AP Cabinet Reshuffle 2022: తీసేస్తే అందర్నీ తీసేయ్యండి. కానీ మమ్మల్ని తీసి వేరొకరిని ఉంచితే మాత్రం ఇబ్బందులు తప్పవు. అది మా అసమర్థత కింద వస్తుంది. రాజకీయంగా కూడా మాకు నష్టం జరుగుతుంది. అందుకే ఒకటికి రెండు సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకుంటే మంచిది. లేకుంటే మీ ఇష్టం… పార్టీ అధినేత జగన్ కు కొందరు సీనియర్ల మంత్రులు పంపుతున్న రాయభారం ఇది. అయితే దీనిని అల్టిమేటం అనుకోవాలో, హెచ్చరికలు అనుకోవాలో తెలియడం లేదు. అంతా ప్రశాంతంగా ఉందన్న తరుణంలో మంత్రుల నుంచి వచ్చిన హెచ్చరికలు వైసీపీ అధిష్టానికి ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. అదే మంత్రివర్గ విస్తరణలో ప్రతిష్ఠంభనకు కారణంగా తెలుస్తోంది. మంత్రివర్గ విస్తరణ నేపథ్యంలో కొందరు మంత్రులను మార్చక తప్పదని సీఎం జగన్ వైఎస్సార్ఎల్పీ సమావేశంలోనూ, మంత్రివర్గ సమావేశంలోను ప్రస్తావించిన సంగతి తెలిసిందే. తొలుత ఇప్పుడున్న మంత్రుల్లో అందర్నీ మారుస్తామని లీకులిచ్చారు. తీరా 90 శాతం మందిని మాత్రమే మార్చుతామని చెబుతున్నారు. సీనియర్లకు ఉద్వాసన తప్పదంటున్నారు. వారికి అంతే ప్రాధాన్యమున్న పార్టీ పగ్గాలు అప్పగిస్తామని చెప్పుకొస్తున్నారు. ఇది సీనియర్ మంత్రులకు మింగుడు పడడం లేదు. ప్రధానంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, బాలినేని శ్రీనివాస్ రెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిలు సీఎం తీరుతో కుతకుతలాడుతున్నట్టు తెలుస్తోంది. ఇది ఎటువైపు దారితీస్తుందోనన్న భయం పార్టీ శ్రేణుల్లో వెంటాడుతోంది.
Also Read: Kodali Nani Comments On Minister Post: కొడాలి నానికి మంత్రి పదవి దక్కుతుందా? లేదా?
నాడు అలా.. నేడు ఇలా
2019 వైసీపీ ప్రభుత్వం కొలువుదీరినప్పుడు సీఎం జగన్ మంత్రివర్గం రెండున్నరేళ్ల పాటు కొనసాగుతుందన్నారు. అటు తరువాత కొందర్ని తొలగించి కొత్తవారికి అవకాశమిస్తామని చెప్పారు. అయితే రెండున్నరేళ్లు దాటినా ఇంతవరకు మంత్రివర్గంలో చేర్పులు, మార్పులు చేయలేకపోయారు. సీనియర్ మంత్రుల తొలగింపు విషయంలో ఎటువంటి అసమ్మతి లేకుండా చూసుకోవాలని ఆచీతూచీ అడుగులు వేస్తున్నారు. రకరకాలుగా లీకులిచ్చి పావులు కదుపుతున్నారు, అయితే అంతా ప్రశాంతంగా ఉందన్న తరుణంలో కొందరి తొలగింపు.. కొందర్ని కొనసాగింపు సీఎం జగన్ కు కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతోంది. తనకు అత్యంత సన్నిహితులైన మంత్రులు బాలినేని శ్రీనివాస్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి నుంచి అభ్యంతరాలు వ్యక్తం కావడంతో సీఎం షాక్ కు గురయ్యారు. వారి తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. తనకు మంత్రివర్గం నుంచి తొలగిస్తే చిత్తూరు జిల్లా నుంచి వేరొకరికి మంత్రిగా అవకాశం ఇవ్వొద్దని పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి అల్టిమేటం జారీచేయడం పెద్ద దుమారమే రేగింది. ఈ నేపథ్యంలో ఆయన తనయుడు, ఎంపీ మిథున్ రెడ్డి సీఎం జగన్ తో అత్యవసరంగా సమావేశం కావడం కూడా చర్చనియాంశమైంది. ఎట్టి పరిస్థితుల్లో తన తండ్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని మంత్రివర్గంలో కొనసాగించాల్సిందేనని మిథున్ రెడ్డిని కోరినట్టు తెలుస్తోంది. దీనికి సీఎం మెత్తబడ్డారని సమాచారం.
