Auction Amravati Lands: అమరావతి రాజధాని విషయంలో ఏపీ ప్రభుత్వం మరో తొండాటను ప్రారంభించింది. ఇప్పటికే మూడు రాజధానులు ప్రకటించిన ఏపీ సర్కారుకు న్యాయస్థానంలో చుక్కెదురయ్యింది. అమరావతిలో మౌలిక వసతులను అభివ్రుద్ధి చేయాలని కోర్టు స్పష్టం చేసింది. ఇందుకుగాను నిర్ణీత గడువు కూడా ఇచ్చింది. అయితే ఇక్కడే జగన్ సర్కారు కొత్త నాటకానికి తెరలేపింది. నాడు చంద్రబాబు రైతుల నుంచి ఎలా భూములు సేకరించారో.. అలాగే అమరావతి భూములను వేలం వేసి నిధులు సమీకరించుకోవాలని భావిస్తోంది. నాడు చంద్రబాబు ఇచ్చిన పిలుపునకు అమరావతి ప్రాంత రైతులు స్పందించి 33 వేల ఎకరాలను అందించారు. సాక్షాత్ ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ ఆ భూమి ఏ మూలకు సరిపోతుంది.. ఇంకా సేకరించాలని సూచించారు. తీరా అధికారంలోకి వచ్చాక మడత పేచీ వేశారు. అది అసలు రాజధానియేనా అని ప్రశ్నించారు. కొందరు మంత్రులైతే దానిని శ్మశానంతో పోల్చారు. అంతటితో ఆగని వైసీపీ సర్కారు అమరావతిని శాసన రాజధానికే పరిమితం చేసింది. విశాఖను పాలనా రాజధానిగా, కర్నూలును న్యాయ రాజధానిగా ప్రకటించారు. దీంతో అమరావతి ఉద్యమం ఎగసిపడింది. సుదీర్ఘ కాలం కొనసాగింది. దీనిపై న్యాయస్థానంలో అమరావతికి అనుకూలంగా తీర్పు వచ్చింది. అమరావతిలో మౌలిక వసతులు కల్పించాల్సిందేనని న్యాయస్థానం స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది. దీంతో ప్రభుత్వం కొంత వెనక్కి తగ్గినట్టే తగ్గి ఇప్పుడు అమరావతి ప్రాంతంలో చంద్రబాబు సర్కారు వివిధ కంపెనీలకు కేటాయించిన భూములను వేలం వేసి విక్రయించాలని ప్రయత్నిస్తోంది. ఇప్పటికే 600 ఎకరాలను గుర్తించింది. ప్రస్తుతానికి 248 ఎకరాలను విక్రయించడానికి నిర్ణయించింది. ఎకరాల రూ.10 కోట్లు చొప్పున రూ.2,480 కోట్లను సమీకరించడానికి సన్నాహాలు చేస్తోంది.
ప్రభుత్వంలో అంతర్మథనం..
అమరావతి రాజధానిపై కోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీచేసిన తరువాత ప్రభుత్వంలో అంతర్మథనం ప్రారంభమైంది. అంతకు ముందే శాసనసభలో మూడు రాజధానుల బిల్లును వెనక్కి తీసుకుంటున్నట్టు జగన్ ప్రభుత్వం ప్రకటించింది. ఇంతలో కోర్టు అమరావతికి అనుకూలంగా తీర్పునిచ్చింది. అమరావతిలో మౌలిక వసతులకల్పనపై ద్రుష్టిసారించాలని ఆదేశించింది. ఇప్పటికిప్పుడు అమరాతి రాజధానికి భారీగా నిధులు అవసరమని రాష్ట్ర ప్రభుత్వం చేసిన అభ్యర్థనను కోర్టు తోసిపుచ్చింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వానికి మౌలిక వసతులకల్పన అనివార్యంగా మారింది. ఈ నేపథ్యంలో రాజధాని ప్రాంత అభివ్రుద్ధి అథారిటీ (సీఆర్డీఏ) అప్పుల కోసం తెగ ప్రయత్నాలు చేసింది. బ్యాంకుల వద్ద చేయి చాచింది.
Also Read: Muslim Schemes in AP: బీజేపీకి కోపం రాకుండా “ముస్లిం పథకాలు” జగన్ నిలిపివేశాడా!?
