ACB App in AP: ఇష్టారాజ్యంగా లంచాలు డిమాండ్ చేస్తామంటే కుదరదు. క్లీయర్ గా వీడియో, ఆడియో సంభాషణలు నేరుగా ఫోన్ లో నిక్షిప్తమవుతాయి. అవే నేరుగా ముఖ్యమంత్రి కార్యాయానికి వెళ్లిపోతాయి. నిమిషాల వ్యవధిలో ఉన్నతాధికారుల ద్రుష్టకి అవినీతి సమాచారం చేరిపోతుంది. అంతే స్పీడ్లో చర్యలు తీసుకుంటారు. ఏపీలో లంచాలకు చెక్ చెబుతూ ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. కార్యాలయాల్లో అధికారులు, సిబ్బంది లంచం డిమాండ్ చేస్తే కొరడా ఝుళిపించనుంది. ఇందుకుగాను ఏసీబీ ప్రత్యేకంగా ‘ఏసీబీ 14400’ యాప్ ను రూపొందించింది. బుధవారం యాప్ ను ముఖ్యమంత్రి జగన్ ఆవిష్కరించారు. అవినీతికి ఏమాత్రం తావులేని స్వచ్ఛమైన పాలన అందించడమే మనందరి కర్తవ్యం కావాలని అధికార యంత్రాంగానికి ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఎవరైనా సరే.. ఎక్కడైనా సరే.. అవినీతికి పాల్పడితే కచ్చితంగా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఇటీవల రాష్ట్రంలో అవినీతి రాజ్యమేలుతుందన్న ఆరోపణల నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. అవినీతి నిరోధక శాఖను బలోపేతం చేసి రాష్ట్రంలో అవినీతికి చెక్ చెప్పాలని భావించింది. అందులో భాగంగానే ఈ యాప్ ను ప్రత్యేకంగా అందుబాటులోకి తెచ్చింది. అండ్రాయిడ్, మొబైల్ ఫోన్ ఉన్న ప్రతిఒక్కరూ ఈ యాప్ ను వినియోగించుకోవచ్చు.
డేటా నేరుగా ఏసీబీకి
అవినీతి నిర్మూలనకు మరో విప్లవాత్మక మార్పు తీసుకొచ్చినట్టు అవినీతి నిరోధక శాఖ ప్రకటించింది. అది కలెక్టరేట్ అయినా, ఆర్డీవో కార్యాలయమైనా, సబ్ రిజిస్ట్రార్ ఆఫీసు అయినా, మండల కార్యాలయం అయినా, పోలీస్‌స్టేషన్ అయినా, వలంటీర్లు.. సచివాలయం.. 108.. 104 సర్వీసులు అయినా.. ఎవరైనా సరై .. ఎక్కడైనా లంచం అడిగితే వెంటనే మొబైల్‌లో ‘ఏసీబీ 14400’ యాప్ బటన్ నొక్కి వీడియో / ఆడియో సంభాషణ రికార్డు చేసుకోవాలి. ఆ డేటా నేరుగా ఏసీబీకి చేరుతుంది. ఏసీబీ నేరుగా సీఎంవోకు నివేదిస్తుంది. అయితే ఈ ప్రక్రియలో జిల్లా కలెక్టర్, ఎస్పీలకు సైతం ప్రభుత్వం కీలక బాధ్యతలు అప్పగించింది. ఎక్కడైనా అధికారులు, సిబ్బంది అవినీతికి పాల్పడినట్టు ఫిర్యాదులు అందించే వెనువెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.
Also Read: TDP- Cinema Stars: టీడీపీలో ఇమడలేకపోతున్న సినీ తారలు.. పొమ్మనలేక పొగపెడుతున్న నేతలు
ఎలా పని చేస్తుందంటే..
గూగుల్ ప్లే స్టోర్‌లో ‘ఏసీబీ 14400’ యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలి. మొబైల్ నంబర్‌కు వచ్చే ఓటీపీని నమోదు చేయడం ద్వారా వినియోగానికి సిద్ధంగా ఉంటుంది. అవినీతి వ్యవహారాలకు సంబంధించిన ఆడియో, వీడియో, ఫొటోలను నేరుగా లైవ్ రిపోర్ట్ ఫీచర్ వినియోగించుకుని అక్కడికక్కడే ఫిర్యాదు చేసే అవకాశం ఉంది. లాడ్జ్ కంప్‌లైంట్ ఫీచర్ ద్వారా తమ దగ్గరున్న డాక్యుమెంట్లు, వీడియో, ఆడియో, ఫొటో ఆధారాలను ఏసీబీకి పంపించవచ్చు. ఫిర్యాదు రిజిస్టర్ చేయగానే మొబైల్ ఫోన్‌కు రిఫరెన్స్ నంబరు వస్తుంది. త్వరలో ఐఓఎస్ వెర్షన్‌లోనూ యాప్‌ను సిద్ధం చేస్తున్న ఏసీబీ.