బాలినేని విశ్వరూపం
సీఎం జగన్ కు సమీప బంధువులు, అత్యంత సన్నిహితుడు బాలినేని శ్రీనివాస్ రెడ్డి సైతం కొత్త వాదనను తెరపైకి తెచ్చారు. తనను కానీ మంత్రివర్గం నుంచి తొలగిస్తే..తన జిల్లాకు చెందిన అదిమూలపు సురేష్ ను కొనసాగించకూడదని షరతు పెట్టారు. తీసేస్తే ఇద్దర్నీ తీసేయ్యండి తప్ప ఒక్కర్ని కొనసాగిస్తే ఒప్పుకునే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. సురేష్ ను కొనసాగిస్తే తనకు రాజకీయంగా ఇబ్బంది తప్పదని చెబుతున్నారు. ఇంధన శాఖ మంత్రిగా మెరుగైన సేవలందిస్తున్న తనను పక్కన పెడితే అసమర్థత ముద్ర పడుతుందని..ఇది తనకు వాంఛనీయం కాదంటున్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి అండగా ఉంటున్న తనను కాదని.. తన కంటే జూనియర్ అయిన అదిమూలపు సురేష్ ను కొనసాగించడమేమిటని ప్రశ్నిస్తున్నారు. అదే జరిగితే అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమని అధిష్టానానికి హెచ్చరికలు జారీ చేస్తున్నారు.
కారాలు, మిరియాలు నూరుతున్న బొత్స
మంత్రి బొత్స సత్యనారాయణ అయితే సీఎం జగన్ పై కారాలు, మిరియాలు నూరుతున్నారు. తనను పక్కన పెట్టాలన్న ఆలోచన ఎలా వచ్చిందని ప్రశ్నిస్తున్నారు. అసలు మంత్రుల తొలగింపు నిర్ణయమేమిటని అసహనం వ్యక్తం చేస్తున్నారు. సీనియర్లతో సంప్రదించకుండా ఈ నిర్ణయాలు ఏమిటని బాహటంగానే వ్యాఖ్యానిస్తున్నారు. మంత్రివర్గం నుంచి తీసేస్తూ మీ జిల్లా నుంచి ఎవర్ని ఎంపిక చేయాలో చెప్పండని అడగడం ఏమిటంటున్నారు. మూడేళ్లు మంత్రి పదవి పేరుకే చేపట్టామని..కొవిడ్ తో పనితీరు కనబరిచేందుకు కూడా ఇబ్బందికర పరిస్థుతులు ఎదురయ్యాయని.. ఈ సమయంలో మంత్రివర్గ విస్తరణ అవసరమా అని బొత్స ప్రశ్నిస్తున్నారు. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిది వింత పరిస్థితి. గత మూడేళ్లుగా ప్రభుత్వ అవసరాలకు ఆయన సేవలను వినియోగించుకున్నారు. ఈ మూడేళ్ల పాటు అప్పుల కోసం ఆయన తిప్పలు పడ్డారు. ఢిల్లీ చుట్టూ కాళ్లరిగేలా తిరిగారు. ఈ సమయంలో తనకు అండగా ఉండాల్సింది పోయి సీఎం జగన్ కరివేపాకులా వాడుకున్నారని ఆయన ఆక్రోషిస్తున్నారు. నిశ్చితంగా నడుస్తున్న మంత్రివర్గాన్ని విస్తరణ పేరుతో సీఎం జగన్ తేనె తుట్టను కదిపారని.. ఇది ఎటు దారితీస్తుందోనని పార్టీ శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి.