ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ పోరు ముగిసింది. ఈ ఎన్నికల్లో అధికార వైసీపీ మద్దతుదారులు మెజారిటీ చోట్ల విజయం సాధించారు. ఇప్పుడు మున్సిపల్ సమరానికి తెరలేచింది. ఈ ఎన్నికల్లోనైనా సత్తాచాటి అధికార పక్షానికి సవాల్ గా నిలవాలని చూస్తున్నాయి విపక్షాలు. విజయాన్ని పునరావృతం చేసి, జైత్రయాత్ర కొనసాగించాలని చూస్తోంది అధికార పక్షం. మరి, ఏం జరగబోతోంది? మునిసిపల్ ఎన్నికల్లో ఏ పార్టీ హవా కొనసాగనుంది? అనేవిషయం ఇప్పుడు రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది.
Also Read: అంటించిన కేంద్రం: రగిలిన విశాఖ ‘ఉక్కు’ ఉద్యమం..
అయితే.. అందుతున్న సమాచారం ప్రకారం.. పలు సర్వే రిపోర్టుల ప్రకారం.. అన్నిచోట్లా అధికార పార్టీ హవా కొనసాగనుందని స్పష్టమవుతోంది. రాష్ట్రంలో మొత్తం 12 కార్పొరేషన్లు ఉండగా.. అన్నింటినీ వైసీపీ గెలుచుకుని క్లీన్ స్వీప్ చేస్తుందని సమాచారం. మరి, విపక్షాలకు ఎన్ని సీట్లు రాబోతున్నాయి? ప్రధాన ప్రతిపక్షం పరిస్థితి ఏంటీ? మొత్తంగా.. ఈ ఫలితాలు ఎలా ఉండబోతున్నాయన్నది చూద్దాం.
అనంతపురంః ఈ మునిసిపాలిటీ కార్పొరేషన్ లో మొత్తం 50 డివిజన్లు ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితుల ప్రకారం అంతటా వైసీపీ గాలి వీస్తోందనే ప్రచారం సాగుతోంది. దీంతో.. ఎన్నికల్లో అధికార పార్టీ హవా సాగనుందట. ఫలితంగా.. వైసీపీ 40 డివిజన్లలో జెండా ఎగరేయనుందని తెలుస్తోంది. ప్రధాన ప్రతిక్షం టీడీపీ కేవలం 5 చోట్ల మాత్రమే గెలుస్తుందట. రెండు చోట్ల మాత్రం ఇండిపెండెట్లు విజయం సాధించే అవకాశాలున్నాయి. మరో మూడు చోట్ల హోరాహోరీ సాగుతుందట.
తిరుపతిః ఈ కార్పొరేషన్లో 50 స్థానాలున్నాయి. ఇందులో కూడా వైసీపీ మెజారిటీ స్థానాలు దక్కించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. వైసీపీ 39 డివిజన్లను సొంతం చేసుకోనుండగా.. ఇక్కడ కూడా టీడీపీ 5 స్థానాలకే పరిమితం కానుందట. 6 చోట్ల మాత్రం నువ్వా?నేనా? అన్నట్టుగా ఉంటుందట.
చిత్తూరూః ఇక్కడ కూడా మొత్తం 50 డివిజన్లు ఉన్నాయి. ఈ కార్పొరేషన్లో ఎలాగైనా సత్తాచాటాలని టీడీపీ చూస్తోంది. కానీ.. ఆ పార్టీ ఆశలు నెరవేరేలా కనిపించట్లేదు. 45 డివిజన్లలో వైసీపీ గెలుస్తుందని అంచనా. టీడీపీ కేవలం 2 స్థానాలతోనే సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి ఉందట. 3 చోట్ల మాత్రం హోరాహోరీ పోరు సాగనుంది.
గుంటూరుః ఈ జిల్లా కేంద్రంలో మొత్తం 57 డివిజన్లు ఉన్నాయి. ఇక్కడ కూడా వైసీపీ హవా కొనసాగనుంది. 43స్థానాలను అధికార పార్టీ కైవసం చేసుకోనుంది. టీడీపీ 6 చోట్ల జెండా ఎగరేస్తుంది. ఇండిపెండెంట్లు ఒకచోట గెలుస్తారు. 7 చోట్ల మాత్రం టగ్ ఆఫ్ వార్ ఉంటుంది.
కర్నూలుః ఈ కార్పొరేషన్లో 52 స్థానాలున్నాయి. ఇక్కడ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 40 స్థానాలను గెలుచుకోనుంది. తెలుగు దేశం పార్టీ 6 స్థానాలతోనే సంతృప్తి చెందే పరిస్థితి కనిపిస్తోంది. ఒక్క స్థానంలో పోటాపోటీగా ఉంటుంది.
