Revanth Reddy: కాంగ్రెస్‌లో ఒకే ఒక్కడు.. అన్నీతానై పార్టీని నడుపుతున్న టీపీసీసీ చీఫ్‌!

దాదాపు పతనావస్థలో ఉన్న హస్తం పార్టీకి రేవంత్‌ ఆక్సీజన్‌లా మారారు. టీపీసీసీ బాధ్యతలు చేపట్టిన తర్వాత.. అంతర్గతంగా ఎంత వ్యతిరేకత వచ్చినా..

Written By: Raj Shekar, Updated On : November 27, 2023 1:08 pm
Follow us on

Revanth Reddy: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కౌంట్‌డౌన్‌ కొనసాగుతోంది. పోలింగ్‌కు ఇంకా కేవలం నాలుగు రోజేలే ఉంది. ఇప్పటికీ ఓటర్లు ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. ఈ క్రమంలో ఓటర్లను ఆకట్టుకునేందుకు మూడు ప్రధాన పార్టీలు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు బీఆర్‌ఎస్‌ హ్యాట్రిక్‌ గెలుపు కోసం, రాహుల్, ప్రియాంక, ఖర్గే తదితరులు కాంగ్రెస్‌ కోసం, ప్రధాని మోదీ, అమిత్‌షా, యోగి, హేమంత్‌ బిశ్వశర్మ, తదితరులు బీజేపీ కోసం హోరాహోరీగా ప్రచారం చేస్తున్నారు. అయితే తెలంగాణలో ఇవన్నీ ఒక ఎత్తు అయితే.. రేవంత్‌ ఒక ఎత్తు అన్నట్లుగా ఉంది. పదేళ్లు అధికారానికి దూరంగా ఉండి.. దాదాపు పతనావస్థలో ఉన్న హస్తం పార్టీకి రేవంత్‌ ఆక్సీజన్‌లా మారారు. టీపీసీసీ బాధ్యతలు చేపట్టిన తర్వాత.. అంతర్గతంగా ఎంత వ్యతిరేకత వచ్చినా.. అధిష్టానం ఆశీస్సులతో అందరినీ కలుపుకుపోతూ పార్టీని ఎన్నిక సమరానికి సిద్ధం చేశారు.

ఎన్నికల యుద్ధంలో అన్నీ తానై..
ఇక తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమరానికి రేవంత్‌ షెడ్యూల్‌కు ముందే సమాయత్తమయ్యారు. రైతు, మహిళా, బీసీ ఎజెండాలను అగ్రనేతలతో రిలీజ్‌ చేయించారు. సోనియాగాంధీని పిలిపించి ఆరు గ్యారంటీ హామీలు ఇప్పించి బీఆర్‌ఎస్‌కు ఓ సవాల్‌ విసిరారు. ఎన్నికల బరిలో నిలిపే అభ్యర్థుల విషయంలోనూ ఆచితూచి వ్యవహించారు. కాస్త ఆలస్యమైనా బలమైన అభ్యర్థులనే బరిలో దించారు. టీజేఎస్, సీపీఐ పొత్తుల విషయంలో చర్చలు జరిపి ఒప్పించారు.

ప్రచారంలో దూకుడు..
ఇక కాంగ్రెస్‌ అభ్యర్థులను ప్రకటించిన తర్వాత ప్రచారం మొదలు పెట్టిన రేవంత్‌ అన్నీ తానై పార్టీ ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్తున్నాడు. ప్రెస్‌మీట్లు, డిబేట్లు, మీడియా సమావేశాలు, టీవీషోలు, అభ్యర్థుల తరఫున ప్రచారం, ఇంటర్వ్యూలు ఇలా అన్నీ ఒక్కడే మేనేజ్‌ చేసుకుంటూ వస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రస్తుతం కాంగ్రెస్‌లో వన్‌మెన్‌ షో నడుస్తోంది. కాంగ్రెస్‌ను విజయ తీరానికి తీసుకెళ్లడమే లక్ష్యంగా టీడీపీ నుంచి వచ్చిన నేతగా కాకుండా, కరుడు గట్టిన కాంగ్రెస్‌ వాదిగా వ్యవహరిస్తున్నారు.

రేవంత్‌ సారథ్యంలోనే అందరూ..
ఇక రేవంత్‌ టీపీసీసీ పగ్గాలు చేపట్టిన మొదట్లో అలకబూనిన సీనియర్లు, గ్రూపులు కట్టిన నేతలు, వ్యతిరేకించిన నాయకులు ఇప్పుడు రేవంత్‌ సారథ్యంలోనే ఎన్నికల సమరంలోకి దిగారు. అయితే సీనియర్‌ నాయకులంతా సొంత నియోజకవర్గాలకే పరిమితమవుతుండగా, రేవంత్‌ మాత్రం అధిష్టానం ఆదేశాల మేరకు కొడంగల్, కామారెడ్డిలో పోటీ చేస్తున్నారు. మరోవైపు ప్రచారంలో తన నియోజకవర్గాలతోపాటు, అభ్యర్థుల నియోజకవర్గాల్లోనూ ప్రచారం నిర్వహిస్తూ ఓటర్లను ఆకట్టుకుంటున్నారు.

కేసీఆర్‌కు దీటుగా..
ఇక ఎన్నికల ప్రచారంలో సీఎం కేసీఆర్‌ కాంగ్రెస్‌ను టార్గెట్‌ చేసి విమర్శలు చేస్తున్నారు. ఆరోపణలు చేస్తున్నారు. వాటిని ధీటుగా ఎదుర్కొవడంలో, తిప్ప కొట్టడంలో రేవంత్‌ ముందుంటున్నారు. కేసీఆర్‌ ఒక్కటి అంటే.. రేవంత్‌ నాలుగు మాటలు అంటున్నారు. అయితే సీనియర్లు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి బ్రదర్స్, ఇతర సీనియర్‌ నాయకులు కేసీఆర్‌ విమర్శలను తిప్పికొట్టడం లేదు. చాలా మంది సీనియర్లు సొంత గెలుపు కోసం ప్రయత్నిస్తుండగా, రేవంత్‌ అన్నీ ఎదుర్కొంటూనే అగ్రనేతలు రాహుల్, ప్రియాంకగాంధీ, వంటి జాతీయ నాయకుల సమావేశాలకు అటెండ్‌ అవుతున్నారు.

మొత్తంగా రేవంత్‌ కాంగ్రెస్‌ పార్టీని ఎన్నికల సమరంంలో అచంచలమైన ఆత్మవిశ్వాసంతో టీం మొత్తాన్ని నడిపిస్తున్నారు. తెలంగాణలో కాంగ్రెస్‌ విజయాన్ని సాధిస్తే ముఖ్యమంత్రి అవడానికి కూడా మార్గం సుగమం చేసుకుంటున్నారని ప్రచారం జరుగుతోంది. మరి కాంగ్రెస్‌ గెలుస్తుందా.. గత రెండు ఎన్నికల తరహాలోనే వెనుకబడుతుందా చూడాలి.