YCP Third List: వైసీపీలో మరో హై టెన్షన్. ఆ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున అభ్యర్థులను మార్చుతున్న సంగతి తెలిసిందే. తొలి విడతలో 11 మంది, రెండో జాబితాలో 27 మందిని మార్చుతూ జగన్ కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు మూడో జాబితా కసరత్తు పూర్తయినట్లు సమాచారం. 25 నుంచి 30 మంది వరకు అభ్యర్థులను మార్చుతూ ఈ జాబితా విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. నేడు సాయంత్రం ఈ జాబితాను వెల్లడించే అవకాశం ఉంది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ శ్రేణుల్లో ఒక రకమైన ఆందోళన కనిపిస్తోంది. ఇప్పటికే రెండు జాబితాలతో చాలామంది అసంతృప్తితో ఉన్నారు. కొందరు పార్టీకి రాజీనామా చేశారు. మరి కొందరు చేసేందుకు సిద్ధపడుతున్నారు. ఇటువంటి తరుణంలో మూడో జాబితా వస్తుండడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఫోన్ అంటేనే ఎమ్మెల్యేలు బెంబేలెత్తిపోతున్నారు. కొందరు అయిష్టంగానే వస్తున్నారు. మరికొందరికి కీలక నాయకులు సముదాయించి సీఎం ఎదుట నిలబెడుతున్నారు. సోమవారం మంత్రి కొట్టు సత్యనారాయణ, ఎంపీలు బెల్లాన చంద్రశేఖర్, నందిగామ సురేష్, మార్గాని భరత్, ఎమ్మెల్యేలు ఎలీజా, జంగాలపల్లి శ్రీనివాసులు, మొండితోక జగన్మోహన్ రావు, ఎమ్మెల్సీ అరుణ్ కుమార్, మాజీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ తదితరులు సీఎం క్యాంప్ ఆఫీసుకు వచ్చారు. అయితే తమ టిక్కెట్ల పై అనుమానంతో ఉన్నవారు మాత్రం సంప్రదింపులకు రమ్మంటే రాబోమని తేల్చి చెబుతున్నారు. కొందరిని ఎలాగోలో ముఖ్యమంత్రి కార్యాలయానికి తెప్పించి ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారు. పెనమలూరు ఎమ్మెల్యే కొలుసు పార్థసారధిని ఇదేవిధంగా తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. ప్రత్యామ్నాయ అవకాశాలు కల్పిస్తామని జగన్ ఇచ్చిన హామీకి పార్థసారథి పెద్దగా ఆసక్తి చూపనట్లు సమాచారం.
బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి జగన్ షాక్ ఇచ్చారు. నందికొట్కూరు ఎస్సీ నియోజకవర్గ సమన్వయకర్త విషయంలో సిద్ధార్థ రెడ్డి ప్రతిపాదనను తిరస్కరించినట్లు తెలుస్తోంది. సిద్ధార్థ రెడ్డి మాజీ ఎమ్మెల్యే లబ్బి వెంకటస్వామి పేరు ప్రతిపాదించారు. కానీ సీఎం జగన్ మాత్రం కడప జిల్లాకు చెందిన డాక్టర్ సుధీర్ ను నందికొట్కూరు ఇన్చార్జిగా నియమించినట్లు చెప్పడంతో సిద్ధార్థ రెడ్డి షాక్ కు గురయ్యారు. నందికొట్కూరు సిట్టింగ్ ఎమ్మెల్యే ఆర్ధర్ ను మార్చాలని సిద్ధార్థ రెడ్డి పట్టు పట్టారు. కానీ ఆ ఇద్దరికీ షాక్ ఇస్తూ తెరపైకి సుధీర్ ను తేవడం ప్రాధాన్యత సంతరించుకుంది.
విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ సైతం సీఎం జగన్ ను కలిశారు. ఈసారి ఎంపీగా చిన్న శ్రీనును పోటీ చేయిస్తామని.. మీకు సముచిత స్థానం కల్పిస్తామని జగన్ వారించే ప్రయత్నం చేశారు. అయితే తనకు ఎక్కడో ఒక చోట సర్దుబాటు చేయాల్సిందేనని బెల్లాన చంద్రశేఖర్ తేల్చి చెప్పినట్లు సమాచారం. గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్, మార్కాపురం ఎమ్మెల్యే నాగార్జున రెడ్డి సైతం సీఎం జగన్ ను కలిశారు. అటు నరసరావుపేట అసంతృప్త నాయకులు విజయసాయి రెడ్డిని కలిశారు. అయితే నేడు విడుదల కానున్న వైసిపి మూడో జాబితా మాత్రం ఎన్నెన్నో సంచలనాలకు వేదిక కానున్నట్లు తెలుస్తోంది.