‘ప్రధానమంత్రి నరేంద్రమోడీ మాటలతో కాక చేతలతో దేశానికి నమ్మకం కలిగించాలి. మన ఎదుర్కొంటున్న ప్రమాదాల గురించి ఆయనకు తెలుసు. ఈ ముప్పు నుంచి వీలైనంత సురక్షితంగా బయటపడేందుకు చేయూత నివ్వగలనని ఆయన జాతికి హామీ ఇవ్వాలి’ అని మాజీ ప్రధాని తన వ్యాసంలో పేర్కొన్నారు. దేశంలో ఇప్పుడు హానికలిగించే భయంకరమైన పరిస్థితి నెలకొని ఉందని హెచ్చరించారు.
సమస్యల పరిష్కారానికి ప్రధాని నరేంద్రమోదీకి త్రిసూత్ర పథకం సూచించారు. మొదట దేశీయంగా అందుబాటులో ఉన్న వనరులు, శక్తి సామర్థ్యాలను ఉపయోగించుకుని కొవిడ్-19 నివారణకు చర్యలు తీసుకోవాలని కోరారు.
సామాజిక సామరస్య వాతావరణానికి ముప్పుగా పరిణమించిన పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)ను రద్దు చేయడం గానీ, నిబంధనలను సవరించడంగానీ చేయాలని, తద్వారా జాతి ఐక్యతకు మార్గం సుగమం చేయాలని ఆయన సూచించారు.
వ్యవస్థ పునరుద్ధరణకు ద్రవ్య ఉద్దీపన పథకాలను తేవాలని మన్మోహన్ హితవు చెప్పారు.
ఇటీవల దేశ రాజధాని ఢిల్లీలో తలెత్తిన మత ఘర్షణలను నివారించి ప్రజల ప్రాణాలను, శాంతిభద్రతలను పరిరక్షించడంలో అధికార యంత్రాంగం విఫలమైందని మాజీ ప్రధాని విమర్శించారు. మత ఉద్రిక్తతలు పెరిగాయని, రాజకీయ వర్గంతో సహా సమాజంలో అరాచక శక్తులు మత కల్లోలాన్ని రగిలించాయని మన్మోహన్‌సింగ్ ఆవేదన చెందారు.
శాంతిభద్రతల వ్యవస్థలు పౌరులకు రక్షణ కల్పించాల్సిన ధర్మాన్ని విడనాడాయి. న్యాయవ్యవస్థలు, మీడియా కూడా మనకు తోడ్పడలేకపోయాయని వ్యాఖ్యానించారు.
సరళీకృత ప్రజాస్వామిక విధానాలతో ఆర్థికాభివృద్ధిలో కొన్నేళ్ల క్రితం ప్రపంచానికే నమూనాగా నిలబడిన భారతదేశం చాలా వేగంగా ఆ స్థాయి నుంచి పతనమవుతోందని మాజీ ప్రధాని హెచ్చరించారు. ఆర్థిక రంగం ఒడిదుడుకులకు లోనవుతున్న సమయంలో సామాజిక అశాంతి మాంద్యాన్ని మరింత వేగిరం చేస్తుందని వారించారు.