
దేశంలో కరోనా ఎంట్రీతో ఆర్థిక వ్యవస్థ మొత్తం కుదేలైపోయింది. కరోనాకు ముందే మనదేశ జీడీపీ అంతంత మాత్రంగా ఉండేది. ఇక కరోనా ఎంట్రీ జీడీపీ పాతాళానికి పడిపోయింది. కరోనా నివారణలో భాగంగా కేంద్రం లాక్డౌన్ విధించడంతో అన్నిరంగాలు దెబ్బతిన్నాయి. నిరుద్యోగం పెరిగింది. ఇప్పుడిప్పుడే కొన్నిరంగాలు కోలుకుంటుండటంతో ఆర్థిక వ్యవస్థ తిరిగి గాడిన పడుతోంది. అయితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాల పేరుతో ప్రజాధనాన్ని వృథా చేస్తూ తిరిగి వారిపైనే పన్నులు మోపుతుండటం శోచనీయంగా మారింది.
Also Read: అప్పుల కోసం ‘సలహాల’ ఒప్పందం.. జగన్ మరీ పీక్స్
కరోనాతో నష్టపోయిన రంగాలను ఆదుకునేందుకు కేంద్రం ఆత్మనిర్భయ్ భారత్ పేరిట ప్యాకేజీ ప్రకటించింది. దీనివల్ల రాష్ట్రాలకు.. సామాన్య ప్రజలకు ఒరిగేందేమీ లేదని వాదనలున్నాయి. దీనికితోడు కరోనా సాకుతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలపై పన్నుల భారం మోపుతూ మరింత దోపిడికి పాల్పడుతుండటంపై విమర్శలు వెల్లువెత్తుతోన్నాయి. కేంద్రం ఆదాయం పెంచుకునేందుకు పన్నులు పెంచుతుండటంతో రాష్ట్రాలు కూడా అదే దారిలో వెళుతున్నాయి. పన్నుల విషయంలో కేంద్రం ఒక అడుగు ముందుకేస్తే రాష్ట్రాలు రెండడుగు ముందుకేస్తున్నాయి. దీంతో ప్రజలపై ఆర్థికభారం పెరిగి మరిన్ని కష్టాలు పడుతున్నారు.
కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, గ్యాస్, డిజీల్ కంపెనీలపై పన్నుల భారం మోపి ఆదాయం సమకూర్చుకుంటోంది. కేంద్రం బాటలోనే ఏపీ సర్కార్ నడుస్తోంది. ఏపీలో ఇబ్బడిముబ్బడిగా అమలవుతున్న సంక్షేమ పథకాలను నిధులను సమకూర్చుకునేందుకు జగన్ సర్కార్ నానా తంటాలు పెడుతోంది. ఇందులో భాగంగా పన్నులను పెంచుతూ ప్రజలపై భారం మోపుతోంది. ఇప్పటికే పలుమార్లు పెట్రో ఉత్పత్తులపై పన్నులు పెంచిన ప్రభుత్వం మరోసారి పెంచింది. దేశంలోనే పెట్రోల్ ధరల్లో ఏపీ నెంబర్ వన్ గా నిలిచి కొత్త రికార్డు సృష్టించింది.
పెట్రో ‘మంట’లో ఏపీకి సాటిలేరని జగన్ సర్కార్ తాజాగా నిరూపించింది. ఢిల్లీ.. ముంబాయి.. హైదరాబాద్.. వంటి మహానగరాల్లో కన్నా పెట్రోల్, డీజిల్ రేట్లు గుంటూరులో ఎక్కువ ఉండటం గమనార్హం. ఏపీలో ప్రస్తుతం పెట్రోల్ ధర రూ.88.. డిజీల్ ధర రూ.85గా ఉంది. ఇది పక్కనే ఉన్న తెలంగాణ రాష్ట్రంతో పోలిస్తే ఒక్కో లీటర్ పెట్రోల్ పై నాలుగు రూపాయాలు ఎక్కువ కాగా డిజీల్ పై మూడు రూపాయలు ఎక్కువగా ఉంది. పక్కనే ఉన్న తెలంగాణ, కర్ణాటక, యానాం నుంచి పెట్రోల్, డిజీల్ ధరలు తక్కువగా ఉండటంతో వినియోగదారులంతా అక్కడే పెట్రోల్ కొట్టుంచుకుంటున్నారు.
Also Read: వెండి సింహాల మాయంపై ఎందుకీ ‘దొంగా’ట
కరోనా సమయంలో ఏపీ సర్కార్ మద్యంపై భారీగా ధరలు పెంచిన సంగతి తెల్సిందే. మద్యంప్రియుల బలహీనతను సొమ్ముచేసి భారీగా ఆదాయం రాబట్టుకుంది. ప్రస్తుతం కరోనాతో ప్రభుత్వం ఆదాయం కోల్పోయిందనే సాకుతో మరోసారి పెట్రో ఉత్పత్తులపై భారీగా పన్ను విధించి వసూలు చేస్తోంది. వైసీపీ అధికారంలోకి రాకముందే పెట్రో ఉత్పత్తులపై వ్యాట్ రూ.2గా ఉండేది ప్రస్తుతం అది రెట్టింపు అయింది. జగన్ సర్కార్ తీరు చూస్తుంటే వీటి ధరలు మరింత పెరిగే అవకాశం ఉందనే టాక్ విన్పిస్తోంది. అభివృద్ధిలో ఏపీ నెంబర్ వన్ కాకపోయినా.. పెట్రో ‘వడ్డన’లో మాత్రం దేశంలోనే నెంబర్ వన్ అయిందంటూ పలువురు సెటైర్లు విసురుతున్నాయి.