
నరేంద్ర మోడీ మంత్రివర్గాన్ని విస్తరిస్తున్న సంగతి తెలిసిందే. ఇవాళ సాయంత్రం ఈ కార్యక్రమం జరగనుంది. మరి, కొత్తగా వచ్చేదెవరు? ఉన్నవాళ్లలో వెళ్లిపోయేదెవరు? ఇదే.. ఇప్పుడు దేశ రాజకీయాల్లో హాట్ టాపిక్. అందుతున్న సమాచారం ప్రకారం.. ఉన్నవారిలో ఐదారుగురిని పక్కనపెడతారు. 22 మందిని కొత్తగా తీసుకోబోతున్నారు.
ఇందులో తెలుగు రాష్ట్రాలకు చెందినవారు ఎవరైనా ఉండే ఛాన్స్ ఉందా? అనే చర్చ సాగుతోంది. అయితే.. తెలంగాణ నుంచి ఇప్పటికే ఒక కేంద్ర మంత్రి ఉన్నారు. కిషన్ రెడ్డి హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నారు. కానీ.. ఆంధ్రప్రదేశ్ నుంచే ఎవ్వరూ లేరు. అంతేకాదు.. దేశంలో కేంద్ర కేబినెట్లో ప్రాతినిథ్యం లేని ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. అందువల్ల.. ఈ కొరతను కూడా తీర్చేందుకు బీజేపీ అధిష్టానం సిద్ధమైందని తెలుస్తోంది. అదే సమయంలో తెలంగాణకు మరో మంత్రిపదవి కూడా ఇవ్వనుందని సమాచారం.
ఏపీలో బలపడేందుకు తీవ్రంగా ప్రయత్నాలు సాగిస్తున్న కమలదళం.. ఈ విస్తరణలో కేంద్ర మంత్రిపదవిని రాష్ట్రానికి కేటాయించడం ద్వారా జనాల్లో చర్చ జరిగేలా చూడాలని ప్రయత్నిస్తోందట. ఎలాగో 22 మందిని తీసుకుంటున్నప్పుడు.. ఏపీకి ఒకరిని కేటాయిస్తే బీజేపీకి ఇబ్బంది ఏమీ ఉండదు. ఈ కోణంలోనే ఆలోచించిన నరేంద్రమోడీ.. ఏపీకి సైతం కేబినెట్లో బెర్త్ కన్ఫామ్ చేసినట్టుగా చెబుతున్నారు.
అయితే.. బీజేపీ నుంచి ఎంపీగా గెలిచిన వారు ఎవరూ లేరు. ఉన్నట్టైతే మొదటి విస్తరణలోనే సెంట్రల్ మినిస్టర్ పదవి వచ్చేదేమో? ఆ తర్వాత జరిగిన పరిణామాలతో టీడీపీ ఎంపీలు బీజేపీ కండువా కప్పుకున్నారు. వారిలో సుజనా చౌదరి, టీజీ వెంకటేష్, సీఎం రమేష్ ఉన్నారు. ఈ ముగ్గురిలో ఒకరికి కేంద్ర మంత్రి పదవి ఇవ్వొచ్చనే ప్రచారం సాగుతోంది.
మరి, ఈ ముగ్గురిలో ఆ లక్కీ ఛాన్స్ దక్కేది ఎవరికి అన్నప్పుడు.. సీఎం రమేష్ పేరు వినిపిస్తోంది. రాజ్యసభలో కొన్ని బిల్లుల ఆమోదం సందర్భంగా జరిగిన చర్చలో సీఎం రమేష్ చురుగ్గా వ్యవహరించడం బీజేపీ పెద్దలను ఆకర్షించిందని చెబుతున్నారు. అందువల్ల ఈయన పేరునే పరిగణనలోకి తీసుకున్నట్టుగా ప్రచారం సాగుతోంది.
ఇక, తెలంగాణ నుంచి ఇప్పటికే కిషన్ రెడ్డి హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నారు. ఆయన్ను కొనసాగిస్తూనే.. ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావుకు సైతం కేబినెట్లో చోటు కల్పించబోతున్నట్టు తెలుస్తోంది. మరి, ఇందులో నిజం ఎంత? ఎవరెవరు కేబినెట్లోకి వచ్చారు? అన్నది సాయంత్రం తేలుతుంది.