IT crisis : ఐటీ ఉద్యోగం అంటే.. వారికి ఐదు రోజులే పని.. లక్షల్లో వేతనాలు.. ఏటా ఇంక్రిమెంట్లు.. ఇవీ రెండేళ్ల క్రితం వరకు ఐటీ ఉద్యోగులు, వారి తల్లిదండ్రులు, వారికి పిల్లను ఇచ్చిన అత్తామామ ఆలోచన. కానీ రెండేళ్లుగా ఐటీ పరిస్థితి తీవ్ర సంక్షోభం ఎదుర్కొంటోంది. ఆర్థిక మాంద్యం కారణంగా చిన్న సంస్థలే కాదు.. దిగ్గజ కంపెనీలు కూడా ఖర్చులు తగ్గించుకునే పనిలో పడ్డాయి. ముఖ్యంగా కరోనా తర్వాత ఈ పరిస్థితి పెరిగింది. గతేడాది తారాస్థాయికి చేరింది. దీంతో ఉద్యోగాలను తొలగిస్తున్నాయి. గతేడాది లక్షల మంది ఉద్యోగాలు ఊడాయి. ఈ ఏడాది కూడా గతేడాదిలాగానే ఉద్యోగాల్లో చాలా కంపెనీలు కొత మొదలు పెట్టాయి. ఇప‍్పటికే వేల మంది రోడ్డున పడ్డారు. తాజాగా గడిచిన ఆగస్టు నెలలోనే 44 కంపెనీలు 27,065 వేల మందిని తొలగించాయి. జూలైలో 9.051 మంది ఉద్యోగాలు పోయాయి. జూలైతో పోలిస్తే ఆగస్టులో ఉద్యోగాల కోత సుమారు మూడు రెట్లు పెరిగింది. సవాళ్లతో కూడిన ఆర్థిక పరిస్థితులను ఎదుర్కోవడానికి, ఖర్చులు తగ్గించుకోవడంలో భాగంగా కంపెనీలు ఉద్యోగాల్లో కోతలు విధిస్తున్నాయి. టెక్ దిగ్గజం ఇంటెల్, సిస్కో సిస్టమ్స్, ఇన్ఫీయన్ కంపెనీలు సైతం ఇదే బాటలో ఉన్నాయి.
తొలగింపు ఇలా…
మైక్రోసాఫ్ట్ తన గేమింగ్ డివిజన్‌లో 1,900 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్నట్టు ప్రకటించింది. ఆ సంస్థలో మొత్తం 22 వేల మంది ఉద్యోగుల్లో ఇది దాదాపు 8 శాతం. ఇక సాఫ్ట్‌వేర్ సేవల సంస్థ ‘సేల్స్‌ఫోర్స్’ మరోమారు ఉద్యోగుల మెడపై కత్తి వేలాడదీసింది. 700 మందిని తొలగిస్తున్నట్టు తెలిపింది. ఖర్చులను తగ్గించుకునే ప్రయత్నంలో గతేడాది 8 వేల మందిని ఇంటికి పంపిన సేల్స్‌ఫోర్స్ ఈ ఏడాది ప్రారంభంలోనే ఒకశాతం ఉద్యోగులపై వేటుకు సిద్ధమైంది. దుస్తుల తయారీ కంపెనీ లెవిస్ స్ట్రాస్ తన వ్యాపార పునర్వ్యవస్థీకరణలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ ఉద్యోగుల్లో దాదాపు 15 శాతం మందిని తీసేస్తున్నట్టు ప్రకటించింది. ఇక, దేశీయ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ కూడా టెక్నాలజీ, కాల్ సెంటర్, కార్పొరేట్ విభాగాల్లో పనిచేస్తున్న 400 మందిని తొలగించాలని నిర్ణయించింది. కంప్యూటర్ చిప్లు తయారుచేసే ఇంటెల్ సంస్థ సుమారు 15 వేల మందిని ఆగస్టులో తొలగించింది. జర్మన్ చిప్ తయారీ సంస్థ ఇన్ఫినియాన్ 1400, యాక్షన్ కెమెరా తయారీ సంస్థ గోప్రో 140 మంది చొప్పున ఉద్యోగులను తగ్గించుకోవాలని నిర్ణయించుకున్నాయి.
ఖర్చులు తగ్గించుకునేందుకే..
టెక్ సంస్థల్లో కొవిడ్ తర్వాత మొదలైన ఈ తొలగింపుల పర్వం.. నేటికీ కొనసాగుతోంది. ఏఐ మూలంగా కొన్ని కంపెనీలు.. ఖర్చులు తగ్గించుకునేందుకు ఉద్యోగులను తొలగిస్తుండగా, ఇంకొన్ని సంస్థలు ఆర్థక మాంద్యం కారణంగా ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్నాయి. 2025 నాటికి 10 బిలియన్ డాలర్ల ఖర్చును తగ్గించుకోవాలన్న ప్రణాళికలో భాగంగా ఈ లేఆఫ్ చేపట్టాయి. ముఖ్యంగా ఏఐ, సైబర్ సెక్యూరిటీ వంటి వృద్ధికి అవకాశం ఉన్న విభాగాలపై దృష్టిసారించడంలో భాగంగా ఈ తొలగింపులు చేస్తునా‍్నయి. ఐటీ హార్డ్‌వేర్ డిమాండ్ తగ్గడం, చైనా మార్కెట్లో తన పట్టును పెంచుకోవడం కష్టతరం కావడం వంటి పరిస్థితుల ఉద్యోగుల ఉదా‍్వసనకు కారణమవుతున్నాయి. మొత్తంగా ఈ ఏడాది ఇప్పటి వరకు 1.36 లక్షల మంది టెక్ ఉద్యోగులు కొలువులను కోల్పోయారు.