Telangana Congress: తెలంగాణలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో అన్నిపార్టీలు దూకుడు పెంచాయి. ముఖ్యంగా బీఆర్‌ఎస్, కాంగ్రెస్ నువ్వా నేనా అన్నట్లు తలపడుతున్నాయి. ఒకవైపు బీఆర్‌ఎస్ అభ్యర్థులను ప్రకటించి ప్రచారంలో దూసుకుపోతోంది. మరోవైపు కాంగ్రెస్ టికెట్ల ఖరారుకు కసరత్తు చేస్తూనే ప్రచారం చేస్తోంది. ఈక్రమంలో ఇటీవలే రాహుల్, ప్రియాంక తెలంగాణలో పర్యటించి ప్రచారం చేశారు. మరోవైపు కాంగ్రెస్‌లో పెద్ద ఎత్తున చేరికలు జరుగుతున్నాయి. బీఆర్‌ఎస్ నుంచి అసంతృప్తులు కాగ్రెస్‌వైపు చూస్తున్నారు.
బీఆర్‌ఎస్‌ను దెబ్బతీసేలా వ్యూహం..
మరోవైపు వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ను దెబ్బకొట్టేందుకు కాంగ్రెస్ పక్కా ప్లాన్ చేస్తోంది. కాంగ్రెస్ అభ్యర్థులు బలహీనంగా ఉన్న నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్థి ఎవరు, ఎన్నికల్లో గెలిచిన తర్వాత అతను పార్టీ మారే అవకాశం ఉందా.. మారేందుకు ఎలాంటి ఆఫర్ ఇవ్వొచ్చు అన్న లెక్కలు వేస్తున్నారు. ఈమేరకు సునీల్ కనుగోలు, రేవంత్‌రెడ్డి పక్కా ప్రణాళిక రూపొందిస్తున్నారు.
వచ్చేది కాంగ్రెస్ సర్కారే..
ఇదిలా ఉండగా రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధిస్తుందని తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ ఏర్పడుతుందని భారత ఫొలిటికల్ ఎనాలసిస్ అండ్ రీసెర్చ్ సెంటర్ తెలిపింది. ఫోరెన్సిక్ ఎలక్షన్స పేరిట సర్వే చేసింది. కాంగ్రెస్‌కు గరిష్టంగా 72 సీట్లు గెలుస్తుందని, అధికార బీఆర్‌ఎస్ 40 స్థానాలకే పరిమితమౌతుందని వెల్లడించింది. బీజేపీ కేవలం 2 స్థానాలకే పరిమితమవుతుందని, ఎంఐఎం రెండో స్థానాలు కోల్పోయి 5 స్థానాలకు పరిమితమవుతుందని తెలిపింది.
ఓటింగ్ శాతం ఇలా..
ఇక ఓటింగ్ శాతం విషయానికి వస్తే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 48.4 శాతం ఓట్లు, అధికార బీఆర్‌ఎస్‌కు పది శాతం ఓట్లు తగ్గిపోయి 36.87 శాతం ఓట్లు వస్తాయని తెలిపింది. ఎంఐఎం ఓట్ల శాతం 2.04 శాతం, బీజేపీ 2.98 శాతం ఓట్లు వస్తాయని వెల్లడించింది.
జిల్లాల వారీగా కాంగ్రెస్‌కు వచ్చే సీట్లు..
ఇక ఉమ్మడి జిల్లాల వారీగా కాంగ్రెస్‌కు వచ్చే సీట్లును కూడా సర్వే సంస్థ ప్రకటించింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 10కి పది స్థానాలు కాంగ్రెస్ గెలుస్తుందని అంచనా వేసింది. ఆదిలాబాద్‌లో 10కి 9 కాంగ్రెస్, ఒకటి బీఆర్‌ఎస్ గెలుస్తుందని, హైదరాబాద్‌లో 15 సీట్లకు ఎంఐఎం 5, కాంగ్రెస్ 5, ఒక స్థానంలో బీజేపీ గెలుస్తుందని అంచనా వేసింది. కరీంనగర్‌లో 13 స్థానాలకు కాంగ్రెస్ 8, బీఆర్‌ఎస్ 4, బీజేపీ ఒక స్థానంలో గెలుస్తాయని అంచనా వేసింది. ఉమ్మడి మహబూబ్‌నగరల్‌లో కాంగ్రెస్ 7, బీఆర్‌ఎస్ 7 స్థానాల్లో గెలుస్తాయని తెలిపింది. మెదక్ జిల్లాలో కాంగ్రెస్ 3, బీఆర్‌ఎస్ ఏడు స్థానాలు గెలుస్తుందట. నల్లగొండలో కాంగ్రెస్‌కు 9, బీఆర్‌ఎస్‌కు 3 సీట్లు వస్తాయట. నిజామాబాద్‌లో కాంగ్రెస్‌కు 5, బీఆర్‌ఎస్‌కు 4, రంగారెడ్డిలో కాంగ్రెస్‌కు 8, బీఆర్‌ఎస్‌కు 6, వరంగల్‌లో కాంగ్రెస్‌కు 8, బీఆర్‌ఎస్‌కు 4 సీట్లు వస్తాయని వెల్లడించింది.