభుత్వమే ఇలా వ్యవహరిస్తుంటే కంచె చేను మేసినట్టుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
భవిష్యత్ అవసరాల కోసం…
ఉద్యోగికి జీపీఎఫ్ ఒక అండ. ఒక భరోసా. తనకుకానీ.. తన కుటుంబానికి కానీ భవిష్యత్ లో అండగా జీపీఎస్ నిలుస్తుందని కొండంత నమ్మకం. భవిష్యత్ అవసరాలకు జీపీఎఫ్ అక్కరకు వస్తుందని భావిస్తారు. అందుకే ఎంత పెద్ద అవసరం వచ్చినా జీపీఎఫ్ జోలిక మాత్రం పోరు. అటువంటి భవిష్య నిధిపైనే ఏపీ ప్రభుత్వం కన్నేసిందంటే ఉద్యోగులకు ఏ స్థాయిలో ద్రోహం జరిగిందో అర్థం చేసుకోవచ్చు. 2018 జూలై నుంచి 2021 జూన్ వరకూ డీఏ బకాయిలను ఉద్యోగుల పీఎఫ్ ఖాతాల్లో జమ చేస్తామని జగన్ సర్కారు ప్రకటించింది. అటు తరువాత 2021 ఏప్రిల్ నుంచి 2022 జూన్ వరకూ ఐదు విడతలుగా జమ చేసినట్టు చెప్పుకొచ్చింది. కానీ మార్చిలోనే ఏకంగా ఈ మొత్తాన్ని ఖాతాల నుంచి మాయం చేసింది. ఇతర అవసరాలకు మళ్లించింది. అంటే మూడు నెలల కిందటే మాయం చేసినా.. ఇంతవరకూ గోప్యత పాటించిందంటే దీనిని ఆర్థిక నేరంగా పరిగణిస్తారా? లేదా? అన్నది ప్రభుత్వానికే ఎరుక. ఒకటి కాదు రెండు కాదు 90 వేల మంది ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాల నుంచి రూ.800 కోట్లు మళ్లించారంటే ఎంత దైర్యం ఉండాలి. దీనిపై న్యాయస్థానం కఠిన వ్యాఖ్యలు చేసినా, ఉద్యోగవర్గాల నుంచి ఆందోళన పెల్లుబికుతున్నా ప్రభుత్వం మౌనాన్నే ఆశ్రయిస్తోంది. ఏజీ కార్యాలయం జీపీఎఫ్ ఖాతాలకు సంబంధించి వివరాల స్లిప్పులను ఆన్ లైన్ లో అప్ లోడ్ చేసి ఉద్యోగులు డౌన్ లోడ్ చేసుకున్న తరువాతనే మార్చిలో ఖాతాల నుంచి నగదు మాయమైనట్టు తెలిసింది. వాస్తవానికి చాలామంది జీపీఎఫ్ ఖాతాల నుంచి నగదు విత్ డ్రాకు దరఖాస్తు చేసుకున్నారు. పిల్లల చదువులు, వివాహాల కోసం అర్జీ పెట్టుకున్నా సహేతుకమైన కారణాలు చూపకుండా ప్రభుత్వం వాటిని పక్కన పడేసింది. నెలల తరబడి పెండింగ్ లో ఉంచుతూ వస్తోంది. బహుశా ఈ కారణమే కాబోలు అని ఇప్పడు ఉద్యోగులు చర్చించుకుంటున్నారు.
కొత్త వాదన..
జీపీఎఫ్ ఖాతాల నుంచి నగదు మాయం విషయంలో విమర్శలు చుట్టుముట్టిన నేపథ్యంలో ప్రభుత్వం మరో వాదనకు తెరలేపింది. అసలు ఉద్యోగులకు జీపీఎఫ్ సొమ్ములు ఇవ్వలేదని.. అలాంటప్పుడు అక్రమంగా ఖాతాల నుంచి నగదు మాయం చేసే వీలులేదని ప్రచారం చేయిస్తున్నారు. అటు అనుకూల మీడియాతో పాటు సామాజిక మాధ్యమాల్లో ప్రభుత్వానికి అనుకూలంగా పోస్టులు పెడుతున్నారు. సాంకేతిక కారణాల తప్పిదం కానీ,., ఇందులో ప్రభుత్వం చేసిన తప్పిదం ఏమీలేదని అడ్డగోలు వ్యాఖ్యలు చేస్తున్నారు. దీనిపై ఆర్థిక నిపుణులు సైతం అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ తప్పిదం స్పష్టంగా కనిపిస్తోందని చెబుతున్నారు. అయితే విమర్శలు చుట్టుముడుతున్నా ప్రభుత్వం దీనిపై స్పష్టత నివ్వడం లేదు. కనీసం ఒక ప్రెస్ నోట్ కూడా విడుదల చేయడం లేదు. ఇప్పటికే భవన నిర్మాణ కార్మికుల నిధిని పక్కదారి పట్టించిన ప్రభుత్వం ఇప్పుడు ఏకంగా ఉద్యోగుల భవిష్య నిధిని మళ్లించడం ముమ్మాటికీ వంచించడమే, ఇప్పటికైనా ప్రభుత్వం వాస్తవాలు చెప్పకపోతే దానికి భవిష్యత్ లో మూల్యం చెల్లించుకోక తప్పదు.
Also Read:Maharashtra Crisis: మహారాష్ట్ర సీఎం కుర్చీ: ఉద్ధవ్.. ఆ రోజు బీజేపీని అడిగింది ఇదే కదా!