పరిపాలనా వికేంద్రీకరణ పేరిట విశాఖపట్నంలో నెలకొల్పదల్చిన పాలనా రాజధాని (ఎగ్జిక్యూటివ్ కేపిటల్) వ్యవహారాన్ని రాష్ట్ర ప్రభుత్వం గోప్యంగా సాగిస్తున్నది. న్యాయస్థానాల్లో వ్యాజ్యాలు, శానన మండలిలో బిల్లుల పెండింగ్, మరికొన్ని సాంకేతిక సమస్యల కారణంగా ప్రభుత్వ కార్యాలయాల పరిశీలన, గుర్తింపు, ఎంపిక అత్యంత రహస్యంగా జరుపుతున్నారు.
జిల్లా కలెక్టరేట్, గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ (జివిఎంసి), విశాఖ మెట్రో ప్రాంత డెవలప్‌మెంట్ అథారిటీ (విఎంఆర్‌డిఎ)లలో ఒక స్థాయి అధికారుల వరకు రాజధాని భవనాల విషయమై నోరు విప్పడం లేదు. ఎక్కడ ఏ డిపార్టుమెంట్ వస్తుందనే విషయంపై పూర్తిగా మౌనం పాటిస్తున్నారు.
పరిపాలనా రాజధానిలో ప్రధానమైన గవర్నర్, ముఖ్యమంత్రి కార్యాలయాలు, వారి నివాసాలు, సచివాలయ సముదాయం, విభాగాధిపతుల (హెచ్‌ఒడి) ఆఫీసులు, ఇక్కడికి తరలి వచ్చే అధికారులు, సిబ్బందికి వసతి, మంత్రుల నివాసాలు వీటి పరిశీలనపై సచివాలయంలోని సాధారణ పరిపాలన విభాగం (జిఎడి) నుంచి నేరుగా జిల్లా స్థాయిలో ఒకరిద్దరు ఉన్నతాధికారులతో మాత్రమే మంతనాలు సాగిస్తున్నారు.
స్థానిక అధికారపార్టీ నాయకులు, ఎక్కడైనా ప్రభుత్వ, ప్రైవేటు భవనం ఖాళీగా ఉందని సమాచారం ఇచ్చిన మరుక్షణం ఆ ఒకరిద్దరు ఉన్నతాధికారులు, మీడియా కంట పడకుండా సందర్శించి పైకి మౌఖిక సమాచారం పంపుతున్నారు. అంతేకాకుండా, ప్రభుత్వ విభాగాలు దేనికది హెచ్‌ఒడి కార్యాలయాల కోసం వేట సాగిస్తున్నాయి. అనధికారికంగా అడ్వాన్స్ బుకింగ్‌లు చేసుకుంటున్నాయి.
రాష్ట్ర పాలనకు గుండెకాయ వంటి సచివాలయం ఎక్కడొస్తుందో స్పష్టత లేకపోయినా ఇప్పటి వరకు మధురవాడ ఐటి సెజ్ పరిధిలోని హిల్ నెం.3 అనువైన ప్రాంతమని పలువురు వైసిపి నేతలు, అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే నిర్మాణం పూర్తయిన మిలీనియం టవర్స్, పక్కనే శరవేగంగా నిర్మితమవుతున్న బి-2 కాంప్లెక్స్, ఆ పక్కనే ఉన్న స్టార్టప్ విలేజి కలుపుకుంటే సుమారు 8.25 లక్షల చదరపు అడుగుల స్పేస్ అందుబాటులోకి వస్తుందని చెబుతున్నారు.
అమరావతిలో సచివాలయం ఆరు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. అంతకంటే ఎక్కువ భవనాలు ఒక్క హిల్ 3పై అందుబాటులోకి వస్తాయని పేర్కొంటున్నారు. కాగా మిలీనియం టవర్స్‌లో ఐటి కంపెనీలను ఖాళీ చేయిస్తే మొత్తంగా ఐటి ప్రమోషన్‌కే దెబ్బ తగులుతుందన్న విమర్శలొస్తున్నాయి. హిల్ నెం.3 పైనే మొత్తం సచివాలయ సముదాయం కాకుండా పక్కనున్న హిల్ నెం.1, హిల్ నెం.2లో ఖాళీగా ఉన్న భవనాల్లో సచివాలయాన్ని విడగొట్టి పెట్టే అవకాశాలూ లేకపోలేదని తెలుస్తున్నది.
విశాఖ పట్నానికి 15 కిలోమీటర్ల దూరంలో ఆనందపురం మండలం బోయపాలెం గ్రామం వద్ద పైడా కాలేజీని సచివాలయం నిమిత్తం పరిశీలించారని చెబుతున్నారు. అధికారపార్టీ కీలక నేత విజయసాయిరెడ్డి ఓకే చెబితే సచివాలయం కాకపోయినా, కొన్ని హెచ్‌వొడిలు పైడా కాలేజీలో రావొచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. పైడా, పక్కనే ఉన్న కౌశిక్ కాలేజీల్లో ఒకదాన్ని ఒక మంత్రి కొనుగోలు చేశారని సమాచారం.