విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ రూపంలో ఏపీ బీజేపీ నేతలు పెద్ద తలనొప్పే మొదలైంది. ఈ విషయంలో ఏం మాట్లాడాలో.. ఎలా మాట్లాడాలో అర్థం కాక, నానా అవస్థలు పడుతున్నారు ఆ పార్టీ నేతలు. ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలంటూ సోమూవీర్రాజు ఆధ్వర్యంలో ఢిల్లీ వెళ్లిన ఏపీ నేతలు.. అధిష్టానాన్ని కలిసి విన్నవించి వచ్చారు. తమ వంతుగా చేయాల్సిన ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. కానీ.. కేంద్రం మాత్రం అమ్మకానికి దూకుడుగా ముందుకు వెళ్తుండడం వారిని మరింత ఇరకాటంలో పడేస్తోంది.
Also Read: 5 రాష్ట్రాల ఎన్నికలకు మోగనున్న నగారా
విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ అనేది ఆంధ్రుల సెంటిమెంట్‌కు సంబంధించిన అంశమని, మరోసారి ఆలోచించాలని ఢిల్లీ పెద్దలకు సోమూ వీర్రాజు ఇప్పటికే విన్నవించారు. అంతేకాదు.. ప్రధాని మోదీకి మూడు ప్రతిపాదనలు సమర్పించేందుకు సోము ప్రయత్నించారు. కానీ.. అపాయింట్ మెంట్ లభించలేదు. చివరకు కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ను కలిశారు. ఆయన సమస్య మొత్తం వివరించారు. విశాఖ ఉక్కును ప్రైవేటీకరించే ఆలోచన విరమించుకోవాలని కూడా కోరారు సోమూ. ఆ తర్వాత ఢిల్లీ వెళ్లిన సోము వీర్రాజు బృందం.. బీజేపీ అధ్యక్షుడు నడ్డాను కూడా కలిసి విశాఖ ఉక్కుపై నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని కోరారు.
ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత.. ప్రైవేటీకరణ నిర్ణయం ఇంకా తీసుకోలేదని, టీడీపీ, వైసీపీ దుష్ప్రచారం చేస్తున్నాయని చెప్పడానికి సిద్ధమయ్యారు. కానీ.. ఈ లోగానే స్టీల్ ప్లాంట్ అమ్మకానికి కమిటీ వేసింది కేంద్రం. ఇక, ప్రధానమంత్రి నరేంద్రమోడీ సైతం.. అమ్మకాలపై వెనక్కి తగ్గేది లేదని చెప్పారు. దీంతో.. ఏపీ ప్రజలంతా బీజేపీ నేతల వైపు చూస్తున్నారు. విపక్షాలు సైతం కాషాయ నేతలను ఇరుకునపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.
Also Read: ఉదారమే భారత విధానం.. ఉదాహరణలెన్నో!
దీంతో.. ఏం చెప్పాలో తెలియట్లేదు స్థానిక నేతలకు. అధిష్టానం మాత్రం.. పార్టీ వేరు, ప్రభుత్వం వేరు అనే రీతిన వ్యవహరించాలని చెబుతోందట. పార్టీ పరంగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకించాలని సూచిస్తోందని సమాచారం. కానీ.. అలా మాట్లాడితే స్థానికంగా మరిన్ని ఇబ్బందులు వస్తాయేమోనని ఆలోచిస్తున్నారు నేతలు. మరి, నేతలు ఏవిధంగా స్పందిస్తారో చూడాలి.
మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్