Gang Rape: ఏపీ రాజధాని అమరావతి పరిధిలో దారుణాలు జరుగుతున్నాయి. ఇటీవలే సీఎం నివాసానికి కూతవేటు దూరంలో కృష్ణా నది ఇసుక మేటల్లో యువతిపై అత్యాచారం ఘటన మరువకముందే మరో దారుణం జరిగింది. గుంటూరు జిల్లాలో మరోసారి ఉన్మాదులు రెచ్చిపోయారు. రాత్రి సమయంలో దారిలో వెళుతున్న భార్యభర్తలను అటకాయించి వారిపై దాడి చేశారు. అనంతరం భర్తను కట్టేసి భార్యపై అఘాయిత్యానికి తెగబడ్డారు.
గుంటూరు జిల్లాలో వివాహితపై సామూహిక అత్యాచార ఘటన తీవ్ర కలకలం రేపింది. నగరానికి 28 కి.మీల దూరంలో మేడికొండూరు మండలం పాలడుగు వద్ద బుధవారం రాత్రి 10 గంటల సమయంలో అత్యంత దారుణంగా ఓ మహిళపై దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. దోపిడీ దొంగల తరహాలో మాటు వేసి మరీ ఈ దురాగతానికి పాల్పడ్డారు.
భార్యభర్తలు ఇద్దరినీ తీవ్రంగా కొట్టి చిత్రహింసలు పెట్టి ఉన్మాదులుగా ప్రవర్తించారు. భర్తను కట్టేసి భార్యపై సామూహిక అత్యాచారానికి తెగబడ్డారు. వేటకొడవళ్లతో బెదిరించి నగలు, నగదు కాజేశారు.
ఇటీవలే సీతానగరం పుష్కరఘాట్ వద్ద మూడు నెలల కింద జరిగిన సామూహిక అత్యాచార ఘటన మరువకముందే అదే తరహాలో మరో దారుణం గుంటూరు జిల్లాలో జరగడం సంచలనంగా మారింది.
గుంటూరు జిల్లా సత్తెనపల్లికి చెందిన దంపతులు భర్త (30), భార్య (26) బుధవారం మేడికొండూరు మండలం పాలడుగు గ్రామంలో ఓ శుభకార్యానికి వెళ్లారు. రాత్రి 9.45 గంటలకు సొంతూరుకు బయలు దేరారు. 2.5 కి.మీలు ప్రయాణించాక దారికి అడ్డంగా వేసి ఉన్న ఓ చెట్టు కొమ్మ ఎదురపడడంతో దానిపై నుంచి బైక్ ను ముందుకు పోనివ్వగా.. దుండగులు వాహనం చక్రానికి కర్ర అడ్డుపెట్టి బైక్ పై నుంచి వారిద్దరిని కింద పడగొట్టారు. వాటిని వారిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు.
తర్వాత వేటకొడవళ్లు చూపించి చంపేస్తామని హెచ్చరించారు. సమీపంలోని పొలాల్లోకి తీసుకెళ్లారు. ఆ మార్గంలో వెళ్లే వారికి అనుమానం రాకుండా బైక్ ను పొలాల్లోకి దించేశారు. బాధితురాలి దుస్తులు చంచేసి వాటితోనే భర్తను కట్టేశారు. భర్త వద్ద ఇద్దరు దుండగులు కాపలా కాయగా.. మరో ఇద్దరు బాధితురాలిని ఓ చెట్టు కిందకు తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. ఒకరి తర్వాత ఒకరు ఆమెపై అఘాయిత్యానికి ఒడిగట్టారు. రాత్రి 12.40 వరకు భార్యభర్తలిద్దరినీ చిత్రహింసలకు గురిచేశారు. అనంతరం నలుగురు ఉన్మాదులు బాధితుల నుంచి బంగారం, డబ్బులు తీసుకొని బెదిరించి.. చెబితే చంపేస్తామని చెప్పి పరారయ్యారు. ఆ సమయంలో ఓ ఫోన్ నంబర్ కూడా బాధితులకు ఇచ్చారు. దాన్ని పరిశీలించగా అది మధ్యప్రదేశ్ కు చెందిన నంబర్ గా తేలింది.
ఈ నలుగురిలో ముగ్గురు తెలుగులో మాట్లాడారని.. ఒక వ్యక్తి మాత్రమే వేరే భాషలో మాట్లాడారని బాధితురాలు పోలీసులకు తెలిపారు. వారంతా ముఖాలకు మాస్కులు పెట్టుకున్నట్టు చెప్పారు.
పోలీసులు ఈ కేసులో ఇప్పటికే 8మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. 8 బృందాలుగా గాలిస్తున్నారు. పాత నేరస్థులను విచారిస్తున్నారు.
ఏపీలోని గుంటూరు జిల్లాలో మూడు నెలల వ్యవధిలోనే ఇలాంటి రెండు ఘటనలు జరగడం కలకలం రేపుతోంది. ప్రభుత్వం , పోలీసులు దీనిపై సీరియస్ గా దృష్టిపెట్టాలని ప్రజలు కోరుతున్నారు.