Homeఆంధ్రప్రదేశ్‌YS Sharmila: వైఎస్ షర్మిలకు దారేది?

YS Sharmila: వైఎస్ షర్మిలకు దారేది?

YS Sharmila: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్‌ తనయగా, వైఎస్సార్‌ పాలనను రాష్ట్రంలో తిరిగి తీసుకురావడమే లక్ష్యం అంటూ రాజకీయాలు మొదలు పెట్టింది వైఎస్‌.షర్మిల. సుమారు 3,200 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ నుంచి.. ఎమ్మెల్యేల వరకు తన పదునైన విమర్శలతో ఎండట్టారు. వ్యక్తిగత విమర్శలూ చేశారు. నిరుద్యోగ దీక్ష చేశారు. కానీ పార్టీకి ఆశించిన మైలేజీ రాలేదు. పెద్ద నాయకులెవరూ పార్టీలో చేరడం లేదు. షర్మిల ఆంధ్రా అనే ముద్ర కారణంగానే తెలంగాణ ప్రజలు ఓన్‌చేసుకోవడం లేదు. ఈ నేపథ్యంలో ఆమె ఇప్పుడు పొలిటికల్‌ త్రిశంకు స్వర్గంలో ఉన్నారు. అడుగు ఎటువైపు వేయాలో తెలియని సందిగ్ధం ఆమెను వీడడం లేదు. దీంతో దిక్కు తోచని స్థితిలో షర్మిల ఉన్నారంటూ రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

బీజేపీ బాణంగా ప్రచారం..
తెలంగాణ రాజకీయాలను ప్రభావితం చేయగలను అని తనకు తాను భావించేసుకుని, వైఎస్‌ఆర్‌ టీపీ అన్న పేరుతో సొంత పార్టీ పెట్టిన షర్మిలకి మొదట్లో మీడియా నుంచి బలమైన మద్దతు లభించింది. వందల కోట్ల ఆస్తి ఉన్న షర్మిల పెట్టిన పార్టీ మీడియా సంస్థలకు కల్ప తరువుగా మారింది అన్న కామెంట్స్‌ కూడా వచ్చాయి. అయితే పార్టీ పెట్టిన కొత్తలో కేసీఆర్‌ మీద అనేక విమర్శనాస్త్రాలు సంధించింది షర్మిల. దీంతో షర్మిల బీజేపీ వదిలిన బాణం అని అధికార పార్టీ నేతలు విమర్శలు చేశారు. ఆంధ్రా నుంచి వచ్చి తెలంగాణలో రాజకీయాలు చేయడం ఏమిటన్న విమర్శలు వచ్చాయి.

బీజేపీతో కేసీఆర్‌ దోస్తీ..
మొన్నటి వరకు బీజేపీతో ఢీ అంటే ఢీ అన్న కేసీఆర్‌ తన కూతురు కవిత లిక్కర్‌ కేసులు చిక్కుకోవడంతో విధిలేని పరిస్థితిలో గులాబీ బాస్‌ బీజేపీ శరణు కోరారు. బయటకు కనిపించకపోయినా.. అంతర్గతంగా మంతనాలు సాగిస్తున్నాడు. దీంతో బీజేపీతో సబంధాలు మెరుగయ్యాయి. అందుకే దూకుడుగా ఉన్న బండి సంజయ్‌ని మార్చి బీజేపీ పెద్దలు కిషన్‌రెడ్డికి పగ్గాలు అప్పగించారని, అలాగే కవిత కేసు అటకెక్కిందని, దీనికి ప్రతిఫలంగా అసెంబ్లీ ఎన్నికల అనంతరం కేసీఆర్‌ ఎంపీ ఎన్నికల్లో అధికారికంగానే బీజేపీకి మద్దతు పలుకుతాడని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

కాంగ్రెస్‌వైపు షర్మిల చూపు..
మారిన రాజకీయ పరిస్థితులతో షర్మిల కాంగ్రెస్‌వైపు చూస్తున్నారు.
కాంగ్రెస్‌ మద్దతు కోసం కర్ణాటక ఎన్నికల తర్వాత ఆ రాష్ట్ర పీసీసీ చీఫ్‌ డీకే.శివకుమార్‌ను కలిశారు. పార్టీలో చేరేందుకు మంతనాలు జరిపారు. అయితే అసలే అంతర్గత ప్రజాస్వామ్యం మరీ ఎక్కువ గా ఉండే కాంగ్రెస్‌ పార్టీలోని పలువురు నాయకులు షర్మిల కాంగ్రెస్‌ లోకి రావడాన్ని వ్యతిరేకిస్తూ బాహాటంగానే ప్రకటనలు చేయడం మొదలు పెట్టారు. కాంగ్రెస్‌ అధిష్టానం సైతం షర్మిల పంపుతున్న రాయబారాలను ప్రస్తుతానికి సైలెంట్‌ మోడ్‌ లో పెట్టేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఎంకీ పెళ్లి సుబ్బి చావుకు వచ్చినట్లు, కేసీఆర్, బీజేపీ మధ్య సమీకరణాల్లో మార్పులు జరగడం తెలంగాణలో షర్మిల రాజకీయ భవిష్యత్తు అగమ్య గోచరంగా మారింది.

మూడు ఆప్షన్లు..
ఇప్పుడు షర్మిల ముందు మూడు ఆప్షన్లు ఉన్నాయి. కాంగ్రెస్, బీజేపీ షర్మిలను దూరం పెట్టడంతో షర్మిల తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నట్లు సమాచారం. ఎలాగూ పార్టీ పెట్టాము కాబట్టి ఒంటరిగానే ఎన్నికల్లో అదృష్టాన్ని పరీక్షించుకోవాలి. అయితే ఘోర ప్రభావం తప్పదన్న భయం షర్మిలలో ఉంది. ఇక కేసీఆర్‌తో రాజీ పడాలి. కానీ అలా చేస్తే కేసీఆర్‌కు, బీఆర్‌ఎస్‌కు ప్రయోజనం ఏమీ ఉండదు. దీంతో కేసీఆర్‌ చేరదీసే అవకాశాలు లేవు. మూడో ఆప్షన్‌ తెలంగాణలో దుకాణం సర్దేసి ఆంధ్ర రాజకీయాల మీద ఫోకస్‌ చేయడం.

తెలంగాణలో పార్టీ పెట్టిన కొత్తలో తన భవిష్యత్తు తెలంగాణలోనే అన్న ఉద్దేశంతో ఆంధ్ర ప్రదేశ్‌ని పక్క రాష్ట్రమని, తనకు సంబంధం లేని రాష్ట్రం అని తీవ్రమైన వ్యాఖ్యలు చేసిన షర్మిలను ఇప్పుడు అక్కడి ప్రజలు కూడా ఆదరిస్తారనే నమ్మకం లేదు. మొత్తంగా తన రాజకీయ భవిష్యత్తుపై ఏ కోశానా ఆశాజనకమైన పరిస్థితి కనిపించకపోవడంతో రాబోయే తెలంగాణ ఎన్నికలలో షర్మిల దూరంగా ఉండాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
Exit mobile version