కృష్ణపట్నంలో ఆనందయ్య ఇచ్చే మందును నాటు మందుగా గుర్తించారు. రాష్ర్ట ఆయుష్ శాఖ అధికారులు కమిషనర్ కర్నల్ రాములు ఆధ్వర్యంలో వైద్యబృందం నెల్లూరులో పర్యటించి మందును పరిశీలించింది. హైదరాబాద్ ల్యాబ్ లో ఆనందయ్య తయారు చేస్తున్న మందును పరీక్ష చేయించింది. వాటి ఫలితాల ఆధారంగా క్షేత్రస్థాయి పరిస్థితులు, ఆనందయ్య వివరాల ఆధారంగా దాన్ని నాటు మందుగా గుర్తించామని రాములు పేర్కొన్నారు. వంశపారంపర్యంగా ఇచ్చే నాటు మందుగా తెలిపారు. ఇందులో హానికర పదార్థాలు ఏమీ లేవన్నారు. అయితే దీన్ని ఆయుర్వేద మందుగా గుర్తించలేదని స్పష్టం చేశారు. ఢిల్లీలోని సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చి ఇన్ ఆయుర్వేదిక్ సైన్స్ కు ఇక్కడి పరిస్థితులపై నివేదిక పంపనున్నట్లు పేర్కొన్నారు.
కర్నల్ బృందం రెండు రోజుల పర్యటనలో తొలిరోజు మందు కోసం వచ్చిన వారిని కలుసుకుని వారి అభిప్రాయాలు సేకరించింది. మందును వాడిన వారి నుంచి కూడా వివరాలు తెలుసుకుంది. వారంతా మందు వినియోగంపై సానుకూలతన వ్యక్తం చేశారు. రెండోరోజు ఏయే ముడి సరుకులు, పదార్థాలు ఉపయోగించి మందు ఏ విధంగా తయారు చేస్తున్నారో ప్రత్యక్షంగా పరిశీలించి తెలుసుకున్నారు. పచ్చ కర్పూరం, పసుపు, నల్లజీలకర్ర, వేప ఇగురు, మారేడు ఇగురు, ఫిరంగి చెక్క, దేవరబంగి వంటివి వాడి పొడి తయారు చేస్తున్నారు. ముళ్ల వంకాయ, తోకమిరియాలు, తేనె కలిపిన మిశ్రమాన్ని చుక్కల రూపంలో కంట్లో వేస్తుండడాన్ని పరిశీలించారు.
కోవిడ్ బాధితులకు ఆనందయ్య ఇచ్చే మందును తిరుమల తిరుపతి దేవస్థానం ఆయుర్వేద విభాగంలో అభివృద్ధి చేసి అందుబాటులోకి తెస్తామని చిత్తూరు జిల్లా చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రె డ్డి తెలిపారు., కృష్ణపట్నం గ్రామాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం ఆయుర్వేద విభాగం శాస్ర్తవేత్తలు, ప్రొఫెసర్లో కలిసి సందర్శించారు. మందుపై ఐసీఎంఆర్ చేసే అధ్యయనం సానుకూలంగా వస్తే అభివృద్ధి చేస్తామన్నారు. ఆనందయ్య మందుపై టీటీడీ ఈవో డాక్టర్ జవహర్ రెడ్డి ఆయుర్వేదిక్ కళాశాల ప్రొఫెసర్లతో సమీక్షించారు. మందులో వినియోగించే మూలికల వివరాలు తెలుసుకుని ఇక్కడ తయారు చేయాలని సూచించారు. బర్డ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కరోనా బాధితులపై పరిశీలించారని తెలుస్తోంది.
కోవిడ్ బాధితులకు ఇచ్చే మందుపై ప్రత్యేక కమిటీ వేసి విచారణ జరిపించాలని భారతీయ జనతా పార్టీ రాష్ర్ట శాఖ అధ్యక్షుడు సోము వీర్రాజు కేంద్ర ఆయుష్ శాఖ మంత్రి కిరణ్ రిజిజుకి లేఖ రాశారు. కేంద్రం చేపట్టిన కోవిడ్ నివారణ చర్యలకు ఈ వైద్యం సహాయకారిగా ఉంటుందని పేర్కొన్నారు.