AP Deputy CM Narayana Swamy: ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి సొంత పార్టీ శ్రేణుల నుంచే ఎదురీదుతున్నారు. వచ్చే ఎన్నికల్లో నారాయణస్వామికి టికెట్ ఇస్తే పనిచేయమని స్థానిక వైసీపీ నాయకులు తేల్చి చెబుతున్నారు. బహిరంగంగానే విమర్శలకు దిగుతున్నారు. ఏకంగా ప్రెస్ మీట్ పెట్టి అధినాయకత్వానికి అల్టిమేటం ఇస్తున్నారు. దీంతో హై కమాండ్ లో కలవరం ప్రారంభమైంది. ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో గంగాధర నెల్లూరు నియోజకవర్గంపై ఫోకస్ పెట్టాల్సిన అనివార్య పరిస్థితులు నెలకొన్నాయి.
గత ఎన్నికల్లో గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో నుంచి బరిలో దిగిన నారాయణస్వామి విజయం సాధించారు. పార్టీ శ్రేణులంతా ఐక్యంగా పనిచేయడంతో ఆయన గెలుపు సాధ్యమైంది. మంత్రివర్గ విస్తరణలో జగన్ ఆయనకు చోటిచ్చారు. ఏకంగా డిప్యూటీ సీఎం పదవి కల్పించారు. అయితే మంత్రిగా మారిన తర్వాత పార్టీ శ్రేణులతో గ్యాప్ పెరిగింది. నియోజకవర్గంలోని ద్వితీయ శ్రేణి నాయకులను పట్టించుకోవడం మానేశారన్న ఆరోపణలు ఉన్నాయి. దీంతో నేతలు ఒక్కొక్కరూ దూరమయ్యారు. బాహటంగానే వ్యతిరేకించడం ప్రారంభించారు.
గంగాధర నెల్లూరు ఎంపీపీ హేమలత, జడ్పిటిసి దొరస్వామి, వైసీపీ మండల కన్వీనర్ సురేష్ రెడ్డి ఏకంగా ప్రెస్ మీట్ పెట్టారు. నారాయణస్వామి గెలుపునకు ఎంతో కృషి చేశామని.. ఎన్నో ఇబ్బందులు పడ్డామని.. కానీ ఇప్పుడు తమను అనగదొక్కే ప్రయత్నం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే వచ్చే ఎన్నికల్లో నారాయణస్వామికి టికెట్ ఇస్తే పని చేయమని తేల్చి చెప్పారు. ప్రత్యామ్నాయంగా సరైన అభ్యర్థిని బరిలో దించాలని హై కమాండ్ కు విజ్ఞప్తి చేశారు. దీంతో గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో పరిస్థితి నివురు గప్పిన నిప్పులా మారింది.
అయితే ఈ ఆరోపణలను డిప్యూటీ సీఎం నారాయణస్వామి కొట్టిపారేస్తున్నారు. ఎవరు సహకరించినా, సహకరించకున్నా తన గెలుపు నల్లేరు మీద నడకేనని ధీమా వ్యక్తం చేస్తున్నారు. తనకు నాయకులతో పనిలేదని.. జగనన్న పథకాలే తన గెలిపిస్తాయని లైట్ తీసుకుంటున్నారు. తాను కొత్తగా నాయకులను తయారు చేసుకోగలనని.. మీ అవసరం మాకు లేదని తేల్చి చెబుతున్నారు. దీంతో డిప్యూటీ సీఎం వర్సెస్ వైసిపి ద్వితీయ శ్రేణి నాయకులు గా పరిస్థితి మారిపోయింది. వచ్చే ఎన్నికల్లో వైసీపీ గెలుపు పై ప్రభావం చూపుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.