https://oktelugu.com/

ఇక ఇప్పుడు జనసేన వంతు

రాజకీయ విమర్శలకు కేరాఫ్‌ అడ్రస్‌లా నిలుస్తోంది విజయనగరం జిల్లాలోని చారిత్రాత్మక పుణ్యక్షేత్రం రామతీర్థం. అధికార వైఎస్సార్‌‌ కాంగ్రెస్‌ పార్టీ సహా అన్ని రాజకీయ పార్టీలు ఇప్పుడు రామతీర్థం వేదికగా రాజకీయాలు నడిపిస్తున్నాయి. 400 ఏళ్ల ఘన చరిత్ర గల ఈ క్షేత్రం రాజకీయ నాయకుల ఆరోపణలు, ప్రత్యారోపణలకు కేంద్ర బిందువైంది. వైఎస్సార్సీపీని రాజకీయంగా ఇరుకున పెట్టడానికి ప్రతిపక్షాలు ఈ ఆలయాన్ని ఆయుధంగా వినియోగించుకుంటుండగా.. కౌంటర్ అటాక్ చేయడానికి వైసీపీ కూడా దీన్నే ప్రయోగిస్తోంది. ఒక పుణ్యక్షేత్రాన్ని రాజకీయ […]

Written By: , Updated On : January 3, 2021 / 03:02 PM IST
Follow us on

Ramathirtham Temple

రాజకీయ విమర్శలకు కేరాఫ్‌ అడ్రస్‌లా నిలుస్తోంది విజయనగరం జిల్లాలోని చారిత్రాత్మక పుణ్యక్షేత్రం రామతీర్థం. అధికార వైఎస్సార్‌‌ కాంగ్రెస్‌ పార్టీ సహా అన్ని రాజకీయ పార్టీలు ఇప్పుడు రామతీర్థం వేదికగా రాజకీయాలు నడిపిస్తున్నాయి. 400 ఏళ్ల ఘన చరిత్ర గల ఈ క్షేత్రం రాజకీయ నాయకుల ఆరోపణలు, ప్రత్యారోపణలకు కేంద్ర బిందువైంది. వైఎస్సార్సీపీని రాజకీయంగా ఇరుకున పెట్టడానికి ప్రతిపక్షాలు ఈ ఆలయాన్ని ఆయుధంగా వినియోగించుకుంటుండగా.. కౌంటర్ అటాక్ చేయడానికి వైసీపీ కూడా దీన్నే ప్రయోగిస్తోంది. ఒక పుణ్యక్షేత్రాన్ని రాజకీయ అవసరాల కోసం వాడుకోవడం పై సామాన్య ప్రజల నుంచి వ్యతిరేకత ఎదురవుతోంది.

Also Read: దేవుడితో రాజకీయం.. అడ్డంగా దొరికిన చంద్రబాబు?

ఇటీవల రామతీర్థం ఆలయంలో శ్రీరామచంద్రమూర్తి విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. శ్రీరాముడి విగ్రహం నుంచి తలను వేరు చేశారు. అంతేకాదు.. దానిని కొలనులో పడేశారు. ఈ ఘటన వెలుగులోకి వచ్చిన తరువాత.. రాజకీయ వేడి మరింత రాజుకుంది. తొలుత భారతీయ జనతా పార్టీ.. అనంతరం తెలుగుదేశం నేతలు ఈ ఆలయాన్ని సందర్శించారు. వైఎస్సార్సీపీ నేతలు సైతం రామతీర్థం ఆలయాన్ని సందర్శంచారు.

ఇక ఇప్పుడు జనసేన పార్టీ వంతు వచ్చింది. ఆ పార్టీ నేతలు మంగళవారం రామతీర్థాన్ని సందర్శించబోతోన్నారు. దానికంటే ఒకరోజు ముందే.. జనసేన పార్టీ నాయకులు నిరసన దీక్షలను చేపట్టనున్నారు. గుంటూరు జిల్లాకు చెందిన జనసేన నేతలు సోమవారం రోజంతా నిరసన కార్యక్రమాలను నిర్వహించనున్నారు. రాష్ట్రంలో వరుసగా ఆలయాలపై చోటు చేసుకుంటున్న దాడులను నిరసిస్తూ.. సోమవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు గుంటూరు జిల్లాలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో నిరసన కార్యక్రమాలను చేపట్టనున్నట్లు చెబుతున్నారు. నియోజకవర్గ స్థాయి పార్టీ కార్యాలయాల్లో ఈ కార్యక్రమాలను నిర్వహించనున్నారు. జనసేన కార్యకర్తలు, వీరమహిళ విభాగం నేతలు ఇందులో పాల్గొననున్నారు. మరుసటి రోజు ఉదయం 11 గంటలకు జనసేన పార్టీ నాయకులు ధర్మ పరిరక్షణ యాత్ర పేరుతో రామతీర్థానికి తరలివెళ్లనున్నారు.

Also Read: విశాఖకు రాజధాని తరలింపు.. : డేట్‌ కూడా ఫిక్స్‌

మరోవైపు.. బీజేపీ నేతలు కూడా ఇందులో భాగస్వామ్యులు కానున్నారు. రాష్ట్రంలో హిందూ దేవతా విగ్రహాలు, ఆలయ ఆస్తులపై ఒక పరంపరగా జరుగుతున్న దాడులకు పరాకాష్టగా రామతీర్థం ఘటనను పేర్కొంది జనసేన. దీనికి ముందు నుంచీ రాష్ట్రంలోని ఆలయాలు, ఆస్తులపై యథేచ్ఛగా దాడులు కొనసాగుతున్నాయని విమర్శించింది. ఇంత జరుగుతున్నా ప్రభుత్వంలో చలనం ఉండట్లేదని విమర్శించింది. మొత్తంగా చూస్తే అన్ని ప్రధాన పార్టీలు రామతీర్థం అంశాన్ని చాలా సీరియస్‌గా తీసుకున్నట్లుగా అర్థమవుతోంది. ఇదే అంశాన్ని ఇలాగే కొనసాగించి.. ప్రభుత్వంపై వ్యతిరేకత తేవాలని ప్రయత్నిస్తున్నాయి. భవిష్యత్తులో ఏం జరుగుతుందో చూద్దాం.

మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్