తెలంగాణ సర్కార్ రాష్ట్రంలో కఠిన లాక్ డౌన్ అమలు చేస్తోంది. ఉదయం 10 గంటల తర్వాత బయటకు వస్తే వాహనాలు సీజ్ చేస్తోంది. కేసులు పెడుతోంది. సీఎం కేసీఆర్ ఆదేశాలతో తెలంగాణ పోలీసులు స్టిక్ట్ లాక్ డౌన్ అమలు చేస్తున్నారు.
ఈ క్రమంలోనే ఏపీ నుంచి వచ్చే వాహనాలకు సైతం తాజాగా బ్రేక్ వేశారు. దీంతో ఆంధ్రా-తెలంగాణ సరిహద్దుల్లో వాహనాలు నిలిచిపోయి గందరగోళ పరిస్థితి నెలకొంది.
తెలంగాణ సరిహద్దు అయిన కృష్ణ జిల్లా గరికపాడు వద్ద ఏపీ నుంచి వచ్చే వాహనాలను తెలంగాణ పోలీసులు అడ్డుకున్నారు. సూర్యపేట జిల్లా రామాపురం చెక్ పోస్టు వద్ద ఏపీ నుంచి వచ్చే వాహనాలను నిలిపేశారు. కరోనా వల్ల కఠిన ఆంక్షలు ఉన్నాయని.. కోదాడ మీదుగా మాత్రమే తెలంగాణలోకి అనుమతిస్తామని తెలిపారు. మఠంపల్లి, పులిచింతల చెక్ పోస్టులను సైతం మూసేశారు.
అయితే కర్ఫ్యూ లేని ఉదయం 6 నుంచి 10 గంటల వరకు కూడా ఏపీ వాహనాలను అనుమతించకపోవడంపై వాహనదారులు నిరసన తెలిపారు. రోజూ మాదిరిగానే వెళ్తున్నామని.. ఈ కొత్త ఆంక్షలు ఏంటని మండిపడుతున్నారు.
అయితే తెలంగాణలో ఈపాస్ ఉన్న వారిని మాత్రమే అనుమతిస్తామంటూ తెలంగాణ పోలీసులు స్పష్టం చేశారు. ఈపాస్ లేని వాహనాలను వెనక్కి పంపుతున్నారు. దీంతో భారీగా ఏపీ వాహనాలు నిలిచిపోయి గందరగోళ పరిస్థితి నెలకొంది.