Jagan: ఏపీ సర్కార్ ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటోంది. ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలుప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నాయి. మధ్యతరగతి కుటుంబాల నుంచి సైతం వ్యతిరేకత కనిపిస్తోంది. ముఖ్యంగా విద్యాధికులు జగన్ సర్కార్ వైఖరిని బాహటంగానే తప్పుపడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో వ్యతిరేకంగా ఓటు వేస్తామని సంకేతాలు పంపిస్తున్నారు. అయితే తాను అమలు చేసిన సంక్షేమ పథకాలే తనను గెలిపిస్తాయని జగన్ ఎంతో ఆశతో ఉన్నారు. అదే సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా అభ్యర్థులను మార్చి గెలుపు బాట పట్టించాలని చూస్తున్నారు. ఈ తరుణంలో ఏ చిన్న అవకాశాన్ని సైతం విడిచిపెట్టడం లేదు. ఇప్పుడు తన పుట్టినరోజు వేడుకల్లో రాష్ట్ర ప్రజల్లో ఆలోచన తీసుకురావాలని చూస్తున్నారు. భారీగా ప్రచారం చేసుకోవాలని భావిస్తున్నారు.
ఈనెల 21న సీఎం జగన్ జన్మదినం. రాష్ట్రవ్యాప్తంగా ఒక వేడుకలా చేయాలని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. అందులో భాగంగా ప్రజల్లో ఆలోచన తీసుకొచ్చేలా ఒక ఫొటోను రూపొందించారు. ఆ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గత ఎన్నికలకు ముందు జగన్ ఈ తరహా ప్రయోగాలు చేశారు. ప్రత్యేక పాటలతో పాటు వినూత్నమైన పద్ధతులతో ప్రజల్లోకి వెళ్లారు. అవి బలంగా వర్కౌట్ అయ్యాయి. ఇప్పుడు మరోసారి అదే తరహా ప్రయోగం చేయడానికి సిద్ధపడుతున్నారు.
గత నాలుగు సంవత్సరాలుగా బడుగు, బలహీన వర్గాలను టార్గెట్ చేసుకుంటూ జగన్ అనేక పథకాలను రూపొందించారు. అమలు చేశారు. పేద ప్రజలకు అండగా నిలిచారు. వారిని తన సొంత వారిలా హక్కుల చేర్చుకుంటున్న తీరును కళ్లకు కట్టినట్లు వివరిస్తూ ఒక పిక్చర్ ను తయారు చేశారు. పేదల కోసం జగన్ అనే ధీమ్ తో విడుదల చేసిన ఈ పిక్ ఇప్పుడు వైరల్ అవుతోంది. పార్టీ శ్రేణులతో పాటు అభిమానులు ఈ పిక్ ను వాట్సాప్ ప్రొఫైల్ గాను, సోషల్ మీడియాలో సైతం వినియోగిస్తున్నారు.
అయితే ఆ ప్రయత్నం అంతటితో ఆగలేదు. రాష్ట్రవ్యాప్తంగా ప్రధాన కోడలలో వైసీపీ శ్రేణులు భారీ హోర్డింగులను ఇదే పిక్ తో ఏర్పాటు చేయడం విశేషం. ఓవైపు పచ్చని పంట పొలాలు, ప్రాజెక్టుల నిర్మాణం తో పాటు కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా తయారైన ప్రభుత్వ పాఠశాల, గ్రామ సచివాలయం, వైయస్సార్ విలేజ్ హెల్త్ క్లినిక్, రైతు భరోసా కేంద్రాలను చేర్చారు. వైసిపి పాలనలో చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు అన్ని వర్గాల వారు సంతోషంగా ఉన్నారని చూపిస్తూ ఏర్పాటుచేసిన ఈ ఫ్లెక్సీలు ఆలోచింపజేస్తున్నాయి. ప్రజలను చేరువ చేసేందుకు ఇవి ఎంతగానో దోహదపడతాయని వైసీపీ నాయకులు భావిస్తున్నారు.