AP Govt One Time Settlement: అధికారంలోకి వస్తే ఇళ్లపై రుణాలను మాఫీ చేస్తామని జగన్ ప్రకటించారు. విపక్ష నేతగా పాదయాత్ర చేసే సమయంలో ప్రధాన హామీ ఇదే. దీంతో నిరుపేద లబ్ధిదారులు మురిసిపోయారు. తమకు ఇక గృహనిర్మాణ రుణాల బెడద ఉండదని భావించారు. కానీ అధికారంలోకి వచ్చిన తరువాత జగన్ మాట మార్చారు. ఎప్పుడో ఎన్టీఆర్ హయాం నుంచి మొన్న చంద్రబాబు హయాం వరకూ నిర్మించిన ఇళ్లపై రుణాలను వసూలు చేసేందుకు డిసైడయ్యారు. దానికి ముద్దుగా వన్ టైమ్ సెటిల్మెంట్ అని పేరు పెట్టారు. ప్రతి లబ్ధిదారుడి వద్ద రూ.10 నుంచి రూ.30 వేలు పిండేశారు. తామే రిజిస్ట్రేషన్లు చేయిస్తామని.. ఆ పాత ఇంటిపై బ్యాంకు లోన్లు వచ్చే వెసులబాటు కల్పిస్తామని హామీ ఇచ్చారు. జిల్లాకు రూ.100 కోట్లు చొప్పున.. రాష్ట్ర వ్యాప్తంగా రూ.1300 కోట్లు వసూలు లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఒక్కో ఇంటి లబ్ధిదారుడిపైకి పది మందికిపైగా సచివాలయ ఉద్యోగులు, వలంటీర్లను పంపించారు. ఇళ్ల కొలత తీసి అందుకు తగ్గట్టు వసూలు చేశారు. కలెక్షన్లు వెనుకబడిన చోట వైసీపీ నేతలే స్వయంగా రంగంలోకి దిగారు. అనుకున్న టార్గెట్ మేరకు వసూళ్లు జరిపారు. కానీ రిజిస్ట్రేషన్లు లేదు.. బ్యాంకు రుణాలు లేవు. ముందుగా పత్రాలు అందితే కదా. వార్డు, డివిజన్ కార్యాలయాల్లో ఓటీఎస్ రిజిస్ట్రేషన్ల పత్రాలు ఇస్తామన్నారు. కానీ రోజులు, నెలలు, సంవత్సరాలు గడిచాయి. కానీ లబ్ధిదారుల చేతుల్లోకి పత్రాలు అందలేదు. మరో ఆరు నెలల్లో యంత్రాంగం ఎన్నికల ఫీవర్ లోకి వెళ్లిపోతుంది. అప్పుడు ఏం చేయలేని నిస్సహాయత. దీంతో నగదు సమర్పించుకున్న లబ్ధిదారులు లబోదిబోమంటున్నారు.
కొందరు ఒత్తిడి భరించలేక అప్పుచేసి కట్టారు. పెద్దలకు రూ.20 వేలు ఒక లెక్క కాదు. కానీ పేదలకు మాత్రం ఆ మొత్తం సంవత్సర ఆదాయంగా భావిస్తారు. కానీ ఒత్తిడి తెచ్చిన ప్రజాప్రతినిధి కనిపించడం లేదు. కట్టమని చెప్పిన సచివాలయ ఉద్యోగులు మిన్నకుండా ఉంటున్నారు. వలంటీర్లు అయితే మాకేం సంబంధమంటూ తప్పించుకుంటున్నారు. అసలు రిజిస్ట్రేషన్ ప్రక్రియే ప్రారంభం కాలేదు. అన్నిపత్రాలు సవ్యంగా ఉంటేనే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో కొర్రీలు పెడుతున్నారు. అటువంటిది సచివాలయ కార్యాలయాల నుంచి దరఖాస్తులు రావాలి. అన్నిపత్రాలు సమర్పించాలి. వాటిని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ సిబ్బంది స్క్రూట్నీ చేయాలి. ఇన్ని తంతులు ముగిసిన తరువాత పత్రాలన్నీ సవ్యంగా ఉంటేనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ జరపాలి. ఇవన్నీ అయ్యేవి ఎప్పుడు? పత్రాలు లబ్ధిదారుల చేతికి అందేదెప్పుడు? అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.
వాస్తవానికి ముందు ప్రభుత్వాల గృహనిర్మాణాలకు సంబంధించి రుణాలను తరువాత వచ్చే ప్రభుత్వాలు పట్టించుకోవు. వీలైనంతవరకూ మాఫీ చేస్తాయి. అప్పుడెప్పుడో చంద్రబాబు హయాంలో వసూలు చేయాలని నిర్ణయించినా ప్రజల నుంచి వ్యతిరేకత రావడంతో సైలెంట్ అయ్యారు. కానీ జగన్ మాత్రం ప్రజల నుంచి ప్రతికూల స్పందన వచ్చినా పట్టించుకోలేదు. పైగా మీకు రిజిస్ట్రేషన్ పత్రాలతో పాటు బ్యాంకు రుణాల సదుపాయం కల్పిస్తామని నమ్మబలికి మరీ సొమ్ము కట్టించుకున్నారు. ఇప్పుడు పట్టించుకోవడం మానేశారు. దీంతో కట్టిన పేద లబ్ధిదారులు మాత్రం లబోదిబోమంటున్నారు.