Revanth Reddy: తెలంగాణకు కాబోయే సీఎం రేవంత్‌రెడ్డి అన్నట్లుగా టీపీసీసీ చీఫ్ ప్రమోట్ చేసుకుంటున్నారు. ఆలు లేదు.. చూలు లేదు.. కొడుకు పేరు సోమలింగం అన్నట్లు.. ఎన్నికలు జరగలేదు.. నెగ్గింది లేదు.. కానీ సీఎంపై మాత్రం అప్పుడు కాంగ్రెస్‌లో పోటీ మొదలైంది. ఈ క్రమంలో టీపీసీసీ చీఫ్ మైండ్‌గేమ్‌కు తెర తీశారు. తనను సీఎంగా ప్రమోట్ చేయించుకుంటున్నారు. ఇందుకు ఓ వర్గం మీడియా వత్తాసు పలుకుతోంది.
జాతీయ పార్టీలు ఇలా..
సాధారణంగా జాతీయ పార్టీలు సీఎం అభ్యర్థి ఎవరనేది ముందే తేల్చి చెప్పవు. ఎందుకంటే ఒకరిని ప్రకటిస్తే, పార్టీలో వంద మందికి కోపం వచ్చి, అసలుకే ఎసరొస్తుందనే భయంతో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుంటాయి. అయితే టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి, ఎల్లో మీడియాధిపతులు కూడబలుక్కుని తెలంగాణలో సరికొత్త నాటకానికి తెరలేపారు. కాంగ్రెస్‌కు రేవంత్‌డ్డే దిక్కు అని, ఆ పార్టీ విజయానికి అతనొక్కడే ఒంటరి పోరాటం చేస్తున్నారనే హైప్ క్రియేట్ చేయడాన్ని కొన్ని రోజులుగా గమనించొచ్చు. కాంగ్రెస్ ప్రచార బాధ్యతల్ని రేవంత్రెడ్డి మాత్రమే భుజాన వేసుకుని తిరుగుతున్నారని, మిగిలిన వారంతా తమ నియోజకవర్గాలకే పరిమితం అయ్యారనే ప్రచారాన్ని ఉధృతంగా నిర్వహించడం వెనుక పెద్ద వ్యూహామే వుంది.
రేవంత్‌కు మద్దతు కష్టమే..
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అందరికీ ఆమోద యోగ్యమైన లీడర్ నే సీఎం చేస్తారు. అయితే రేవంత్ అందరికీ ఆమోద యోగ్యమైన నాయకుడు కాదు. ఎందుకంటే ఆయనపై చంద్రబాబు శిష్యుడనే ముద్ర వుంది. టీడీపీ, చంద్రబాబు ప్రయోజనాల కోసం మాత్రమే పని చేస్తారనే ఆరోపణ ఉంది. రేవంత్ కు ప్రత్యర్థి పార్టీల్లో కంటే స్వపక్షంలోనే ఎక్కువ మంది శత్రువులున్నారు. ఒకవేళ తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే సీఎల్పీ నేత భట్టి విక్రమార్కను సీఎం చేస్తారనే ప్రచారం బలంగా వుంది. దళిత నాయకుడు, సోనియాగాంధీ కుటుంబానికి విధేయుడు, సుదీర్ఘ కాలంగా పార్టీలో వుంటున్న నాయకుడిగా భట్టి విక్రమార్కకు చిన్నస్థాయి నుంచి పెద్దస్థాయి వరకూ అందరి మద్దతు ఉంది. భట్టికి పార్టీలో అనుకూల పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని తనకు అనుకూలమైన మీడియాను రేవంత్ అడ్డుపెట్టుకుని, పార్టీ అధికారంలోకి వస్తే, అది కేవలం తన కష్టార్జితం మాత్రమే అని ఇప్పటి నుంచే గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారు.
ఇంటర్వ్యూల్లో ప్రశ్న అడిగించుకుంటూ..
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. మీరే సీఎం అని ఇంటర్వ్యూల్లో మీడియాధిపతులు అంటుంటే, రేవంత్రెడ్డి ఖండించకపోవడాన్ని గమనించొచ్చు. తమ అధిష్టానం సీఎం అభ్యర్థిని నిర్ణయిస్తుందనే మాట ఆయన నోటి నుంచి రావడం లేదు. ఎందుకంటే ఇదంతా ఎల్లో మీడియాధిపతులతో కలిసి రేవంత్‌రెడ్డి ఆడుతున్న మైండ్ గేమ్. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే, సీఎం అభ్యర్థిగా మరొకరి పేరు తెరపైకి రాకుండా, ఇప్పటి నుంచే వ్యూహాత్మకంగా మిగిలిన నేతల్ని పక్కకు తప్పిస్తున్నారు. రేవంత్ ప్రయత్నాలను ఆ పార్టీ నేతలు కూడా నిశితంగా గమనిస్తున్నారు.