ఇప్పటి వరకు అల్లోపతి వైద్యంలో కరోనాకు మందులేదు. అలాంటి భయంకరమైన వైరస్ ను తాను తగ్గిస్తానంటూ వచ్చారు కృష్ణపట్నం ఆనందయ్య. ఈ విషయం ఎంత వివాదాస్పదం అయ్యిందో.. ఎన్ని రోజులు కొనసాగిందో.. అందరికీ తెలిసిందే. మొత్తానికి కథ సుఖాంతం అయ్యింది. ఆనందయ్య మందుతో ప్రమాదం లేదని, దాన్ని పంపిణీ చేయొచ్చని ఆయుష్ వంటి సంస్థలు చెప్పాయి. కోర్టు, ప్రభుత్వం కూడా ఓకే చెప్పాయి. కానీ.. మందు ఎక్కడ అన్నదే సగటు జనం ప్రశ్న.
వివాదానికి ముందు వరకు ఉచితంగా లభించిన కరోనాకు మందు.. ఇప్పుడు మాత్రం దొరకట్లేదట! అవును.. స్వయంగా కృష్ణ పట్నం వెళ్లినవారికి కూడా మందు అందుబాటులో దొరకట్లేదట! అక్కడికి వెళ్లినవారు వట్టి చేతులతో తిరిగి వస్తుండగా.. మరికొందరు రోజుల తరబడి అక్కడే ఉండాల్సి వస్తోందట. ఇదే విషయాన్ని అక్కడికి వెళ్లిన ఓ మహిళ సోషల్ మీడియాలో వీడియోతో సహా పోస్టు చేసిన సంగతి తెలిసిందే. ఆనందయ్య మందు ఉచితంగా లభించట్లేదని చెప్పింది.
రాజకీయ నాయకులు, పారిశ్రామిక వేత్తలు డబ్బులు ఇచ్చి మరీ.. ముందుగా మందు తయారు చేయించుకొని వెళ్తున్నారనే ప్రచారం సాగుతోంది. వాళ్లు ఆ మందును తమ వారికి అందిస్తూ.. మిగిలిన మందు అమ్ముకుంటున్నారనే విమర్శలు కూడా వస్తున్నాయి. ఆ మధ్యనే ఆనందయ్య మందు బ్లాక్ మార్కెట్లో విక్రయిస్తున్నారని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు నేరుగానే.. ఆనందయ్య మందును అమ్ముకుంటున్నారని అంటున్నారు. అందుకే.. మందు సాధారణ జనాలకు దొరకట్లేదనే ప్రచారం సాగుతోంది. దీనిపై పలువురు ఆగ్రహం కూడా వ్యక్తంచేస్తున్నారు.
ఇలా.. డబ్బులు తీసుకుని మందు అమ్మేదానికి ప్రభుత్వ అనుమతి, కోర్టులను ఆశ్రయించడం వంటివి ఎందుకని ప్రశ్నిస్తున్నారు. నేరుగా వ్యాపారం చేసుకుంటే పోతుంది కదా? ఉచితం అని చెప్పడం ఎందుకు? కేవలం జనాలకు తెలిసేందుకు ఈ ప్రచారం చేశారా? అని నిలదీస్తున్నారు. ఈ ప్రచారంపై ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి స్పందించారు. ఇలాంటిది ఏమీ లేదని ఆయన చెప్పుకొచ్చారు.
మరి, అంతా బాగానే ఉన్నప్పుడు.. మందు ఎందుకు అందట్లేదు? అన్నది ప్రశ్న. కేవలం బడాబాబులకు ముందస్తుగా మందు తయారు చేస్తున్నారు కాబట్టే.. సామాన్య జనాలకు లభించట్లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. మరి, దీనికి ఆనందయ్య ఎలాంటి సమాధానం చెబుతారో..?