
కొన్నాళ్లుగా స్తబ్దుగా ఉన్న మూడు రాజధానుల అంశం ఉన్నట్టుండి వేడెక్కింది. రెండు రోజుల వ్యవధిలో ఇద్దరు కీలక నేతలు ఈ విషయంలో ఒకే విధమైన ప్రకటన చేయడంతో ఏపీలో అటెన్షన్ క్రియేట్ అయ్యింది. సీఎం జగన్ మూడు రాజధానుల్లో ఎక్కడి నుంచైనా పాలన సాగించొచ్చని ఎంపీ విజయసాయిరెడ్డి నిన్న వ్యాఖ్యానించగా.. ఇవాళ మంత్రి బొత్స సత్యనారాయణ కూడా ఇదేవిధమైన ప్రకటన చేశారు.
రాష్ట్రానికి ఏ క్షణమైనా మూడు రాజధానులు ఏర్పాటు కావొచ్చని అన్నారు. ఇందుకు సంబంధించిన పనులు కూడా వేగంగా జరుగుతున్నాయని చెప్పారు. అంతేకాదు.. కొందరు కోర్టుల్లో కేసులు వేసి ఆలస్యం చేశారన్న మంత్రి.. లేదంటే ఎప్పుడో పూర్తయ్యేదని అన్నారు. అయినప్పటికీ.. న్యాయస్థానాల్లో అడ్డంకులు అధిగమిస్తామని, మూడు రాజధానుల ఏర్పాటు తర్వాత సీఎం ఎక్కడి నుంచైనా పాలన చేయొచ్చని అన్నారు.
ఈ ఇద్దరు నేతల ప్రకటనతో ఆంధ్రప్రదేశ్ లో మూడు రాజధానుల అంశం మరోసారి తెరపైకి వచ్చింది. అయితే.. ఇదే సందర్భంలో అమరావతితో ముడిపడి ఉన్న సమస్యల సంగతేంటనే అంశం కూడా చర్చకు వస్తోంది. అక్కడ భూములు ఇచ్చిన రైతులకు ఎలా న్యాయం చేస్తారనే ప్రశ్న అలాగే ఉంది.
చంద్రబాబు హయాంలో సీఆర్డీఏను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. దీని ప్రకారం.. రైతులతో చేసుకున్న ఒప్పందాన్ని ప్రభుత్వం రద్దు చేసుకుంటే.. రైతులకు పరిహారం చెల్లించాలి. 2013 భూసేకరణ చట్టం కింద పరిహారం అందించాల్సి ఉంటుంది. ఈ చట్టం కింద పరిహారం చెల్లించాల్సి వస్తే.. సుమారు 72 వేల కోట్ల రూపాయలు రైతులకు ఇవ్వాల్సి వస్తుందని అంచనా.
దీంతోపాటు ఇంకాపలు సమస్యలు ఉన్నాయి. ఇవన్నీ నోటిమాటతో చెప్పినవి కాదు.. పక్కాగా చట్టప్రకారం చేసుకున్న ఒప్పందాలు. మరి, ఈ సమస్యలకు పరిష్కారం చూపకుండా ఎలా ముందుకు వెళ్తారనే ప్రశ్న ఎదురవుతోంది. ఇవన్నీ చెప్పకుండా మూడు రాజధానుల అంశాన్నే వైసీపీ నేతలు మాట్లాడుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. మరి, ప్రభుత్వం ఎలా ముందుకు సాగుతుందన్నది చూడాలి.