Ramoji Rao Vs Jagan: మార్గదర్శి వ్యవహారంలో తన తండ్రి చేయలేని పనులన్నీ జగన్ చేస్తున్నాడు. ఇందులో అనుమానం లేదు. అంతటి కాకలుతిరిన రామోజీరావు ఇంటికి ఏపీ సిఐడి అధికారులను పంపాడు. దాదాపు రామోజీరావు మెడలు వంచినంత పని చేశాడు. చంద్రబాబు ఆర్థిక స్తంభాన్ని కూలగొట్టే ప్రయత్నం చేశాడు. సరే ఇంతటితోనే అయిపోయింది.. దెబ్బకు వాళ్ళు మన లైన్ లోకి వస్తారు అని జగన్ భావించినట్టున్నాడు. కానీ అక్కడ ఉన్నది రామోజీరావు.. మర్రి ఊడలు పాతుకుపోయినట్టు.. అన్ని వ్యవస్థల్లోనూ ఆయన తన ముద్రలు వేసుకున్నారు. ఫలితంగా తన మార్గదర్శిని జగన్ నుంచి కాపాడుకున్నారు. ఒకరకంగా వరుస ఉక్కపోతల తర్వాత రామోజీరావుకు దక్కిన ఉపశమనం ఇది. వరుస విజయాల తర్వాత జగన్ కు ఊహించని షాక్ ఇది.
మార్గదర్శి చిట్ ఫండ్ సంస్థకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కొంత ఊరట కలిగించే తీర్పు చెప్పింది. చిట్ గ్రూపుల నిలిపివేతపై అభ్యంతరాలు తెలపాలని చందాదారులను కోరుతూ ఏపీ ప్రభుత్వం జూలై 30న ఇచ్చిన బహిరంగ నోటీసును హైకోర్టు రెండవ మాట లేకుండా సస్పెండ్ చేసింది. ఆ నోటీసుల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకోవద్దని స్పష్టం చేసింది. ప్రభుత్వ ఇచ్చిన స్వల్ప ఫిర్యాదు తప్ప.. చందాదారులు దాఖలు చేసిన వ్యాజ్యంలో హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీచేసినా పరిస్థితిలో ఎటువంటి మార్పు కనిపించడం లేదని మార్గదర్శి తరఫున సీనియర్ న్యాయమూర్తి వాదనలు వినిపించారని గుర్తు చేసింది. పరిస్థితిలో చిట్ గ్రూపుల నిలుపుదలకు చిట్స్ రిజిస్టార్/ డిప్యూటీ రిజిస్టార్ బహిరంగ నోటీసు జారీకి చర్యలు చేపట్టడం చూస్తుంటే చట్టాన్ని అడ్డుపెట్టుకొని ఏపీ ప్రభుత్వం దురుద్దేశంతో వ్యవహరిస్తోందన్న మార్గదర్శి న్యాయవాది వాదనలకు బలం కనిపిస్తోందని పేర్కొన్నది. చిట్ గ్రూపుల నిలిపివేత విషయంలో చందాదారులు దాఖలు చేసిన వ్యాజ్యాలు ప్రస్తుతం, మార్గదర్శి చిట్ ఫండ్ సంస్థ దాఖలు చేసిన పిటిషన్లు ఒకదానితో మరొకటి ముడిపడి ఉన్నాయని.. వాటన్నింటినీ కలిపి విచారించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. ఈ దశలో మద్యంతర ఉత్తర్వులు ఇవ్వకపోతే మార్గదర్శి చందాదారులకు పూడ్చుకోలేని నష్టం జరుగుతుందని వ్యాఖ్యానించింది. కొన్ని చిట్ గ్రూపుల నిలుపుదలను సవాల్ చేస్తూ చందాదారులు గతంలో దాఖలు చేసిన వ్యాజ్యాలో ఇప్పటికే మద్యంతర ఉత్తర్వులు ఇచ్చినట్టు గుర్తుచేసింది.
ప్రస్తుతం జారీ చేసిన బహిరంగ నోటీసు ఆధారంగా చిట్ అధికారులు తదుపరి చర్యలు ప్రారంభిస్తే వివిధ బ్రాంచ్ లలో పెద్ద సంఖ్యలో ఉన్న చిట్ చందాదారులపై ఆ ప్రభావం పడుతుందని తెలిపింది. మార్గదర్శి చిట్ ఫండ్ సంస్థ చెబుతున్నట్టు గ్రూపులో మూసివేత పర్యవసాన ప్రభావం ఆ సంస్థ పై పడుతుందని పేర్కొంది. అందువల్ల మార్గదర్శికి అనుకూలంగా మద్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకే మగ్గు చూపినట్టు కోర్టు స్పష్టం చేసింది. చందాదారుడు దాఖలు చేసిన వ్యాజ్యాలతో ప్రస్తుత వ్యాజ్యాన్ని జత చేయాలని రిజిస్ట్రీని ఆదేశించింది. వ్యాజ్యం లో ప్రతివాదులుగా ఉన్న స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ ముఖ్య కార్యదర్శి, కమిషనర్_ ఇన్ స్పెక్టర్ జనరల్, గుంటూరు, కృష్ణ, ప్రకాశం, విశాఖ జిల్లాల చిట్స్ డిప్యూటీ రిజిస్ట్రార్లకు నోటీసులు జారీ చేసింది. కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.
ఊహించలేదా?
మార్గదర్శి వ్యవహారంలో మొదటినుంచి బలమైన అడుగులు వేస్తున్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం.. కోర్టు నుంచి ఈ తరహా తీర్పు ఊహించలేదా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే ఇప్పటివరకు కోర్టు మెట్లు ఎక్కిన ప్రతిసారీ మార్గదర్శి సంస్థకు ప్రతి బంధకం ఎదురైంది. జగన్ ప్రభుత్వం ప్రతి విషయంలోనూ గెలుచుకుంటూ వచ్చింది. అయితే ఇక మార్గదర్శి పని ఏపీలో అయిపోయింది అనుకుంటున్న తరుణంలో రామోజీరావుకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఒక్కసారిగా ఆయాచిత బలం ఇచ్చింది. ఇదే ఊపు లో ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన అన్ని కేసులను సస్పెండ్ చేయాలని మార్గదర్శి యాజమాన్యం డిమాండ్ చేస్తోంది. మరి దీనిపై ఏపీ ప్రభుత్వం ఏ విధమైన కౌంటర్ దాఖలు చేస్తుందో వేచి చూడాల్సి ఉంది.