https://oktelugu.com/

Anand Mahindra : పైన వంతెన.. కింద పులి.. హైవే ఇలా కూడా నిర్మిస్తారా? ఆనంద్ మహీంద్రా ట్వీట్ వైరల్

చుట్టూ దట్టమైన అడవి, దాని మధ్యలో నుంచి వంతెనల మీదుగా హైవే, దాని కింద పులి లాంటి జంతువులు వెళ్తున్నాయి. ఇది ప్రయాణికులకు అద్భుతమైన అనుభూతిని ఇస్తుంది. ఇలాంటి నిర్మాణం చేయడం గొప్ప విషయం అంటూ" ఆనంద్ మహీంద్రా వ్యాఖ్యానించారు. కాగా, ఆనంద్ ఈ పోస్ట్ పెట్టడం పట్ల చాలామంది నెటిజెన్లు ఆయనను కొనియాడుతున్నారు.

Written By:
  • NARESH
  • , Updated On : May 6, 2024 8:43 am
    Anand Mahindra

    Anand Mahindra

    Follow us on

    Anand Mahindra : ఒకప్పటితో పోల్చితే భారత్ లో రహదారుల నిర్మాణం పూర్తిగా మారిపోయింది. అమెరికాను దాటి హైవేలు నిర్మిస్తూ సరికొత్త రికార్డు సృష్టిస్తోంది. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా హైవేలు, సొరంగ మార్గాలు, అధునాతన ఎక్స్ ప్రెస్ వే లు నిర్మిస్తూ రహదారుల నిర్మాణ రంగంలో అనితరసాధ్యమైన ప్రగతిని సాధిస్తోంది. ఈ నేపథ్యంలో భారతదేశ జాతీయ రహదారుల నిర్మాణ సంస్థ పనితీరుపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. ఈ జాబితాలో ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా కూడా చేరారు. ఆయన తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఒక ఫోటోను షేర్ చేసి.. ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

    మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని పెంచ్ టైగర్ రిజర్వ్ వద్ద జాతీయ రహదారుల నిర్మాణ సంస్థ హైవే నిర్మించింది. చుట్టుపక్కల చెట్లు, పైనుంచి వాహనాలు వెళ్లే విధంగా దీనిని నిర్మించింది. దట్టమైన అటవీ ప్రాంతం కావడంతో, అందులో ఉన్న జంతువులకు ఏమాత్రం ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ఇలా హైవే నిర్మించింది. జాతీయ రహదారి 44 నిర్మాణంలో భాగంగా దీనిని ఏర్పాటు చేసింది. వన్యప్రాణులు, క్రూర మృగాలు స్వేచ్ఛగా సంచరించేందుకు.. అటవీ ప్రాంతం మీదుగా ఈ వంతెనను నిర్మించింది. ఈ వంతెన కింద వన్యప్రాణులు సంచరిస్తున్న దృశ్యాలను ఇప్పటికే నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా తన అధికారిక సోషల్ మీడియా ఖాతాలో పంచుకుంది.

    తాజాగా ఆ తరహా దృశ్యాలను ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద మహీంద్రా తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా నిర్మించిన హైవే వంతెన కింద నుంచి ఒక పులి తన రాజసాన్ని ప్రదర్శిస్తూ నడుచుకుంటూ వెళ్తోంది. ఈ దృశ్యం తనకు ఎంతో నచ్చిందని చెప్పిన ఆనంద్ మహీంద్రా.. దానిని తన ట్విట్టర్ ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఇప్పటివరకు ఈ పోస్టుకు లక్షల్లో వ్యూస్ నమోదు అయ్యాయి. సుమారు 9000 మంది లైక్ చేశారు. ” ఈ హైవే నిర్మాణం బాగుంది. చుట్టూ దట్టమైన అడవి, దాని మధ్యలో నుంచి వంతెనల మీదుగా హైవే, దాని కింద పులి లాంటి జంతువులు వెళ్తున్నాయి. ఇది ప్రయాణికులకు అద్భుతమైన అనుభూతిని ఇస్తుంది. ఇలాంటి నిర్మాణం చేయడం గొప్ప విషయం అంటూ” ఆనంద్ మహీంద్రా వ్యాఖ్యానించారు. కాగా, ఆనంద్ ఈ పోస్ట్ పెట్టడం పట్ల చాలామంది నెటిజెన్లు ఆయనను కొనియాడుతున్నారు.