ఏపీలోని నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో వెలుగుచూసిన ఆనందయ్య కరోనా మందుపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఆ మందుతో కృష్ణపట్నంలో కొన్ని నెలలుగా ఒక్క కేసు లేదని.. తీసుకున్న వారికి కరోనా తగ్గిందని వీడియోలు వైరల్ అవుతున్నాయి.
తాజాగా ఓ హెడ్మాస్టర్ కరోనాతో బాధపడుతూ కళ్లలో ఈ పసరు పోసుకోగానే లేచి కూర్చున్న వీడియో వైరల్ అయ్యింది. అయితే అదే హెడ్మాస్టర్ ఇప్పుడు ఆక్సిజన్ లెవల్స్ తగ్గి దగ్గుతూ శ్వాస తీసుకోలేకపోతున్న మరో వీడియోను ప్రముఖ హేతువాది బాబు గోగినేని షేర్ చేసి ‘హౌలేగాళ్లరా? ఆకుపసరుతో కరోనా తగ్గుతుందా? ఈ వీడియో చూడండి.. మూఢులై ప్రాణాలు తీసుకోకండి’ అంటూ ఫేస్ బుక్ లో ఆనందయ్య ఆయుర్వేద మందు వట్టి ఫేక్ అంటూ పెద్ద ఉత్తరమే రాసుకొచ్చాడు.
ఇక మరికొందరు మాత్రం ఆనందయ్య కరోనా మందు పనిచేస్తోందని.. అందుకే ఏపీ ప్రభుత్వం, ఐసీఎంఆర్ కలిసి ఈ మందును నిగ్గుతేల్చే పనిలో పడ్డారని చెబుతున్నారు.
ఇప్పుడు ఈ మందు వల్ల అయితే కరోనా తగ్గుతుందన్న వాదన వినిపిస్తోంది. ఎందుకంటే బాధితులు చాలా మంది రికవరీ అయ్యారు. హేతువాది బాబు గోగినేని, రాంగోపాల్ వర్మ వంటి వాళ్లు మాత్రం ఆకుపసర్లతో కరోనా తగ్గుతుందా? ఇదంతా బుర్రకథ అంటూ సెటైర్లు వేస్తున్నారు.
మొత్తంగా ఆనందయ్య మందు పనిచేస్తుందా? లేదా అన్నది అఫీషియల్ గా ఐసీఎంఆర్ తేల్చేవరకు ఇలాంటి విమర్శలు, ప్రతి విమర్శలు వస్తూనే ఉంటాయి. మరి ఇందులో నిజం ఎంతనేది తేలాల్సి ఉంది.