CM Jagan: అమ్మఒడి.. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల తల్లులకు సంవత్సరానికి 15వేల చొప్పున వారి ఖాతాల్లో జగన్ సర్కార్ డబ్బులు జమ చేసే అద్భుత పథకం ఇదీ.. ఇప్పటికే రెండేళ్ల పాటు అమ్మఒడి పథకం కింద లక్షలాది విద్యార్థులకు పథకాన్ని అందిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఈ ఈ పథకంపై ప్రశంసలు కురిశాయి. అన్ని రాష్ట్రాలు ఈ పథకాన్ని మోడల్ గా తీసుకొని అమలు చేయాలని చూస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే పథకం విషయంలో జగన్ సర్కార్ ఫిట్టింగ్ పెట్టేసింది. పలు నియమాలు, నిబంధనలు పెట్టి పథకం లబ్ధిదారులకు షాకిచ్చింది. ఇక నుంచి అందరికీ ఈ అమ్మఒడి పథకానికి రాకుండా పలు కండీషన్లను పెట్టింది.
అమ్మఒడి పథకం అమలులో రాష్ట్ర ప్రభుత్వం మళ్లీ హాజరు శాతాన్ని పరిగణలోకి తీసుకోవడం లబ్ధిదారుల పాలిట శాపంగా మారనుంది. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు జగన్ సర్కార్ అమ్మఒడి పథకం నిధులు పంపిణీ చేస్తున్న సంగతి తెలిసిందే.
తాజాగా ఈ ఏడాది నుంచి అమ్మఒడి పథకాన్ని విద్యార్థుల హాజరు శాతంతో అనుసంధానం చేయాలని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించడం సంచలనమైంది. విద్యార్థుల హాజరు 75శాతం ఉండాలని ఇదివరకే నిర్ణయించామని.. ఈ విద్యాసంవత్సరం నుంచి ఈ నిబంధన అమలు చేయాలన్నారు. రాష్ట్రంలో పాఠశాలల నిర్వహణ, విద్యార్థుల హాజరు, అమ్మఒడి, విద్యాకానుక వంటి అంశాలపై విద్యాశాఖ ఉన్నతాధికారులతో సీఎం చర్చించారు.
ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల్లో 91శాతం హాజరు ఉందని అధికారులు చెబుతున్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ అమ్మఒడి పథకం స్ఫూర్తి కొనసాగించాలన్నారు. విద్యార్థులను బడి బాట పట్టించేందుకే ఈ నిర్ణయమన్నారు. అమ్మఒడి, విద్యాకానుక రెండు పిల్లలు స్కూల్ కు వచ్చేటప్పటికి అందించాలని చెప్పారు. ప్రధానంగా అన్ని స్కూళ్లకూ సీబీఎస్ఈ అఫిలియేషన్ తీసుకొచ్చే దిశగా చర్యలు తీసుకోవాలని జగన్ ఆదేశించారు.
మొత్తానికి హాజరు పేరిట స్కూళ్లకు రాని విద్యార్థులకు ‘అమ్మఒడి’ని దూరం చేసే ఎత్తుగడగా దీన్ని ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. మరి దీన్ని జగన్ సర్కార్ ఎలా సర్దుబాటు చేసుకుంటుందో చూడాలి మరీ.