TSPSC Paper Leak Case: తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో దర్యాప్తు బృందం అధికారులు కీలక విషయాలు బయట పెట్టారు. ఇప్పటివరకు ఈ కేసులో ఎటువంటి పరిణామాలు చోటుచేసుకున్నాయో, ఎవరెవరు ఎలాంటి పాత్ర పోషించారో పూర్తి ఆధారాలను కోర్టుకు సమర్పించారు. ఈ వ్యవహారంలో సూత్రధారులు ఎవరు?, పాత్రధారులు ఎవరు? ఎవరెవరికి ఏ స్థాయిలో డబ్బులు ముట్టింది? అనే విషయాలను వెల్లడించారు. దీంతో ఈ కేసు సుదీర్ఘ విచారణ తర్వాత ఒక కొలిక్కి వచ్చినట్టే అని అందరూ భావిస్తున్నారు. అయితే ఇంకా ఈ కేసులో కొత్త కొత్త పేర్లు బయటికి వస్తున్న నేపథ్యంలో సిట్ అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటారు అనేది చర్చనీయాంశంగా మారింది.
ఒక కొలిక్కి
టీఎస్ పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో దర్యాప్తు ముమ్మరం చేసిన సిట్.. కేసును ఓ కొలిక్కి తెచ్చినట్లు తెలుస్తోంది. వివిధ కోణాల్లో దర్యాప్తు చేసిన పోలీసులు ఇప్పటివరకు 49 నిందితులను అరెస్టు చేశారు. వీరిలో 16 మంది కుంభకోణంలో మధ్యవర్తులుగా వ్యవహరించారు. దర్యాప్తులో భాగంగా కేసు రోజుకో మలుపు తిరుగుతున్న నేపథ్యంలో నిందితుల విచారణ రిపోర్టుతో ప్రాథమిక చార్జిషీట్‌ను నాంపల్లి కోర్టులో దాఖలు చేసినట్లు సిట్ అధికారులు చెబుతున్నారు. మొత్తం 98 పేజీలతో కూడిన అభియోగ పత్రాలను సమర్పించినట్లు తెలిసింది. నిందితుల్లో ప్రశాంత్ న్యూజిలాండ్‌లో ఉన్నట్లు పేర్కొన్నారు. కాగా, ఈ కేసులో ఇప్పటివరకు రూ.1.63 కోట్ల లావాదేవీలు జరిగినట్లు తేలిందని సిట్ పేర్కొంది. నిందితులకు సంబంధించిన ఖాతా వివరాలు, చేతులు మారిన నగదు వివరాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది. వివిధ బ్యాంకు ఖాతాలను సీజ్ చేసినట్లు వివరించింది. మరికొందరిని అరెస్టు చేయాలని భావిస్తున్నట్లు పేర్కొంది.
ప్రవీణ్, రాజశేఖర్ ప్రధాన నిందితులు
కమిషన్ ప్రిన్సిపల్ సెక్రటరీకి పీఏగా వ్యవహరిస్తున్న టీఎస్ పీఎస్సీ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ పులిదిండి ప్రవీణ్‌కుమార్, టెక్నికల్ అడ్మిన్‌గా పనిచేస్తున్న రాజశేఖర్ ప్రశ్నపత్రాల లీకేజీకి ప్రధాన సూత్రదారులుగా గుర్తించినట్లు సిట్ వెల్లడించింది. టీఎస్ పీఎస్సీ నిర్వహించే వివిధ పబ్లిక్ పరీక్షల ప్రశ్నపత్రాలను కాన్ఫిడెన్షియల్ సెక్షన్ నుంచి రహస్యంగా, కుట్రపూరితంగా కంప్యూటర్ నుంచి కాపీ చేసి పెన్‌డ్రైవ్‌లో దాయడంతో పాటు.. కొన్ని ప్రింటవుట్స్ తీసుకున్నట్లు గుర్తించింది. నిందితుల వద్ద గ్రూప్-1, డీఏవో, ఏఈఈ, ఏఈ ప్రశ్నపత్రాలు ఉన్నాయి. మధ్యవర్తులను ఉపయోగించి వాటిని పలువురు అభ్యర్థులకు విక్రయించి సొమ్ము చేసుకున్నట్లు విచారణలో తేలింది. మధ్యవర్తులు.. ఏఈఈ ప్రశ్నపత్రాన్ని 13 మందికి, డీఏవో పేపర్‌ను 8 మందికి, గ్రూప్-1 ప్రిలిమ్స్ పేపర్‌ను నలుగురికి చేరవేసినట్లు గుర్తించారు. గ్రూప్-1 ప్రిలిమ్స్ పేపర్ చేరిన నలుగురూ టీఎ్‌సపీఎస్సీ ఉద్యోగులే. వీరిలో ప్రవీణ్, షమీమ్, రమేష్ పరీక్ష రాశారు. రాజశేఖర్ గైర్హాజరయ్యాడు. కాగా, లీకేజీ కేసులో ఏ 11, టీఎస్ పీఎస్సీ మాజీ ఉద్యోగి సురేష్ నుంచి ఏఈ ప్రశ్నపత్రాన్ని కొనుగోలు చేసిన మాజీ ఏఈ రమేష్.. అతని ద్వారా పొందిన అభ్యర్థులు ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్‌తో హైటెక్ కాపీయింగ్‌కు పాల్పడిన వైనంపై దర్యాప్తు కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు. అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నామని చెప్పారు. పూర్తి వివరాలు, ఆధారాలతో మరో చార్జిషీట్‌ను దాఖలు చేయనున్నట్లు తెలిసింది.
ఏఈ రమేష్ సహకారంతో..
ఏఈ రమేష్ సహకారంతో ఏఈఈ, డీఏవో పరీక్షల్లో కాపీయింగ్ చేసిన ముగ్గురిని అరెస్టు చేసినట్లు.. వారినుంచి స్వాధీనం చేసుకున్న ఎలకా్ట్రనిక్ వస్తువుల నుంచి సాంకేతిక ఆధారాలను సేకరించి చార్జిషీట్‌లో పొందుపర్చినట్లు అధికారులు వెల్లడించారు. ఆధారాలను విశ్లేషిస్తున్న క్రమంలో మరికొంత సమాచారం బయటకు వచ్చినట్లు తెలిపారు. ఏఈ రమేష్ మరికొందరికి కూడా ఏఈఈ ప్రశ్నప్రత్నాన్ని అమ్మినట్లు సిట్ భావిస్తోంది. ఈ నేపథ్యంలో అరెస్టులు పెరిగే అవకాశం ఉంది.
ఆ 16 మంది మధ్యవర్తులు వీరే
1. రేణుక 2. డాక్యా నాయక్ 3. కేతావత్ రాజేశ్వర్ 4. కేతావత్ శ్రీనివాస్, 5. కేతావత్ రాజేంద్రనాయక్ 6. తిరుపతయ్య 7.సాయి లౌకిక్ 8.కోస్గి మైబయ్య 9.భగవంత్‌కుమార్ 10.కొంతం మురళీధర్‌రెడ్డి 11.ఆకుల మనోజ్‌కుమార్ 12.శివధర్‌రెడ్డి 13. రమావత్ దత్తు 14. పూల రవికిషోర్ 15. గుగులోతు శ్రీనునాయక్ 16. పావోల రమేష్. కాగా, ఈ కేసులో కొత్త కొత్త వ్యక్తుల పేర్లు తెరపైకి వస్తున్న నేపథ్యంలో మరిన్ని అరెస్టులు చోటుచేసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.