Jagan: ఏపీ సీఎం జగన్ చర్యలు మరీ విచిత్రంగా ఉన్నాయి. సొంత పక్షం వారికి కాదు రాజకీయ ప్రత్యర్థులకు సైతం.. ఆయన చర్యలు మింగుడు పడడం లేదు.భారీ స్థాయిలో ప్రక్షాళన చేసి సొంత పార్టీ శ్రేణులను సైతం విస్మయపరుస్తున్నారు. మీరు మీ నియోజకవర్గంలో గెలవలేరని చెప్పి వారి అహానికే పరీక్ష పెడుతున్నారు. కానీ జగన్ చర్యలను వ్యతిరేకిస్తున్న వారు పార్టీని వీడుతున్నారు. రాజకీయ అవకాశాలు లేని వారు ఇక్కడే కొనసాగాలని డిసైడ్ అయ్యారు. మరికొందరైతే రాజకీయాలనుంచి తప్పుకోవాలని భావిస్తున్నారు.సీఎం జగన్ ఒకసారి నిర్ణయం తీసుకుంటే.. దానిలో పునరాలోచన ఉండదని వైసిపి వర్గాలు చెబుతున్నాయి.
జగన్ ఎవడి మాట వినడు.. మొండివాడు.. ఇలా జగన్ గురించి రకరకాల విశ్లేషణలు ఉన్నాయి. ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా అభ్యర్థుల మార్పుతో ఇది ప్రస్ఫుటమయింది. రకరకాల సర్వేలు, నివేదికలు, సామాజిక, రాజకీయ సమీకరణలను అనుసరించి జగన్ నిర్ణయం తీసుకుంటున్నారు. అయితే మీ నియోజకవర్గాల్లో నీపై వ్యతిరేకత ఉంది. వచ్చే ఎన్నికల్లో నువ్వు గెలవలేవు అని చెబుతుండడంతో సొంత పార్టీ ఎమ్మెల్యేలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. లోలోపల రగిలిపోతున్నారు. నా నియోజకవర్గంలో గెలవలేనని చెప్పడానికి ఈయన ఎవరు? అని లోలోపల ప్రశ్నించుకుంటున్న వారు ఉన్నారు. తిట్టుకుంటున్న వారు ఉన్నారు. కానీ ప్రత్యామ్నాయ అవకాశాలు లేక సైలెంట్ గా ఉన్నారు. అయితే ఇటువంటి నేతల విషయంలో ఏం జరుగుతుందో తెలియని అమాయకుడు జగన్ కాదు. టిక్కెట్ ను తప్పిస్తే పార్టీ ఓటమికి పనిచేస్తారని తెలుసు. అయినా సరే తన మొండి నిర్ణయంతో ముందుకు సాగుతున్నారు. తన స్ట్రాటజీతో అడుగులు వేస్తున్నారు.
సాధారణంగా విపక్షాలు అభ్యర్థులను ప్రకటించిన తర్వాతే.. వారికి ధీటైన అభ్యర్థులను అధికార పార్టీ రంగంలోకి దించుతుంది. కానీ జగన్ ఇక్కడ కూడా దూకుడుగా వ్యవహరించారు. పెద్ద ఎత్తున అభ్యర్థులను మార్చి విపక్షాలపై ప్రభావం చూపుతున్నారు. ఎస్సీ, బీసీ నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున మార్పు చేసి సరికొత్త అభ్యర్థులను రంగంలోకి దించుతున్నారు. ఆ రెండు వర్గాలకు ప్రాధాన్యం కల్పిస్తున్నారు. సహజంగా ఇది విపక్షాలకు మింగుడు పడని అంశం. ఇప్పటికే కొన్ని నియోజకవర్గాల విషయంలో ఒక క్లారిటీ ఉంది. అటువంటి చోట బీసీ ఎస్సీ అభ్యర్థులను జగన్ పోటీలో దించుతున్నారు. దీంతో విపక్షాలు సైతం తమ అభ్యర్థులను మార్చక తప్పని పరిస్థితి. అదే జరిగితే విపక్షంలో కూడా అసంతృప్తులు రేగుతాయి. అందుకే ఈ తరహా ప్రయోగాన్ని జగన్ ప్రారంభించారు. ఎవ్వరికీ మింగుడు పడని విధంగా వ్యూహాలతో ముందుకు సాగుతున్నారు. ఎన్ని ప్రతికూలతలు వచ్చినా దూకుడుగానే ముందుకు వెళ్లాలని చూస్తున్నారు.