
భారతదేశంలో కరోనా విస్తృతంగా వ్యాపిస్తోంది. కేసులు, మరణాల సంఖ్య పెరుగుతోంది. సెకండ్ వేవ్ సూచనలు కనిపిస్తున్నాయి. అన్ని రాష్ట్రాల్లో అధిక సంఖ్యలో కేసులు నమోదవుతున్నందున మొత్తం భారతీయ చిత్ర పరిశ్రమ ఇప్పుడు అప్రకటిత లాక్డౌన్ స్థితిలోకి జారుకుంది. ఏ పెద్ద హీరో కూడా ఇలాంటి సందర్భంగా సినిమాలు చేయడానికి సాహసించడం లేదు. బాలీవుడ్ లో అయితే సినిమాలేవీ విడుదల కావడం లేదు. సినిమా షూటింగులను కూడా బాలీవుడ్ నిలిపివేసింది. టాలీవుడ్ సినిమా విడుదలలను వాయిదా వేశారు.
అల్లు అర్జున్ “పుష్ప”.. చిరంజీవి “ఆచార్య” వంటి పెద్ద సినిమాలను కూడా సమ్మర్ లో రిలీజ్ కావాల్సి ఉండగా మరో తేదీలకు మార్చేశారు. పాన్-ఇండియా ప్రాజెక్ట్ “కేజీఎఫ్ 2” కొత్త తేదీని ప్రకటిస్తుందనే చర్చ కూడా సాగుతోంది..
ఈ క్రమంలోనే సహజంగానే రాజమౌలి “ఆర్ఆర్ఆర్” కూడా వాయిదా వేస్తారా? అన్న అనుమానాలు ఇండస్ట్రీలో కలుగుతున్నాయి. కానీ ఎట్టిపరిస్థితుల్లోనూ రాజమౌళి తన ఆర్ఆర్ఆర్ సినిమా విడుదల తేదీని మళ్లీ మార్చడానికి ఇష్టపడడం లేదని సమాచారం. ఈ చిత్రం దసరా సందర్భంగా అక్టోబర్ 13న విడుదల చేయడానికి ఇప్పటికే తేదీని ప్రకటించారు. అప్పటికి కోవిడ్-19 పరిస్థితి తగ్గుతుందని రాజమౌళి టీం ఆశాభావం వ్యక్తం చేస్తోంది.
అయితే ఈ సినిమాలు వాయిదా పడడంతో ఎన్.టి.ఆర్-కొరటాల శివ కొత్త సినిమా షూటింగ్ కు కూడా వెళ్లడానికి రెడీ అవుతున్నారు. ఇక దర్శకుడు శంకర్ పాన్-ఇండియా ప్రాజెక్టుతో రామ్ చరణ్ బిజీ అవుతున్నారు. అన్ని నిర్మాణ ఫార్మాలిటీలను పూర్తి చేసి అక్టోబర్ 13న సినిమాను విడుదల చేయడం తప్ప రాజమౌళికి వేరే మార్గం కనిపించడం లేదని తెలుస్తోంది.