https://oktelugu.com/

CM Jagan: జగన్ అనేదొక్కటి.. చేసేదొక్కటా?

శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు వైసీపీలో సీనియర్లు ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. హై కమాండ్ చేస్తున్న సర్వేల్లో సైతం ఇది తేలుతోంది. కానీ వారు ఎవరిని మార్చే సాహసం జగన్ చేయరని పార్టీలోనే ఒక ప్రచారం జరుగుతోంది.

Written By:
  • Dharma
  • , Updated On : November 18, 2023 / 01:44 PM IST

    CM Jagan

    Follow us on

    CM Jagan: ఏపీ సీఎం జగన్ నోరు తెరిస్తే నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు అని ప్రకటనలు చేస్తారు. కానీ వారి విషయంలో మాత్రం ఉదాసీనంగా వ్యవహరిస్తుంటారు. పేరుకే ఆయా వర్గాలకు మంత్రులు కానీ.. అధికారాల అంతా సకల శాఖామంత్రి కి అప్పగిస్తారు. సజ్జల వారే అన్ని నిర్ణయాలు తీసుకుంటారు. కేవలం బుగ్గ కారు, సెక్యూరిటీ, దర్పం తప్ప.. మిగతా విషయాల్లో ఫలితం శూన్యమని బాధిత వర్గాల నేతలకు తెలుసు. కానీ అధికారమనే కోణంలోనే ఆలోచిస్తూ కాలం గడిపేస్తున్నారు. అయితే ఎన్నికలు సమీపిస్తుండడంతో ఇటువంటి వారిని రాజకీయ సమాధి చేసేందుకు సిద్ధపడుతున్నారు అన్న వార్తలు వినిపిస్తున్నాయి.

    శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు వైసీపీలో సీనియర్లు ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. హై కమాండ్ చేస్తున్న సర్వేల్లో సైతం ఇది తేలుతోంది. కానీ వారు ఎవరిని మార్చే సాహసం జగన్ చేయరని పార్టీలోనే ఒక ప్రచారం జరుగుతోంది. అయితే ఎలాగైనా గెలవాలన్న కసితో ఉన్న జగన్ బీసీ, ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాల విషయంలో మాత్రం ఒక ఆలోచన చేస్తున్నారు. ఆయా వర్గాల్లో ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటున్న వారికి ముఖం మీద చెప్పేస్తున్నారు. అవకాశముంటే ప్రత్యామ్నాయ అవకాశాలు కల్పిస్తాను. లేకుంటే మాత్రం బాధపడకండి అంటూ నిర్మోహమాటంగా చెబుతున్నారు. అయితే ఈ విషయంలో కొందరు సీనియర్లకు, అగ్రవర్ణాల నాయకులకు మినహాయింపు ఇస్తుండడం పార్టీలో ఒక రకమైన చర్చ నడుస్తోంది. ప్రజా వ్యతిరేకత ఉంటే అందర్నీ మార్చేయాలన్న డిమాండ్ వినిపిస్తోంది. కానీ జగన్ ఇవేవీ పట్టించుకోవడం లేదు. కొన్ని నియోజకవర్గాల విషయంలో ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.

    గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మేకతోటి సుచరితకు వేమూరు, అక్కడ ఎమ్మెల్యేగా ఉన్న నేరుగా నాగార్జునను సంతనూతలపాడుకు, సంతనూతలపాడు ఎమ్మెల్యే సుధాకర్ బాబును గుంటూరు జిల్లాలో ఏదో ఒక ఎస్సి నియోజకవర్గం నుంచి పోటీ చేయించేందుకు జగన్ సిద్ధపడుతున్నట్లు సమాచారం. వీరంతా ఎస్సి నేతలు కావడం గమనార్హం. ఇక క్యాబినెట్లో తనకు ప్రీతిపాత్రుడైన ఆదిమూలపు సురేష్ విషయంలో సైతం జగన్ వేరే ఆలోచనతో ఉన్నారు. ఆయనకు సర్వేల్లో వ్యతిరేక ఫలితాలు వస్తుండడంతో స్థానచలనం తప్పనిసరి అని భావిస్తున్నారు. ఆయన్ను ఎర్రగొండపాలెం నుంచి కొండపి పంపించాలని చూస్తున్నారు. తిరుపతి జిల్లా సూళ్లూరుపేట ఎమ్మెల్యే సంజీవయ్య, సత్యవేడు, గూడూరు ఎమ్మెల్యేలను సైతం పక్కకు తప్పించాలని.. అవకాశం ఉంటే సరి.. లేకుంటే టిక్కెట్ కష్టమని పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది.

    అయితే చాలామంది సీనియర్లు, జగన్ సొంత సామాజిక వర్గానికి చెందిన నేతలు వెనుకబాటు జాబితాలో ఉన్నారు. సర్వేల్లో సైతం వారిపై వ్యతిరేక ఫలితాలు వస్తున్నాయి. కానీ వారి విషయంలో జగన్ ఎటువంటి ఆలోచన చేయడం లేదు. మిమ్మల్ని మార్చుతామని చెప్పడం లేదు. కానీ ఎస్సీ ఎస్టీ బీసీ ఎమ్మెల్యేల విషయంలో మాత్రం ఖరాకండిగా చెబుతుండడం పార్టీలో ఒక రకమైన చర్చ జరుగుతోంది. అంతిమంగా ఇది పార్టీకి నష్టం చేకూరుస్తుందని అభిప్రాయం వినిపిస్తోంది.