Margadarsi Case: మార్గదర్శి కేసులో మరో దారుణం వెలుగులోకి వచ్చింది. తాజా సిఐడి తనిఖీల్లో ఇది బయటపడింది. చాలా లొసుగులను సిఐడి అధికారులు గుర్తించినట్లు సమాచారం. చిట్ ప్రారంభంలో ఖాతాదారుల సంతకాలు సేకరిస్తున్నారు. డిపాజిటర్లకు బదులు ఏజెంట్లు, మేనేజర్లు వేలం పాటలో పాల్గొంటున్నారు. బాధితుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని మోసం చేస్తున్నట్లు సిఐడి గుర్తించింది.
ప్రధానంగా మూడు కేసులకు సంబంధించి ఎఫ్ఐఆర్లను సిఐడి మీడియా ముందు ప్రకటించింది. సూళ్లూరుపేటకు చెందిన పందిరి సుబ్రహ్మణ్యం అనే రైల్వే ఉద్యోగి పేరిట చీటీని గుర్తించారు. ఆయన ఎటువంటి డిపాజిట్లు చేయకపోయినా.. ఆయన పేరుతో వేలం పాట పాడారు. సదరు సుబ్రహ్మణ్యం రాష్ట్రంలో ఏ మార్గదర్శి బ్రాంచ్ లో డిపాజిట్ కట్టలేదని చెబుతున్నాడు. అయినా సరే ఆయన ఆధార్ తో చిట్ వేలం పాడినట్లు సిఐడి అధికారులు గుర్తించారు. అటు బాధితుడిని ప్రశ్నించినా.. అది అవాస్తవమని చెప్పడంతో చీరాల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
అనకాపల్లిలో వెంకటేశ్వరరావు అనే వ్యక్తి మార్గదర్శిలో డిపాజిట్ చేశాడు. ఆయనకు 4.60 లక్షల రూపాయలు చిట్ రావాల్సి ఉంది. కానీ కేవలం 20 రూపాయలు మాత్రమే ఇచ్చినట్లు బాధితులు చెబుతున్నాడు. ఈ మేరకు ఆయన అనకాపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేశారు. దానిని కూడా సిఐడి గుర్తించింది. కేసు నమోదు చేసింది. సంబంధిత బ్రాంచ్ మేనేజర్ ను అరెస్టు చేసింది. అటు రాజమండ్రిలో కూడా ఇటువంటి కోణమే ఒకటి వెలుగులోకి వచ్చింది. కోరుకొండ విజయ్ కుమార్ అనే వ్యక్తి మార్గదర్శి యాజమాన్యం తనను మోసం చేసిందని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీనిపైన కూడా సిఐడి దృష్టి పెట్టింది.
ఇప్పటివరకు ఖాతాదారుల నుంచి ఎటువంటి ఫిర్యాదులు లేవని మార్గదర్శి యాజమాన్యం సమర్థించుకుంటూ వచ్చింది. కానీ సిఐడి తనిఖీల్లో మాత్రం రోజుకో కొత్త కోణం వెలుగులోకి వస్తోంది. బాధితులు నేరుగా ఫిర్యాదులు చేస్తుండడంతో సిఐడి దూకుడు పెంచుతోంది. శారదా చిట్స్ తరహాలోనే.. మార్గదర్శిలో సైతం అవకతవకలు చోటుచేసుకున్నాయని సిఐడి బలంగా వాదిస్తోంది. దానికి తగ్గట్టుగానే ఒక్కో ఆధారాన్ని బయటపెడుతోంది. కేసులో పట్టు బిగించే ప్రయత్నం చేస్తోంది.
ఇదెక్కడి స్కాం రామోజీ??#ScamsterRamoji #MargadarsiScam pic.twitter.com/QxDHJ6lM9G
— Sajjala Bhargava Reddy (@SajjalaBhargava) August 21, 2023