AP Assembly Sessions: ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా సాగుతున్నాయి. అధికార పార్టీ వైసీపీ, ప్రతిపక్షం టీడీపీ పరస్పరం ఆరోపణలు చేసుకున్నాయి. అమరావతి విషయంలో రెండు పార్టీల మధ్య మాటల పర్వం కొనసాగింది. అధికార పార్టీ వైసీపీ టీడీపీని టార్గెట్ చేసుకుని దూషణలకు దిగింది. అమరావతి భూముల వ్యవహారం మరోమారు వేదిక అయింది. రెండు పార్టీల్లో మాటలతో రెచ్చగొట్టుకున్నారు. మంత్రి బుగ్గన ఆరోపణలను టీడీపీ ఖండించింది. టీడీపీ నేతలు స్పీకర్ పోడియంను చుట్టుముట్టారు.

టీడీపీ నేతలకు ముందే రాజధాని విషయం తెలియడంతో అక్కడ తమకు నచ్చిన వారికి భూములు కట్టబెట్టారని వైసీపీ నేతలు ఆరోపణలు చేయడంతో ఒక్కసారిగా గలాటా జరిగింది. పరస్పరం విమర్శలతో సభ అట్టుడికిపోయింది. రెండు పార్టీల నేతలు మాటల యుద్ధంతో దాడి చేసుకునేందుకు ప్రయత్నించారు. దీంతో కాసేపు వాగ్వాదం జరిగింది. దీంతో సభ నుంచి టీడీపీ వారిని సస్పెండ్ చేశారు. మంత్రుల వ్యాఖ్యలపై టీడీపీ నేతలు అభ్యంతరాలు వ్యక్తం చేశారు.
అమరావతిలో ఇన్ సైడ్ ట్రేడింగ్ జరిగిందని వైసీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. అమరావతి భూముల్లో అక్రమాలు జరిగాయని మరోమారు వాదనలు చేశారు. పరిటాల, పయ్యావుల, ధూళిపాళ్ల, కుంభంపాటి సహా చాలా మంది నేతలకు భూములు కట్టబెట్టారని విమర్శలు చేశారు. హెరిటెజ్ ఫుడ్స్ కు కూడా 14 ఎకరాల స్థలం ఉందని చెప్పడం గమనార్హం. అమరావతిలో టీడీపీ చేసిన దానికే వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానుల అంశం తెరపైకి తీసుకొచ్చినా దాన్ని నెరవేరకుండా చేస్తుందని అన్నారు.

మూడు ప్రాంతాల అభివృద్ధి కోసమే వైసీపీ ప్రయత్నిస్తున్నా టీడీపీ అడ్డుకుంటోంది. పరిపాలన వికేంద్రీకరణ పై స్వల్పకాలిక చర్చ జరిగినా ఫలితం కనిపించలేదు. సీఎం జగన్ పై బుదరజల్లేందుకే టీడీపీ ప్రయత్నిస్తోందని దుయ్యబడుతున్నారు. కొందరు కావాలనే దురుద్దేశంతో వ్యవహరిస్తున్నారని ఆరోపణలు చేస్తున్నారు. చంద్రబాబు బినామీలకే అమరావతిలో భూములు దక్కడంతో వారు మూడు రాజధానులకు ఒప్పుకోవడం లేదని చెబుతున్నారు. మొత్తానికి శాసనసభ సాక్షిగా రెండు పార్టీల మధ్య మాటల దాడి కొనసాగడం గమనార్హం.