తమ అనుకూలంగా ఉంటే సరే.. లేదంటే మాత్రం వ్యతిరేక వార్తలు రాసి, బద్నాం చేసేందుకు ప్రయత్నించడం కొన్ని ప్రధాన స్రవంతి మీడియా సంస్థలకు అలవాటైపోయిందనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోమూవీర్రాజుపై ‘ఆంధ్రజ్యోతి’పేపరులో రాసిన వార్తలు ఇదే విషయాన్ని ఉద్ఘాటిస్తున్నాయి. ఈ తీరుపై బీజేపీ శ్రేణులతోపాటు సామాన్యులు సైతం తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: 5 రాష్ట్రాల ఎన్నికలకు మోగనున్న నగారా
రెండు రోజుల క్రితం ఏబీఎన్ చానల్‌లో జరిగిన చర్చ సందర్భంగా.. ఏపీ బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్థన్‌రెడ్డిపై అమరావతి జేఏసీ నేత శ్రీనివాసరావు దాడి చేశాడు. దీంతో.. అతన్ని శాశ్వతంగా ఏబీఎన్ చానల్ బహిష్కరిస్తున్నట్టుగా ప్రకటించారు. అయితే.. అమానుషంగా దాడికి పాల్పడ్డ శ్రీనివాసరావుపై ఏబీఎన్ యాజమాన్యమే కేసు పెట్టాలని సోము వీర్రాజు కోరారు. అయితే.. సోమూ సూచనను పట్టించుకోని ఏబీఎన్ చానల్.. తన మాట మీద కూడా నిలబడలేదు. మరుసటి రోజునే అదే శ్రీనివాసరావుతో ఏబీఎన్ చానల్‌లో లైవ్ డిబేట్ పెట్టారు. దీనిపై బీజేపీ ఆగ్రహం వ్యక్తంచేసింది. ఛానల్ నుంచి శాశ్వతంగా బహిష్కరిస్తామని చెప్పి, మళ్లీ తీసుకొచ్చి చర్చ పెట్టడమేంటని బీజేపీ నేతలు తప్పుబట్టారు. దీంతో.. తమ పార్టీ నుంచి ఏబీఎన్ చానల్ డిబేట్ కు వెళ్లకూడదని నిర్ణయించింది బీజేపీ.
దీంతో ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ సోము వీర్రాజుపై కక్షగట్టి, అక్షర దాడికి తెగబడ్డారు. విశాఖ ఉక్కు అంశాన్ని కారణంగా చూపుతూ సోమూపై ఇష్టారీతిన అవాకులు, చెవాకులు పేలడం గమనార్హం. ‘ఇప్పుడేమంటారు.. వీర్రాజా?’ శీర్షికతో బాటమ్ బ్యానర్ కథనాన్ని ప్రచురించింది ఆంధ్రజ్యోతి. విశాఖ ఉక్కు ఉద్యమకారులపై సోమూ వీర్రాజు ఆగ్రహించారంటూ కథనం వండింది రాధాకృష్ణ పేపరు.
Also Read: ఉదారమే భారత విధానం.. ఉదాహరణలెన్నో!
కానీ.. వాస్తవం వేరుగా ఉంది. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ అనేది ఆంధ్రుల సెంటిమెంట్‌కు సంబంధించిన అంశమని, మరోసారి ఆలోచించాలని ఢిల్లీ పెద్దలకు సోమూ వీర్రాజు ఇప్పటికే విన్నవించారు. అంతేకాదు.. ప్రధాని మోదీకి మూడు ప్రతిపాదనలు సమర్పించేందుకు సోము ప్రయత్నించారు. కానీ.. అపాయింట్ మెంట్ లభించలేదు. చివరకు కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ను కలిశారు. ఆయన సమస్య మొత్తం వివరించారు. విశాఖ ఉక్కును ప్రైవేటీకరించే ఆలోచన విరమించుకోవాలని కూడా కోరారు సోమూ. ఆ తర్వాత ఢిల్లీ వెళ్లిన సోము వీర్రాజు బృందం.. బీజేపీ అధ్యక్షుడు నడ్డాను కూడా కలిసి విశాఖ ఉక్కుపై నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని కోరారు.
ఈ విధంగా వైజాగ్ స్టీల్ రక్షణకు సోమూవీర్రాజు తాను చేయగలిగినందంతా చేస్తూ ఉంటే.. రాధాకృష్ణ పేపరు వ్యక్తిగతంగా టార్గెట్ చేసి, ఇష్టారాజ్యంగా అసత్యాలు రాస్తూ, సోమూ ప్రతిష్టను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తోందని ఏపీలో చర్చించుకుంటున్నారు. తమ చానల్ లో డిబేట్లను బహిష్కరించినందుకే ఇలా కల్పితాలతో అసత్య కథనాలు ప్రచురిస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే.. సోమూవీర్రాజుపై ఈ రీతిన అక్షరాల రాళ్లు విసిరిన ఆంధ్రజ్యోతి.. ప్రైవేటీకరణ నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వంపై ఒక్క మాట కూడా అనకపోవడం గమనించాల్సిన అంశం. ఇదంతా వ్యక్తిగత దాడి అన్న విషయం ఇక్కడే తేలిపోయిందని అంటున్నారు ఏపీ వాసులు.
మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్