Homeఆంధ్రప్రదేశ్‌CM Jagan Amaravati Visit: అమరావతిలో జగన్.. ఏం జరుగనుంది?

CM Jagan Amaravati Visit: అమరావతిలో జగన్.. ఏం జరుగనుంది?

CM Jagan Amaravati Visit: అంధ్రప్రదేశ్‌లోని అమరావతిలో ముఖ్యమంత్రి జగన్‌ సోమవారం పర్యటించనున్నారు. సీఎం పర్యటనతో అక్కడ ఉత్కంఠ పెరుగుతోంది. ఆర్‌ 5 జోన్‌లో పేదలకు ఇళ్లను ఇవ్వాలనే ప్రభుత్వం నిర్ణయంలో భాగంగా కీలక ఘట్టానికి సీఎం శ్రీకారం చుట్టనున్నారు. అయితే ఇదే అంశంపై హైకోర్టులో తీర్పు రిజర్వ్‌లో ఉంది. కేంద్రం ముందుకు రాకపోయినా రాష్ట్ర ప్రభుత్వమే ఖర్చు భరించేందుకు ముందుకు వచ్చింది. ఫలితంగా ముఖ్యమంత్రి అమరావతిలో 50 వేల మందికిపైగా పేదల ఇళ్లకు శంకుస్థాపన చేయనున్నారు.

గూడు కల్పించాలన్న సంకల్పంతో..
పేదలందరికీ ఇళ్లు పథకం కింద సీఆర్‌డీఏలో 50 వేలకు పైగా ఇళ్ల నిర్మాణానికి సోమవారం ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయనున్నారు. గూడు లేని పేదలకు స్థిరనివాసం సమకూర్చి, వారి భవిష్యత్తుకు భరోసా కల్పించాలన్న సంకల్పంతో జగన్‌ ఉన్నారు. పేదల ఇంటికి ఆటంకంగా ఉన్న పలు సమస్యలను అధిగమిస్తూ ప్రభుత్వం ఇప్పటికే అమరావతిలో 1,402.58 ఎకరాల్లో 50,793 మంది పేదలకు ఉచితంగా ఇళ్ల పట్టాల పంపిణీ చేసింది. రూ.1,829.57 కోట్లతో 50 వేల మందికి పైగా పేదలకు సర్కారు స్థిర నివాసాలు కల్పించేలా సీఎం జగన్‌ శంకుస్థాపన చేయనున్నారు.

ఉచితంగా ఖరీదైన ప్లాట్‌..
అమరావతిలో భూమి చాలా ఖరీదైంది. ఒక్కో ప్లాట్‌ రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల విలువ ఉంది. సుమారు రూ.1,371.41 కోట్ల ఖరీదైన భూమిని పేదలకు ఏపీ ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేసింది. లేఅవుట్‌తోపాటు మౌలిక సదుపాయాల కల్పనకు రూ.384.42 కోట్లతో మౌలిక సదుపాయాలను ప్రభుత్వం కల్పించనుంది. విద్య, ఆరోగ్య సేవలు అందించేందుకు రూ.73.74 కోట్లతో 11 అంగన్‌వాడీ కేంద్రాలు, 11 పాఠశాలలు, 11 డిజిటల్‌ లైబ్రరీలు, 12 ఆస్పత్రుల నిర్మాణం కూడా చేపట్టనుంది. లేఅవుట్ల పరిధిలో పచ్చదనాన్ని పెంపొందించి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఏర్పాటుచేసేందుకు రెండు దశల్లో రూ.168 లక్షలతో 28 వేల మొక్కలు నాటి వాటి సంరక్షణకు చర్యలు తీసుకోనున్నారు.

ఆరు నెలల్లో నిర్మాణాలు పూర్తి..
ఆర్‌–5 జోన్‌లో 6 నెలల్లో ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేస్తామని ప్రభుత్వం చెబుతోంది. ఇళ్ల నిర్మాణాలతో పేదలు కోటీశ్వరులు కావడం ఖాయమని మంత్రులు, ఎమ్మెల్యేలు చెబుతున్నారు. పేదలకు ఇళ్లు రాకూడదని టీడీపీ ప్రయత్నించిందని మండిపడుతున్నారు. పేదల ఇళ్ల కోసం ఏ స్థాయిలోనైనా పోరాడుతామన్నారు.

నిరసనలకు పిలుపు..
ఇదిలా ఉంటే.. అమరావతిలో ఇళ్ల నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ నిరసనలకు కొందరు పిలుపునిచ్చారు. ఈ సమయంలో ముఖ్యమంత్రి జగన్‌ పర్యటన, బహిరంగ సభలో సీఎం చేసే ప్రసంగం పైన ఉత్కంఠ నెలకొంది. సీఎం అమరావతి వేదికగా ఏం చెప్పబోతున్నారనే ఆసక్తి అందరిలో ఉంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular