ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో మీడియాలో పోటాపోటీ నడుస్తోంది. ఒకరిని చూసి మరొకరు.. ఎవరి అవసరాలకు వారు.. ఇబ్బడిముబ్బడిగా న్యూస్ ఛానల్స్ ప్రారంభిస్తున్నారు. టీఆర్‌పీ రేటింగ్స్ విషయం పక్కనపెడితే చిన్నా పెద్దా కలిపి పదుల సంఖ్యలో.. వీటికి తోడు సిటీ ఛానల్స్ అంటూ నడుస్తూనే ఉన్నాయి. టాప్ రేటింగ్స్ కోసం ఎవరికి తోచిన విధంగా వారు ప్రోగ్రాంస్ ప్రవేశపెడుతూ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోని ఛానల్స్ జాబితాలోకి మరో ఛానల్ వచ్చి చేరబోతోంది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో విజయవాడ కేంద్రంగా AP24X7 ఛానల్‌ను ప్రారంభించారు. గతంలో మా టీవీని రన్ చేసిన మాజీ అధినేత మురళీకృష్ణంరాజు దీనికి చైర్మన్‌గా వ్యవహరించారు. మరికొంత మంది పెట్టుబడిదారులతో కలిసి ప్రారంభించిన ఈ ఛానల్ మొదట్లో బాగానే నడిచింది. తర్వాతర్వాత బోర్డ్ మెంబర్స్ మధ్య అంతర్గత కుమ్ములాటలు మొదలయ్యాయి. వీటికితోడు ఉద్యోగుల మధ్య కూడా ఆధిపోత్య పోరు కొనసాగడంతో ఛానల్ భవిష్యత్ సంక్షోభంలో పడింది. ఇవన్నీ చూస్తూ విసిగిపోయిన చైర్మన్ మురళీకృష్ణంరాజు ఛానల్‌కు షాక్ ఇచ్చారు. ‘తను బాధ్యతల నుంచి తప్పుకుంటున్నా’ అంటూ చైర్మన్ స్థాయిలోనే లేఖ రాయడం మీడియా వర్గాల్లో చర్చకు దారితీసింది.
దీనికి సంబంధించిన పరిణామాలు ఇలా ఉన్నాయి. అదే ఛానల్‌కు సీఈవోగా పనిచేసిన జర్నలిస్ట్ వెంకట కృష్ణ పలు ఆరోపణల కారణంగా ఆయన ఉద్యోగానికి రాజీనామా చేసి వెళ్లిపోయారు. కొన్నాళ్లపాటు సీఈవో లేకుండానే నడిచిన ఛానల్.. ఒకానొక దశలో క్లోజ్ చేయాలని బోర్డు మెంబర్స్ డిసైడ్ అయ్యారు. కంపెనీలో 60 శాతం వాటా చైర్మన్‌కే అమ్మేయాలని అనుకున్నారు. ఈ దశలో ఛానల్‌ని నిలబెట్టుకోవాలనే ప్రయత్నంలో భాగంగా కొన్నాళ్ల క్రితమే చైర్మన్ మురళీకృష్ణం రాజు సుధాకర్‌ని తీసుకొచ్చారు. ఆయననే సీఈవోగా నియమించారు. సుధాకర్ ది బిజినెస్ నేపథ్యం. ఐఐఎం గ్రాడ్యుయేట్. పలు కంపెనీలకు సీఈవోగా కూడా వ్యవహరించారు. అధికార పార్టీ వైసీపీతోనూ ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. 40 శాతం వాటాలు ఇస్తామనే అంగీకారంతో సుధాకర్‌ని సీఈవోగా తీసుకొచ్చారని సమాచారం.
తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్ ప్రకారం.. ఛానల్ నిలదొక్కుకోవాలంటే ఏదో ఒక రాజకీయ పక్షం మద్దతు తప్పనిసరి. ఈ క్రమంలో అధికార పార్టీకి చెందిన వ్యక్తే సీఈవోగా రావడంతో ఇక ఛానల్‌కు మంచి రోజులు వచ్చాయని అందరూ భావించారు. కానీ.. ఇంతలోనే మళ్లీ బోర్డు సభ్యుల మధ్య అంతర్గత కుమ్ములాటలు మొదలయ్యాయి. ఓ కీలక మెంబర్ వాటా విషయంలో చైర్మన్‌కు వ్యతిరేకంగా పావులు కదిపి మిగతా సభ్యులతో కుమ్మక్కయ్యారు. తనకున్న పలుకుబడితో చాలా రోజులుగా పెండింగ్‌లో ఉన్న జీతాలను ఇప్పించారు. ఛానల్‌ని ఒక స్థాయికి తీసుకెళ్లాలనే లక్ష్యంతో సీఈవోగా బాధ్యతలు చేపట్టిన సుధాకర్‌కు ఈ రాజకీయాలన్నీ నచ్చలేదు. దీంతో ఆయన మర్యాదపూర్వకంగానే తప్పుకోవాలనే ఆలోచనలో ఉన్నట్లు మీడియా సర్కిల్‌లో ప్రస్తుతం వినిపిస్తోతంది.
రెండు నెలలు సీఈవోగా కొనసాగిన సుధాకర్‌కు ఛానల్ నిర్వహణపై ఓ అవగాహన వచ్చిందంట. ఇంకేంటి అసలే బిజినెస్ మేనేజ్‌మెంట్ నేపథ్యం ఉన్న ఆయనకు పాత ఛానల్‌ని నడపడం కంటే కొత్త ఛానల్ పెట్టి ప్రజల్లోకి వెళ్దామని నిర్ణయానికి వచ్చారంట. ఎలాగూ అధికార పార్టీతో ఉన్న సత్సంబంధాలు ప్లస్ అవుతాయని భావిస్తున్నారట. ఇప్పటికే ఈ విషయాన్ని కొందరు సీనియర్ జర్నలిస్టులతోనూ పంచుకున్నారని సమాచారం. టెక్నికల్ టీం కూడా ఏర్పటైనట్లు తెలిసింది. ఇప్పటికే పేరున్న ఛానల్స్‌లో పనిచేస్తున్న కొందరు ఎలక్ర్టానిక్ మీడియా సీనియర్లు కూడా సుధాకర్‌తో టచ్‌లో ఉన్నారని సమాచారం. త్వరలోనే AP 24X7కి గుడ్ బై చెప్పి.. కొత్త ఛానల్ ప్రకటన చేసే అవకాశం ఉందనే మీడియా వర్గాల్లో టాక్.. అదే జరిగితే ఇప్పడున్న ఛానళ్లకు తోడు మరొకటి చేరబోతున్నట్లే.