కానీ ఎక్కడా రూపాయి అప్పు పుట్టలేదు. కొన్ని బ్యాంకులు అప్పులు ఇచ్చేందుకు సమ్మతించాయి. కానీ అందుకు ప్రభుత్వం గ్యారెంటీ ఉండాలన్న షరతు విధించాయి.సహజంగా అమరావతి రాజధానికి అనుకూలంగా లేని ప్రభుత్వ పెద్దలు ఇందుకు ససేమిరా అన్నారు. సంక్షేమ పథకాలు, ఉద్యోగుల జీతాలకు ఇప్పటికే ఎడాపెడా అప్పులు చేశారు. నెలకు రూ.6 వేల కోట్లు అప్పుచేస్తే కానీ గడవని పరిస్థితి రాష్ట్రంలో నెలకొంది. దీంతో కార్పొరేషన్ల పేరిట ఎడాపెడా అప్పులు చేస్తున్న ప్రభుత్వం దానికి మాత్రం ష్యూరిటీగా ఉంటోంది. కానీ అమరావతి రాజధాని మౌలిక వసతుల విషయంలో మాత్రం ముఖం చాటేస్తోంది. ఇప్పుడు ఏకంగా అమరావతికి సేకరించిన భూములనే విక్రయించేందుకు సిద్ధమవుతోంది.
నాడు సులువుగా భూ సమీకరణ..
నాడు చంద్రబాబు అమరావతిని అభివ్రుద్ధి చేయాలని సంకల్పించారు. రైతుల ద్వారా సులువుగా భూములను సమీకరించారు. వివిధ కంపెనీలకు భూములు కేటాయించారు. తద్వారా ఈ ప్రాంతం అభివ్రుద్ధితో పాటు పెద్ద ఎత్తున యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వస్తాయని వ్యూహాత్మకంగా ముందుకు సాగారు. స్వల్పకాలంలో రాజధాని అభివ్రుద్ధి చేయాలని కూడా భావించారు. కానీ ఆయన అనుకున్నది ఒకటి.. ప్రజలు అనుకున్నది మరోకటి. అధికార మార్పిడితో మొత్తానికే మోసం వచ్చింది. వాస్తవానికి చంద్రబాబు సింగపూర్ కంపెనీతో ఒప్పందం చేసుకొని రాజధాని ప్రాంతాన్ని అభివ్రుద్ధి చేసేందుకు మాస్టర్ ప్లాన్ రూపొందించుకున్నారు. విద్య, వైద్య, వాణిజ్య..ఇలా అన్నిరంగాల పరిశ్రమలకు రాజధాని ప్రాంతంలో భూములు కేటాయించారు. అదే సమయంలో ప్రభుత్వానికి సంబంధించి కార్యాలయాలు, అధికారులు, ఉద్యోగులు, సిబ్బందికి క్వార్టర్లు, నివాస గ్రుహాలు కట్టించారు. శరవేగంగా పనులు జరిపించారు. దీంతో కంపెనీలు తమ కార్యకలాపాలు ప్రారంభించేందుకు సుముఖత చూపాయి. అయితే రాష్ట్రంలో అధికార మార్పిడి అమరావతికి శాపంగా మారింది. అమరావతి చంద్రబాబు మానస పుత్రికగా మారిపోతుందని.. చంద్రబాబు చరిత్రలో నిలిచిపోతారని భావించి జగన్ మూడు రాజధానులను తెరపైకి తెచ్చారు. కానీ ఇప్పటివరకూ దానిని కొలిక్కి తేలేకపోయారు. తప్పనిసరి పరిస్థితుల్లో ఇప్పుడు అమరావతిలో మౌలిక వసతులు ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. కానీ ప్రభుత్వం నుంచి నిధులు విడుదలకు మొగ్గు చూపడం లేదు. అలాగని అప్పు తెచ్చి అభివ్రుద్ధి చేయడానికి సుతారం ఇష్టపడడం లేదు. అందుకే వివిధ కంపెనీలకు కేటాయించిన భూములను అమ్మి ఒక్కో పని మొదటు పెట్టాలని నిర్ణయించారు.
Also Read:Teachers Assets: టీచర్ల దెబ్బకు వెనక్కి తగ్గిన ప్రభుత్వం.. అసలు కథ ఇదీ