Janasena: ఏపీలో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. కొత్త లెక్కలు తెరపైకి వస్తున్నాయి. పెద్ద ఎత్తున అభ్యర్థులను మార్చడం ద్వారా సీఎం జగన్ సంచలనాలకు కేంద్రం అవుతున్నారు. అదే సమయంలో వైసీపీ ఓటమి కోసం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఒక్కటయ్యారు. బిజెపి విషయంలో స్పష్టత రావాల్సి ఉంది. అయితే తనను దెబ్బ కొట్టేందుకు చంద్రబాబుతో పవన్ చేతులు కలపడాన్ని సీఎం జగన్ జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకే ముందుగా పవన్ ను దెబ్బతీయాలని భావిస్తున్నారు. రకరకాల ఎత్తుగడలతో ముందుకు సాగుతున్నారు. అంది వచ్చిన ఏ అవకాశాన్ని వదులుకోవడం లేదు.
పవన్ వెంట ప్రధానంగా కాపు సామాజిక వర్గం ఉంది. గుంప గుత్తిగా ఈసారి జనసేనకు కాపులు మద్దతు తెలపనున్నారని వార్తలు వస్తున్నాయి.అదే జరిగితే టిడిపికి భారీ అడ్వాంటేజ్ అవుతుంది. దానిని గండి కొట్టేందుకు కాపు ఉద్యమ మాజీ నేత ముద్రగడ పద్మనాభం వైసీపీలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అదే సమయంలో జేడీ లక్ష్మీనారాయణ జై భారత్ నేషనల్ పార్టీని స్థాపించారు. ఇది కూడా పవన్ కు దెబ్బ కొట్టే విషయమేనని చర్చ నడుస్తోంది. అటు ముద్రగడ పద్మనాభం, ఇటు జేడీ లక్ష్మీనారాయణ ద్వారా పవన్ కళ్యాణ్ నియంత్రించాలని జగన్ చూస్తున్నట్లు విశ్లేషణలు వస్తున్నాయి. సరిగ్గా ఇదే సమయంలో జనసేన పేరుతో మరో పార్టీని తెరపైకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.
తెలంగాణ ఎన్నికల్లో జనసేన పోటీ చేసిన సంగతి తెలిసిందే. బిజెపితో పొత్తులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఎనిమిది అసెంబ్లీ స్థానాల్లో ఆ పార్టీ పోటీ చేసింది. సరిగ్గా అదే సమయంలో జనసేనకు పోటీగా జాతీయ జనసేన పార్టీ సైతం తన అభ్యర్థులను బరిలో దించింది. ఆ పార్టీ అధ్యక్షుడు పేరు కూడా కె.పవన్ కళ్యాణ్. జనసేన ఏ స్థానాల్లో పోటీ చేసిందో జాతీయ జనసేన పార్టీ కూడా అక్కడ అభ్యర్థులను దించింది. ఆ పార్టీ గుర్తు బకెట్. జనసేన గాజు గ్లాస్ గుర్తుకుదగ్గరగా ఉంటుంది. అందుకే తెలంగాణ ఎన్నికల్లో జనసేనకు కోలుకోలేని దెబ్బ తగిలినట్లు విశ్లేషణలు ఉన్నాయి. కూకట్ పల్లి నియోజకవర్గంలో ఏకంగా జాతీయ జనసేన పార్టీకి 800 ఓట్లు రావడం విశేషం. ఈ లెక్కన ఏపీలో బరిలో దించితే ఆ పార్టీ టిడిపి, జనసేన కూటమి ఓట్లను చీల్చే అవకాశం ఉందని వార్తలు జగన్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈసారి ఎన్నికల్లో గోదావరి జిల్లాలో పవన్ ప్రభావం ఎక్కువగా ఉంటుందన్నది అంచనా. అటు పవన్ సైతం కూటమి వైపు కాపు సామాజిక ఓట్లు మళ్ళించాలని గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటువంటి సమయములో పవన్ ను టార్గెట్ చేసుకొని జగన్ ఈ కొత్త ఎత్తుగడలకు దిగుతున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కాపులను టార్గెట్ చేసుకొని కొత్త పార్టీలను బరిలో దించుతున్నట్లు తెలుస్తోంది. మరి ఆ ప్రయత్నాలు ఎంతవరకు వర్కౌట్ అవుతాయో చూడాలి.