ఏపీ సీఎం వైఎస్ జగన్ రాష్ట్రంలో పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరికీ ప్రయోజనం చేకూరేలా ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకోవడంతో పాటు అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. సీఎం జగన్ తాజాగా మహిళలకు ప్రయోజనం చేకూరేలా మరో నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల ముందు జగన్ మహిళల కోసం వైఎస్సార్ ఆసరా, వైఎస్సార్ చేయూత పథకాలను అమలు చేస్తానని చెప్పి ఆ మాటను నిలబెట్టుకున్నారు.
ఇప్పటికే ఈ రెండు పథకాలను అమలు చేసి రాష్ట్రంలో అర్హులైన మహిలందరూ ఈ పథకాల ద్వారా లబ్ధి పొందేలా చేశారు. తాజాగా సీఎం జగన్ మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయాలనే ఉద్దేశంతో మహిళలతో డెయిరీలను ఏర్పాటు చేయించాలని భావిస్తున్నారు. డెయిరీలను ఏర్పాటు చేయడం ద్వారా రాష్ట్రంలో పాల ఉత్పత్తిని పెంచడంతో పాటు పాల ద్వారా భారీ మొత్తంలో మహిళలు సులభంగా ఆదాయాన్ని పొందగలిగే అవకాశం ఉంటుంది.
ప్రభుత్వం ఇందుకోసం 3 లక్షలకు పైగా గేదెలను, 2 లక్షలకు పైగా ఆవులను కొనుగోలు చేయనుందని తెలుస్తోంది. వీటిని ప్రభుత్వం మహిళలకు పంపిణీ చేయనుంది. ఆవులు, గేదెలతో పాటు మేకలు, గొర్రెలను కూడా పంపిణీ చేయాలని అధికారులు ప్రణాళికలను రూపొందించారు. మహిళలు ప్రభుత్వం నుంచి ఆవులు, గేదెలను కొనుగోలు చేయడానికి రుణాలు మంజూరు చేయడంతో పాటు ప్రభుత్వం మహిళలకు బ్యాంకుల నుంచి రుణాలు అందేలా చర్యలు తీసుకోనుంది.
ప్రభుత్వం అధికారులచే మేలు జాతి ఆవులు, గేదెలను మాత్రమే కొనుగోలు చేయిస్తోంది. అందువల్ల సాధారణ ఆవులు, గేదెలతో పోలిస్తే వీటి ద్వారా ఎక్కువ మొత్తంలో ఆదాయం సమకూరుతుంది. రాష్ట్రంలో మహిళా పాడి రైతుల నుంచి సేకరించిన పాల కోసం ప్రభుత్వం బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్లను కూడా ఏర్పాటు చేయనుందని డిసెంబర్ నెల చివరి వారం నాటికి వీటి నిర్మాణం పూర్తి కానుందని తెలుస్తోంది.