
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ సుడిగుండంలో పడింది అనే విషయం అందరికి తెలిసిందే. ప్రస్తుతం రాష్ర్టం అప్పుల్లో తలమునకలవుతోంది. ప్రభుత్వ యంత్రాంగం నడవాలంటే ధనం అనే ఇంధనం ఉండాల్సిందే. కానీ ఇప్పుడు దానికే లాటరీ కొట్టాల్సి వస్తోంది. వేల కోట్లు అప్పులుగా తెచ్చిన రాష్ర్టం వడ్డీలకే సరిపోతుందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.. ఈ నేపథ్యంలో ప్రభుత్వం నడవాలంటే డబ్బు అవసరమే. కానీ అది ఇప్పుడు దక్కే దారులు కూడా మూసుకుపోతున్నాయి. సీఎం జగన్ ప్రస్తుతం దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. కేంద్రం సైతం ఏపీపై నిఘా పెంచింది. ఆర్థిక క్రమశిక్షణ గాడి తప్పిందనే విషయం తెలిసిపోయినట్లు అనుమానిస్తున్నారు.
కేంద్ర ఆర్థిక శాఖ ప్రభుత్వాన్ని ప్రభుత్వ వ్యయం, ఖర్చులు, అ్పులు, రుణపరిమితలపై ఆరా తీసింది. తరువాతే ఎఫ్ ఆర్బీఎం మినహాయింపులు ఇస్తామని చెప్పింది. దీంతో రాష్ర్ట ప్రభుత్వం చంద్రబాబునాయుడు కాలంలో 2017-18, 2018-19 సంవత్సరాల్లోని లెక్కలు కేంద్రానికి పంపింది. అప్పటికే రాష్ర్టం అప్పుల్లో కూరుకుపోయిందని కేంద్రం తెలిపింది. పాత పద్దులను ప్రామాణికంగా చూపుతూ 17 వేల కోట్లకు కొత్త ఆంక్షలు విధించింది. నిధులు అభివృద్ధికి ఖర్చు చేయలేదని సూచించింది. అయితే జగన్ పాలన ప్రారంభమైన నాటి వివరాలు పంపితే పరిస్థితి మరోలా ఉండేదని ఆర్థిక వేత్తలు చెబుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ పై రిజర్వు బ్యాంకు సైతం బిగింపులు ప్రారంభించింది. సెక్యూరిటీల విక్రయం ద్వారా అధిక వడ్డీతో ఏపీ ప్రభుత్వం రెండు వేల కోట్ల రూపాయల నిధులు సమీకరించుకుంది. కేంద్ర ప్రభుత్వం సైతం రెవెన్యూ లోటును భర్తీ చేస్తూ 1400 కోట్లు ఇచ్చింది. ఇందులో 2700 కోట్ల రూపాయలు రిజర్వు బ్యాంకు ఓవర్ డ్రాఫ్ట్ కింద జమచేసుకుంది. దీంతో అధిక వడ్డీపై తెచ్చుకున్న అప్పు, ఇప్పటికే వాడుకున్న మొత్తానికి చెల్లిపోయింది. గడిచిన మూడు నెలల్లో ప్రభుత్వం 18 వేల కోట్ల మేర అప్పు తెచ్చుకుంది.
మరో నాలుగు వేల కోట్ల ఆస్తుల్ని తనఖా పెట్టింది. దీంతో ఏపీ ప్రభుత్వం సంక్షోభంలో కూరుకుపోయిందని తెలుస్తోంది. ప్రతి నెల 3500 కోట్లు జీతాల కోసం, 2500 కోట్లు పింఛన్లకు, మరో మూడు వేల కోట్లు బకాయిల వాయిదాల కోసం సరాసరి ఆరువేల కోట్ల రూపాయల అవసరం అవుతోంది. కరోనా కారణంగా దేశంలోని అన్ని ప్రాంతాలు కుదేలైన మాట వాస్తవమే. కానీ ఆంధ్రప్రదేశ్ ఏటా స్థూల ఉత్పత్తిలో 3 శాతం రుణాలు సేకరించుకోవచ్చు. ఈ మొత్తం 36 వేల కోట్ల వరకు ఉంటుంది. 12 వేల కోట్ల అదనపు రుణానికి వెసులుబాటు దక్కింది.
కానీ ఏపీ 20 వేల కోట్ల మేర అప్పులు తెచ్చింది. ఏడాదిలో చేిసన అప్పుల మొత్తమే 68 వేల కోట్లకు మించిపోతోంది. ఇకపై కేంద్రం 36 వేల కోట్లకు మించి అప్పులు తీసుకునేందుకు అనుమతించకపోవచ్చు. ఎఫ్ఆర్బీఎం పరిధిలోకి రాకుండా కార్పొరేషన్లు, ఆస్తుల తనఖా ఇతర రూపాల్లో అప్పులు తెచ్చుకున్న విషయంపై కేంద్రానికి ఫిర్యాదులు వెళ్లాయి. దీంతో ఏపీ పరిస్థితి డోలాయమానంలో పడింది. కుడిదిలో పడిన ఎలుక చందంగా ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అవుతోంది. దీన్ని సీఎం జగన్ ఏ మేరకు గట్టెక్కిస్తారో వేచి చూడాల్సిందే.