విజయవాడలోని స్వర్ణ ప్యాలెస్ లో అగ్నిప్రమాదం జరిగి 10మంది మరణించారు. దీన్ని నిర్వహించిన రమేశ్ ఆస్పత్రిపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చాయి. జగన్ ప్రభుత్వం దీనిపై సీరియస్ అయ్యి ఈ కేసులో రమేష్ ఆస్పత్రికి చెందిన ముగ్గురు అధికారులను అరెస్ట్ చేయించింది.రమేష్ హాస్పిటల్ యజమాని డాక్టర్ రమేష్ పోతినేని మరియు ఆసుపత్రి ఛైర్మన్ సీతారామ మోహనా రావు అరెస్టు చేసేందుకు సిద్ధమవ్వగా వారు పరారీలో ఉండడంతో వీలు కాలేదు. తాజాగా వారు హైకోర్టుకు ఎక్కడంతో స్టే ఇచ్చింది. రమేష్ , రామ్మోహన్ రావు ఇద్దరూ అగ్ని ప్రమాదం జరిగినప్పటి నుండి పరారీలో ఉన్నారు. హైకోర్టులో వారికి ఊరట లభించడంతో ఊపిరిపీల్చుకున్నారు.
Also Read: జగన్ సీక్రెట్: ఆ టీడీపీ కుంభకోణం తవ్వుతున్నాడా?
కానీ దీనిపై జగన్ సర్కార్ సుప్రీం కోర్టుకు ఎక్కింది. రమేశ్ ఆసుపత్రిపై చర్యలు తీసుకోకుండా హైకోర్టు అడ్డుకోవడం.. స్టే ఇవ్వడంపై సుప్రీంలో జగన్ సర్కార్ పిటీషన్ వేసింది. ఆ కేసు నడుస్తుండగా తాజాగా ఏపీ హైకోర్టు మరోసారి జగన్ సర్కార్ కు షాకిచ్చింది. రమేశ్ ఆస్పత్రికి ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది.
రమేష్ హాస్పిటల్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ డాక్టర్ కొడాలి రాజగోపాల్ రావు, జనరల్ మేనేజర్ డాక్టర్ కురపతి సుదర్శన్ మరియు స్వర్ణ ప్యాలెస్ హోటల్‌లోని ఆసుపత్రి కోఆర్డినేటింగ్ మేనేజర్ పల్లబోతు వెంకటేష్ లకు హైకోర్టులో బెయిల్ లభించింది. విజయవాడ సెంట్రల్ తహసీల్దార్ (బ్లాక్ రెవెన్యూ అధికారి) జయశ్రీ ఫిర్యాదు మేరకు క్రిమినల్ కేసు నమోదు చేసిన గవర్నర్‌పేట్ పోలీసులు ప్రమాదం జరిగిన రోజున ఈ ముగ్గురు అధికారులను అరెస్టు చేశారు.
ఆగస్టు చివరి వారంలో, ఈ ముగ్గురు ఎనిమిదో జిల్లా అదనపు కోర్టు ముందు బెయిల్ పిటిషన్ ను పెట్టుకున్నారు. కాని వారు హోటల్ అగ్ని ప్రమాదంలో ప్రత్యక్షంగా నిందితులు కావడంతో వారికి బెయిల్ ఇవ్వడానికి కోర్టు నిరాకరించింది. కేసు ఇంకా దర్యాప్తులో ఉన్నందున బెయిల్ మంజూరు చేయలేమని మేజిస్ట్రేట్ తెలిపారు. ఫలితంగా వారు హైకోర్టును ఆశ్రయించారు. ముగ్గురు నిందితులకు శుక్రవారం హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది.
Also Read: జగన్ ధరించే మాస్క్ ఖరీదు ఎంతో తెలుసా?
దీంతో రమేశ్ ఆసుపత్రిపై కఠినంగా ముందుకెళుతున్న జగన్ సర్కార్ కు ఈ పరిణామం మింగుడు పడడం లేదు. దోషుల్లో అనుమతిచ్చిన కలెక్టర్, డీఎంహెచ్.వో సహా అధికారులు కూడా ఉంటారని హైకోర్టు పేర్కొనడం సంచలనమైంది. ఈ క్రమంలోనే రమేశ్ ఆసుపత్రి విషయంలో జగన్ సర్కార్ ఎలా ముందుకెళుతుందనేది ఆసక్తిగా మారింది.