Hakimpet Sports School: మొన్ననే కదా హకీంపేట స్పోర్ట్స్ స్కూల్ ఓఎస్డీ హరికృష్ణ “కామ తురాణం” వెలుగులోకి వచ్చింది.. క్రీడా శాఖ మంత్రి పేషీ లో ఏ స్థాయిలో నిర్లక్ష్యం పేరుకు పోయిందో.. అతగాడి వేధింపుల మీద మీడియాలో ప్రముఖంగా కథనాలు వచ్చినప్పటికీ క్రీడా శాఖ మంత్రి పట్టించుకోలేదు. చివరికి ఎమ్మెల్సీ కవిత ట్వీట్ చేస్తే తప్ప క్రీడా శాఖ మంత్రి విచారణకు ఆదేశించలేదు. పైగా ఒక బాధ్యత గల మంత్రి స్థానంలో ఉండి ఆమెకు మోకరిల్లడం అతడి బానిసత్వ మనసత్వాన్ని సూచిస్తోందని విపక్ష నాయకులు పేర్కొంటున్నారు. ఇది మర్చిపోకముందే మరొక ఉదంతం తెరపైకి వచ్చింది.
హరికృష్ణ ద్వారా తీవ్ర ఉక్కపోతకు గురవుతున్న మంత్రి శ్రీనివాస్ గౌడ్.. తాజాగా ఆయన పేషీ లో పనిచేస్తున్న సురేందర్ రూపంలో మరో బ్రిజ్ భూషణ్ బయట పడ్డాడు. సురేందర్ అనే వ్యక్తి మంత్రి శ్రీనివాస్ గౌడ్ దగ్గర డాటా ఎంట్రీ ఆపరేటర్ గా పని చేస్తున్నాడు. అయితే ఇటీవల జాతీయ క్రీడాకారిణి తన బంధువులతో మంత్రి శ్రీనివాస్ గౌడ్ ను కలిసి ఎందుకు ఆయన పేషీకీ వెళ్లారు. అప్పటినుంచి సురేంద్ర కారణంగా ఆమె తీవ్ర ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. మంత్రిని కలవడానికి ఆ క్రీడాకారిణి వెళ్ళినప్పుడు ఆ డాటా ఎంట్రీ ఆపరేటర్ ఆమె ఫోన్ నెంబర్ అడిగి తీసుకున్నాడు. తర్వాత ఆమెకు అసభ్యకరమైన సందేశాలు పెట్టడం ప్రారంభించాడు. ” నీ ఫిజిక్ బాగుంది. నీ వయసు ఎంత? నీ పర్సనల్ ఫోటోలు పంపు. నీతో పర్సనల్ గా మాట్లాడాలి, పర్సనల్ గా కలవాలి” అంటూ సందేశాలు పెట్టాడు. సురేందర్ వేధింపులు తట్టుకోలేక ఆ క్రీడా కారిణి, తనను మంత్రి వద్దకు తీసుకెళ్లిన బంధువుకు ఇదంతా చెప్పుకొని కన్నీటి పర్యంతమైంది.
దీంతో ఆ బంధువు వెంటనే సురేందర్ కి ఫోన్ చేసి ” మా అమ్మాయిని ఎందుకు వేధిస్తున్నావ్? అసభ్యకరంగా ఎందుకు మెసేజ్ లు పెడుతున్నావ్ ? మరో ఇద్దరు ముగ్గురు అమ్మాయిల పట్ల కూడా ఇదేవిధంగా వ్యవహరించావట?” అని అతడిని నిలదీశాడు. మంత్రి దృష్టికి తీసుకెళ్తానని హెచ్చరించాడు. అయితే ఈ పరిణామంతో ఒక్కసారిగా సురేందర్ లో ఉన్న కమల్ హాసన్ బయటికి వచ్చాడు. తనకేమీ తెలియదు అన్నట్టుగా బుకాయించాడు. నువ్వు పంపిన మెసేజ్లు మొత్తం నా వద్ద ఉన్నాయంటూ ఆ క్రీడాకారిణి బంధువు చెప్పడంతో తప్పయిందని ఒప్పుకున్నాడు. ఆయనకు సారీ చెప్పాడు. ఇదంతా మనసులో పెట్టుకోవాలని.. బయటపడితే తన బతుకు రోడ్డున పడుతుందని బతిమాలుకున్నాడు. హకీంపేట స్పోర్ట్స్ స్కూల్ ఓ ఎస్ డి పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణల ఘటన మరువకముందే క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేషీలోనే సురేందర్ రూపంలో మరో బ్రిజ్ భూషణ్ బయటపడటం తో కలకలం నెలకొంది. ఆయనను విధుల నుంచి మంత్రి శ్రీనివాస్ గౌడ్ తొలగించాడు. అయితే కేవలం ఆ క్రీడాకారిణికి మాత్రమే అలా మెసేజ్ లు పెట్టాడా? లేక ఇంకా ఎవరి పట్లయినా అలా వ్యవహరించాడా అనే దానిపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆరా తీస్తున్నారు. ఇప్పటికే హరికృష్ణ పరిణామంతో పీకల లోతు కష్టాల్లో కూరుకుపోయిన ఆయన.. సురేందర్ ఉదంతంతో మరింత ఇబ్బందులు పడ్డారు.