Minister Seediri Appalaraju: ఐదేళ్ల కిందట వరకూ ఆయనో సామాన్య డాక్టర్. అందరి డాక్టర్లలాగే ప్రాక్టీసు చేస్తూ జీవనోపాధి పొందేవారు. అటువంటిది ఒక్కసారిగా జాక్ పాట్ కొట్టేశారు. మత్స్యకార కోటాలో వైసీపీ టిక్కెట్ పొందారు. జగన్ ప్రభంజనంలో ఎమ్మెల్యేగా గెలుపొందారు. అటు తరువాత అమాత్య పదవి దక్కించుకున్నారు. అయితే అనతికాలంలో రాజకీయ ఉన్నత యోగాలను దక్కించుకున్న సదరు నేత ప్రజాభిష్టానికి వ్యతిరేకంగా పాలన ప్రారంభించారన్న టాక్ నడుస్తోంది. మూడున్నరేళ్లలో వందల కోట్ల రూపాయలు అర్జించారన్న ప్రచారం ఊపందుకుంది. కబ్జాలకు కేరాఫ్ అడ్డాగా.. అడ్డగోలు సంపాదనకు చిరునామాగా మారిపోయారన్న టాక్ వైరల్ అవుతోంది. ఆయనే పలాస ఎమ్మెల్యే, ఏపీ పశుసంవర్థక శాఖ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు. అనూహ్యంగా రాజకీయాల్లో అడుగుపెట్టి.. అదృష్టం తోడవ్వడంతో జగన్ నచ్చి.. మెచ్చి మరీ అప్పరాజుకు అవకాశాలిచ్చారు. వాటిని అందిపుచ్చుకున్న అప్పలరాజు అదే దూకుడుతో మరింత రాటుదేలారు. కానీ తప్పుల మీద తప్పులు చేస్తూ ప్రజల మధ్య పలుచనవుతున్నారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. రాజకీయంగా డీగ్రేడ్ అవుతున్నారని భావిస్తున్నారు.

ఈ మూడున్నరేళ్ల పదవీ కాలంలో మంత్రి అప్పలరాజుపై వచ్చిన ఆరోపణలు అన్నీఇన్నీకావు. నియోజకవర్గంలోని మూడు మండలాలు, ఒక మునిసిపాల్టీలో నలుగురు బినామీలను ఏర్పాటుచేసుకొని దందా నడుపుతున్నట్టు ఆయనపై ఆరోపణలున్నాయి. అందుకే శ్రీకాకుళం జిల్లాలో ఇతర మంత్రులు, కీలక ప్రజాప్రతినిధులు ఉన్నా.. వారందర్నీ కాదని అప్పలరాజు చుట్టూ వివాదాలు నడుస్తున్నాయి. అయితే అధిష్టాన పెద్దలకు కప్పం కడుతుండడంతో వారూ చూసీచూడనట్టుగా వ్యవహరిస్తున్నారని శ్రీకాకుళం పొలిటికల్ సర్కిల్ లో గుప్పుమంటోంది. జిల్లాలో సీనియర్ మంత్రిగా ఉన్న ధర్మాన ప్రసాదరావు సిఫారసుల కంటే.. జూనియర్ అయిన సీదిరి అప్పలరాజు మాట చెల్లుబాటు అవుతుందంటే అధిష్టాన పెద్దల భరోసా ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు.
మూడు రాజధానులకు మద్దతుగా ఏ వైసీపీ ప్రజాప్రతినిధి ఆరాటపడనంతగా…అప్పలరాజు తన వాయిస్ ను బలంగా వినిపిస్తుంటారు. విశాఖ రాజధాని మద్దతుగా నాన్ పొలిటికల్ జేఏసీ ఏర్పాటు ఆలోచన కూడా అప్పలరాజుదే. తొలుత తన సొంత నియోజకవర్గంలో జేఏసీని ఏర్పాటుచేసిన అప్పలరాజు అధిష్టాన పెద్దల దృష్టిని ఆకర్షించగలిగారు. ఫలితంగా విశాఖ రాజధానికి మద్దతుగా వైసీపీ సానుభూతిపరులైన విద్యావేత్తలు, వివిధ రంగాల నిపుణులతో నాన్ పొలిటికల్ జేఏసీ ఏర్పాటైంది. అయితే అప్పలరాజు ఆరాటం వెనుక పెద్ద కథే ఉందన్న టాక్ నడుస్తోంది. వైద్యవృత్తిలో ఉన్న అప్పలరాజుకు హెర్గ్ అనే ఫార్మస్యూటికల్ సంస్థ ఒకటి ఉందట. ఆ సంస్థే ఉత్తరాంధ్రలోని ఆస్పత్రులకు నాసిరకం మందులు సరఫరా చేస్తుందట. నెలకు రూ.25 కోట్లు టర్నోవర్ ఉండే సదరు సంస్థను మరింత అభివృద్ధి చేయాలని సంకల్పించారుట. నెలకు రూ.100 కోట్ల టర్నోవర్ పెంచాలన్న ఉద్దేశ్యంతో వైద్య ఆరోగ్య శాఖ అధికారులపై ఒత్తిడి చేస్తున్నారుట.అయితే ఇందులో కొంతవరకూ సక్సెస్ అయినట్టు ప్రచారం సాగుతోంది.

మరోవైపు సొంత నియోజకవర్గం పలాసలో అపార అటవీ సంపద ఉంది. విలువైన కొండలు, గుట్టలు ఉన్నాయి.అవన్నీ గత మూడున్నరేళ్లలో కరిగిపోతున్నాయట. వీటి వెనుక కూడా అప్పలరాజు హస్తం ఉన్నట్టు వార్తలు గుప్పుమంటున్నాయి. మహేంద్ర గిరులు, పలాసకాశీబుగ్గ మునిసిపాల్టీలోని సూదికొండ, నెమలికొండ, కూతవేటు దూరంలో రిజర్వ్ ఫారెస్ట్ భూములు, నల్లబొడ్లూరు కొండ, కంబిరిగాం భూములు చాలావరకూ చేతులు మారాయి. వీటి వెనుక వ్యవహారంలో మంత్రికి వందల కోట్ల రూపాయలు ముట్టినట్టు ఆరోపణలున్నాయి. ఇసుక, కలప అక్రమ రవాణాలోనూ మంత్రికి భాగస్వామ్యం ఉన్నట్టు సమాచారం. ఇలా వందల కోట్ల రూపాయలు పోగుచేసుకున్న సొమ్ముతో విశాఖలోని పరిశ్రమల్లో పెట్టుబడులు పెడుతున్నట్టు కామెంట్స్ వినిపిస్తున్నాయి. అందుకే విశాఖ రాజధానికి మద్దతుగా ఎవరూ వినిపించని.. వినిపించలేని వాయిస్ ను మంత్రి అప్పలరాజు వినిపిస్తున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. సోషల్ మీడియాలో కూడా మంత్రి చీకటి బాగోతంపై ప్రచారం ఉధృతంగా సాగుతోంది. దానిని రాజకీయ ప్రత్యర్థులు, సొంత పార్టీలో అసంతృప్తివాదులు తెగ వైరల్ చేస్తున్నారు.