ఒంగోలుః ఇక్కడ కూడా అదే ఫలితం పునరావృతం అవుతుందని సమాచారం. మొత్తం 50 స్థానాలున్న ఈ కార్పొరేషన్లో అధికార పార్టీ 35 స్థానాలో జయకేతనం ఎగరేయనుందట. ప్రధాన ప్రతిపక్షం కేవలం 7 స్థానాల్లో గెలిచే పరిస్థితి కనిపిస్తోంది. 8 చోట్ల మాత్రం విజయం కోసం ఇరు పార్టీలూ పోటీ పడనున్నాయి.
గ్రేటర్ విశాఖః రాష్ట్రంలోనే ప్రతిష్టాత్మకమైన.. పరిపాలనా రాజధానిగా ప్రకటించిన.. గ్రేటర్ విశాఖలో సత్తా చాటేందుకు అధికార విపక్షాలు సర్వ శక్తులూ ఒడ్డుతున్నాయి. ఇక్కడ మొత్తం 98 డివిజన్లు ఉన్నాయి. అయినప్పటికీ వైసీపీ 50 స్థానాలు సొంతం చేసుకోనుందట. ఇక్కడ టీడీపీకి కూడా మంచి ఫలితాలు వచ్చేలా కనిపిస్తున్నాయి. ఆ పార్టీ 20 చోట్ల విజయం సాధించనుంది. బీజేపీ-జనసేన ఒక స్థానంలో గెలిచే అవకాశం కనిపిస్తోంది. ఇక, మిగిలిన 27 చోట్ల హోరాహోరీ పోరు ఖాయంగా తెలుస్తోంది.
Also Read: సీఎం కేసీఆర్ కొత్త పీఆర్వోగా ఈ సీనియర్ జర్నలిస్ట్?
విజయనగరంః ఈ కార్పొరేషన్లో మొత్తం 50 డివిజన్లు ఉన్నాయి. ఇందులో వైసీపీ 32 చోట్ల గెలుపు బావుటా ఎగరేయనుంది. టీడీపీ కూడా గట్టిపోటీ ఇవ్వనుంది. ఆ పార్టీ 14 స్థానాలను కైవసం చేసుకోనుంది. నాలుగు చోట్ల మాత్రం నువ్వా నేనా అన్నట్టుగా ఉంటుంది.
ఏలూరుః ఇక్కడ కూడా మొత్తం 50 స్థానాలున్నాయి. ఇందులో అధికార పార్టీ మెజారిటీ స్థానాలను సొంతం చేసుకోబోతోంది. ఇక్కడ 37 డివిజన్లు వైసీపీ ఖాతాలో పడనుండగా.. టీడీపీ 9చోట్ల జెండా ఎగరేయనుంది. నాలుగు చోట్ల మాత్రం టగ్ ఆఫ్ వార్ ఉంటుంది.
విజయవాడః రాష్ట్రంలో రాజకీయం మరో కీలక ప్రాంతమైన విజయవాడలో మొత్తం 64 డివిజన్లు ఉన్నాయి. రాజధాని తరలింపు అంశం ఏమైనా ప్రభావం చూపిస్తుందా? అనుకున్నప్పటికీ.. అదేమీ కనిపించదని స్పష్టమవుతోంది. ఇక్కడ వైసీపీ 38 స్థానాలు గెలుచుకోనుందట. టీడీపీ 12 స్థానాలతో సరిపెట్టుకోబోతోందట. 14 చోట్ల మాత్రం హోరాహోరీ పోరు ఖాయంగా తెలుస్తోంది.
కడపః ఇక వైసీపీకి అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ కార్పొరేషన్లో అధికార పార్టీ ఏకపక్షంగా విజయం సాధించనుందని తెలుస్తోంది. మొత్తం 50 డివిజన్లు ఉండగా.. 49 చోట్ల జగన్ జెండా ఎగరనుందట. మిగిలిన ఒక్క స్థానంలో టీడీపీ గట్టిపోటీ ఇస్తుందని సమాచారం.
ఈ విధంగా.. ఏపీలో త్వరలో జరగబోయే మునిసిపల్ ఎన్నికల్లో వైసీపీ ఏకపక్షంగా విజయం సాధిస్తుందని, మొత్తం 12 కార్పొరేషన్లనూ అధికార పార్టీ సొంతం చేసుకోనుందని చెబుతున్నాయి సర్వేలు. మరి, ఏం జరుగుతుంది? ఫలితాలు ఈ అంచనాలను ఎంతమేర ప్రతిబింబిస్తాయి? అన్నది చూడాలి.
మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్