Homeజాతీయ వార్తలుDelhi Liquor Scam Case: లిక్కర్ స్కాంలో మరో కీలక పరిణామం: అప్రూవర్ గా ఆ...

Delhi Liquor Scam Case: లిక్కర్ స్కాంలో మరో కీలక పరిణామం: అప్రూవర్ గా ఆ కీలక వ్యక్తి

Delhi Liquor Scam Case: ఢిల్లీ లిక్కర్ స్కాంలో కేంద్ర దర్యాప్తు సంస్థ అధికారులు దాఖలు చేసిన చార్జ్ షీట్ లో కవిత పేరు లేదని భారత రాష్ట్ర సమితి నేతలు మొన్నటి దాకా సంబరపడ్డారు. అసలు ఈ లిక్కర్ స్కాం జరగలేదని అడ్డగోలుగా వాదించారు. కానీ ఈ కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ అధికారులు కీలకమైన అడుగు ముందుకు వేశారు. పకడ్బందీ ఆధారాలతో ఈ కేసులో కీలకమైన శరత్ చంద్రా రెడ్డిని అప్రూవర్ గా మార్చారు. ఆయనకు ఏకంగా వై కేటగిరి భద్రత కల్పించారు. దీనికి సంబంధించి హోంశాఖ ఆదేశాలు కూడా జారీ చేసింది. మరోవైపు కవిత మాజీ ఆడిటర్ బుచ్చిబాబు కూడా అప్రూవర్ గా మారాడు. దీంతో కవిత పేరు మళ్లీ తెరపైకి వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఢిల్లీ మద్యం స్కాం లో ఆమె పాత్రను కూడా శరత్ వెల్లడిస్తాడని దర్యాప్తు సంస్థల అధికారులు భావిస్తున్నారు. అయితే ఏపీ ముఖ్యమంత్రి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా తో ఢిల్లీలో భేటీ కాగానే ఈ కీలక పరిణామం చోటు చేసుకోవడం విశేషం.

అప్రువర్ గా మారే అవకాశం

ఢిల్లీ మద్యం కుంభకోణంలో నిందితుడు, అరబిందో ఫార్మా డైరెక్టర్‌ శరత్‌ చంద్రా రెడ్డి అప్రూవర్‌గా మారే అవకాశాలను కేంద్రం కల్పించింది. అందుకే, కేంద్ర ప్రభుత్వం ఆయనకు వై కేటగిరీ భద్రత కల్పిస్తోంది ఈ మేరకు హోం శాఖ ఆదేశాలు కూడా జారీ చేసింది. ఈ పరిణామంతో, సీఎం కేసీఆర్‌ కూతురు, ఎమ్మెల్సీ కవిత పేరు ఢిల్లీ మద్యం స్కాంలో మరోసారి తెరపైకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారంఏపీ సీఎం జగన్‌ ఆదివారం రాత్రి కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాను కలిసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా వారి మధ్య ఢిల్లీ మద్యం స్కాం అంశం చర్చకు వచ్చినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలోనే, స్కాంలో నిందితుడైన శరత్‌ చంద్రా రెడ్డి అప్రూవర్‌గా మారనున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఆయనకు వై కేటగిరీ భద్రతను కల్పించాలని హోం శాఖ ఆదేశించినట్లు వివరించాయి. ఆయన అప్రూవర్‌గా మారి కుంభకోణంలో కవిత పాత్రను వెల్లడించే అవకాశాలున్నాయని ఆ వ ర్గాలు చెప్పాయి.

సౌత్ గ్రూప్ తరపున..

ఢిల్లీ మద్యం వ్యాపారంలో సౌత్‌ గ్రూప్‌ తరఫున పాల్గొన్న వారిలో కవిత, వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఆయన కుమారుడు రాఘవ రెడ్డి, వ్యాపారస్తుడు అరుణ్‌ రామచంద్ర పిళ్లై, కవిత మాజీ ఆడిటర్‌ బుచ్చిబాబు గోరంట్ల, శరత్‌ చంద్రారెడ్డి ఉన్న విషయం తెలిసిందే. కవిత ప్రేరణతోనే తాను మద్యం వ్యాపారంలో పాల్గొన్నానని శరత్‌ చంద్రా రెడ్డి చెప్పే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఇప్పటికే గోరంట్ల బుచ్చిబాబు అప్రూవర్‌గా మారిన విషయం తెలిసిందే. ఇప్పుడు శరత్‌ చంద్రా రెడ్డి కూడా అప్రూవర్‌గా మారితే కవిత పేరు మరోసారి తెరపైకి వచ్చే అవకాశం ఉంది. నిజానికి, స్కాంలో కవిత లావాదేవీల సమాచారం ఉన్నా కేంద్రం తగిన చర్యలు తీసుకోవడం లేదని రాష్ట్ర బీజేపీ నేతలు పలువురు ఢిల్లీ పెద్దలకు అనేక సార్లు చెప్పారు. కేసీఆర్‌ కుటుంబాన్ని కేసుల వలయంలో ఇరికిస్తే తప్ప బీఆర్‌ఎస్‌ బలహీనం కాదని, బీజేపీకి అవకాశాలు దక్కవని చెబుతూ వచ్చారు. ఢిల్లీలో బీజేపీ, బీఆర్‌ఎస్‌ మధ్య ఏదో అవగాహన ఉందనే ప్రచారం జరుగుతోందని, కాంగ్రెస్‌ నాయకులు చేస్తున్న దుష్ప్రచారాన్ని ప్రజలు నమ్మడం మొదలు పెట్టారని, కవిత అరెస్టు అయితేనే బీజేపీపై నమ్మకం పెరుగుతుందని ఇటీవల బీజేపీ నేత కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి కూడా వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలోనే కేంద్రం పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది.

దర్యాప్తు సంస్థల వేగవంతమైన అడుగులు

ఢిల్లీ మద్యం కుంభకోణానికి సంబంధించి మొన్నటిదాకా ఆచితూచి అడుగులు వేసిన కేంద్ర దర్యాప్తు సంస్థలు.. ఇప్పుడు వేగం పెంచాయి. కీలక ఆధారాలు రాబట్టే పనిలో ఉన్నాయి. ముఖ్యంగా ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కీలక నిందితులను విచారణ చేస్తున్నాయి. అయితే కొంతమంది తాము అప్రూవర్లు గా మారుతామని చెప్పడంతో వారికి అధికారులు ఆ అవకాశం ఇస్తున్నారు. అయితే ఈ జాబితాలో ప్రస్తుతం శరత్ చంద్ర రెడ్డికి అధికారులు ఆ అవకాశం ఇచ్చారు. అతడు చెప్పిన వివరాల ఆధారంగా మరింత లోతుగా కేసు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈడి అధికారులు ఈసారి విడుదల చేసే చార్జిషీట్లో కవిత పేరు ఉండొచ్చని ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. తదుపరి అడుగులు ఎలా ఉంటాయో తెలియదు కానీ ప్రస్తుతానికైతే కేసు కు సంబంధించి దర్యాప్తు ఊపందుకుంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular