
ఏ రాష్ట్రంలో అయినా పథకాల అమలుకు నిధులు విడుదల చేస్తుంటాయి. ఇందుకోసం క్యాలెండర్‌ను తయారు చేసి ప్రకటిస్తుంటారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంక్షేమ పథకాలతో దూసుకెళ్తోంది. దేశంలోనే టాప్ ప్లేస్‌లో ఉంది. జగన్ అధికారంలోకి రావడానికి ముందే ప్రజల కోసం ఏం చేస్తామో ప్రకటించేశారు. ఆయన చెప్పిన విధంగానే పేదలకు ఉపయోపడేలా నవరత్నాలను ప్రకటించేశారు. వాటి అమలును సైతం సీరియస్‌గా తీసుకున్నారు. పేదలకు లబ్ధి జరిగేలా చర్యలు తీసుకుంటున్నారు. చెప్పినట్లుగానే పథకాలను అమలు చేస్తున్నారు.
ఏపీలో ఈ ఆర్థిక సంవత్సరం పథకాల అమలు కోసం గత ఫిబ్రవరిలోనే క్యాలెండర్‌ను ప్రకటించారు. దాని ప్రకారం ఐదు పథకాలకు సంబంధించిన నిధులను ఈ ఏప్రిల్‌లో విడుదల చేయాలి. కానీ.. ఇప్పుడు ఏప్రిల్ నెల సగం పూర్తయినా ఇంకా నిధులు విడుదల కాలేదు. అయితే.. ఇందుకు నిధులు లేమి కారణంగానే తెలుస్తున్నా.. ఇంకా ఏమైనా కారణాలు కూడా ఉన్నాయా అనే ప్రశ్నలు సైతం వినిపిస్తున్నాయి.
తెలుగు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి అధ్వానంగా తయారైంది. ముఖ్యంగా గత చంద్రబాబు హయాంలోనూ ఆదాయం పెద్దగా పుంజుకోలేదు. లోటు బడ్జెట్‌తోనే రాష్ట్రం నడుస్తూ ఉంది. ముందు నుంచి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇలాగే ఉంది. ఇక ఇప్పుడు జగన్ ప్రభుత్వం హయాంలో కూడా పరిస్థితిలో ఎలాంటి మార్పు లేదు. అసలే సంక్షేమ పథకాలతో టాప్ ప్లేస్‌లో ఉన్న జగన్ ప్రభుత్వం.. ఇప్పుడు ఆ పథకాలను ఎలా నడిపించాలో తెలియక తల పట్టుకుంటున్నట్లుగా తెలుస్తోంది.
ప్రధానంగా జగన్ అమలు చేస్తున్న పథకాల్లో జగనన్న వసతి దీవెన, జగనన్న విద్యా దీవెన మొదటి విడత నిధులు విడుదల చేయాల్సి ఉంది. ఈ నిధుల కోసం విద్యార్థులు ఎదురుచూస్తూనే ఉన్నారు. వాటితోపాటే పొదుపు సంఘాల మహిళలకు వైఎస్సార్ సున్నా వడ్డీ చెల్లింపులు కూడా చేయాల్సి ఉంది. ఇక రైతులకు రబీకి సంబంధించిన వైఎస్సార్ సున్నా వడ్డీ డబ్బులు ఇవ్వాల్సి ఉంది. వీటిపై ప్రభుత్వం నుంచి ఇంతవరకు ఎలాంటి ప్రకటనా రాలేదు. దీనిపై ముఖ్యమంత్రి కూడా ఎప్పుడు స్పందిస్తారో తెలియకుండా ఉంది. అటు విద్యార్థులు, ఇటు మహిళలు, మరోపక్క రైతులు మాత్రం ఈ డబ్బుల కోసం ఎదురుచూస్తూనే ఉన్నారు.