
రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీఓ 81, 85 హైకోర్టు కొట్టివేసింది. కొద్ది రోజుల కిందట ప్రభుత్వం ఈ జి.ఒలను తెచ్చింది. గతంలోనే ప్రభుత్వం, పిటీషనర్ తరుపు న్యాయవాదుల వాదనలు విన్న ధర్మాసనం తీర్పును రిజర్వు చేసింది. నేడు తీర్పు వివరాలను వెల్లడించింది. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా బీజేపీ నాయకులు సుదీష్ రాంబోట్ల, ఇంద్రనీల్ అనే న్యాయవాది పిటీషన్ లు దాఖలు చేశారు.
విచారణ సమయంలో ఏ మీడియం చదువుకోవాలి అనేది పిల్లలు, వారి తల్లిదండ్రులు నిర్ణయిస్తారని, ప్రభుత్వం బలవంతంగా రుద్దకుడదని పిటీషనర్ తరుపు న్యాయవాది తెలిపారు. అదేవిధంగా ఇలా ఇంగ్లీష్ మీడియాన్ని తప్పనిసరి చేస్తే కొందరి బ్యాక్ లాగ్ లు మిగిలిపోయే ప్రమాదం ఉందన్నారు. ప్రభుత్వం తరుపున అడ్వకేట్ జనరల్ తన వాదనలు వినిపించారు. మండలానికి ఒక తెలుగు మీడియం పాఠశాల నిర్వహిస్తామని కావాలనుకున్న వారు అక్కడ చదువుకోవచ్చని చెప్పారు. మండలంలోని అన్ని గ్రామాల విద్యార్థులు ఒక్క చోటికి వచ్చి చదుకు కోవడం సాధ్యం కాదని పిటీషనర్ తరుపు న్యాయవాది తెలిపారు. ప్రభుత్వ నిర్ణయాన్ని తెలుగు భాషా సంఘము, ఉపాద్యాయ సంఘాలు వ్యతిరేకించాయి. కోర్టు తీర్పును ఈ సంఘాలు స్వాగతిస్తున్నాయి.