Life Prisoners- AP Govt: క్షమాభిక్ష.. సాధారణంగా ఈ పదం.. ఉరిశిక్ష పడిన వారి విషయంలోనే వినబడుతుంది. ప్రస్తుతం దేశంలో ఉరిశిక్ష విధించడమే అరుదు. ఘోరమైన నేరాల్లో మాత్రమే కిందిస్థాయి కోర్టులు, ప్రత్యక కోర్టులు ఉరిశిక్ష విధిస్తున్నాయి. ఈ నేపథ్యంలో క్షమాభిక్ష ప్రస్తావన తగ్గిపోయింది. ఆంధ్రప్రదేశ్‌లో తాజాగా ఓ క్షమాభిక్ష కేసు ఇపుపడు చర్చనీయాంశమైంది. నిజంగా ఇది సీరియస్‌గా ఆలోచించాల్సిన అంశమే. ఒక హత్య కేసులో పోలీసులు ఎన్నో వ్యవయప్రయాసలు పడి నేరస్తులను పట్టుకున్నారు.. దర్యాప్తు చేశారు. సాక్ష్యాధారాలు సేకరించారు. కోర్టులో అనేక విచారణల తర్వాత పోలీసులు సమర్పించిన ఆధారల ఆధారంగా నిందితులకు జీవితఖైదు విధించింది. కానీ వారికి రాష్ట్ర ప్రభుత్వం సింపుల్‌గా ఇటీవల క్షమాభిక్ష పెట్టింది. దీనిపై బాధితురాలు కోర్టును ఆశ్రయించగా.. స్పందించి ఆ రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం జీవితఖైదీలను నేరస్థుల్ని వదిలేయవచ్చా..? లీగల్ ప్రొసీజర్‌కు, కోర్టు తీర్పుకు అర్థమేమిటి..? అసలు ఖైదీల విడుదలలో రాష్ట్ర ప్రభుత్వానికి క్షమాభిక్ష ప్రసాదించే అధికారం ఉంటుందా? పరిమితులు ఏమిటి అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

ఎనిమిది మందికి క్షమాభిక్ష
ఏపీ హైకోర్టులో ఒక మహిళ ఇటీవల పిటిషన్ వేసిందిం ‘‘నా భర్త పార్థమరెడ్డిని హత్య చేసిన కేసులో ఎనిమిది మంది నేరస్థులు జీవితఖైదు అనుభవిస్తున్నారు. వాళ్లకు ఈ ఏడాది స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం క్షమాభిక్ష ప్రసాదించింది. దీనికోసం ప్రత్యేకంగా 121 జీవో తీసుకొచ్చింది. క్షమాభిక్ష ద్వారా బయటకు వచ్చిన పుచ్చలపల్లి నరేన్‌రెడ్డి , కొండూరు దయాకర్‌రెడ్డి , పుచ్చలపల్లి శ్రీనివాసులురెడ్డి , పుచ్చలపల్లి నిరంజన్‌రెడ్డి , పుచ్చలపల్లి సుబ్రమణ్యంరెడ్డి , యల్లసిరి మస్తాన్, కలతూరు సుధాకర్‌రెడ్డి , చెన్నూరు వెంకటరమణారెడ్డిని తిరిగి జైలుకు పంపేవిధంగా ఆదేశాలు జారీచేయాయండి’ అని కోర్టును కోరింది.
మరణ శిక్ష పడితేనే క్షమాభిక్ష
తాజాగా ఈ పిటిషన్‌పై ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో విచారణ జరిగింది. బాధితురాలి తరఫు లాయర్ తన వాదనలు వినిపించారు. ‘‘కనీసం 14 ఏళ్లు జైలు శిక్ష అనుభవించకుండా దోషులను విడుదల చేశారు. వాళ్లలో కొందరు 8, మరికొందరికి 11 ఏళ్ల జైలు శిక్ష మాత్రమే అనుభవించారు. మరణశిక్ష పడి, కనీసం పదేళ్లు జైలు జీవితం అనుభవించిన తర్వాత మాత్రమే ఆ శిక్షను జీవిత ఖైదుగా మార్చే అధికారం గవర్నరుకు ఉంది అని మాత్రమే సుప్రీంకోర్టు చెప్పింది. జీవిత ఖైదు శిక్ష పడి కనీసం 14 ఏళ్లు జైలు జీవితం అనుభవించని వారికి క్షమాభిక్ష ప్రసాదించడానికి వీల్లేదు’’ అని కోర్టుకు విన్నవించారు. ‘‘నేరస్థులు 14 ఏళ్లు కూడా శిక్ష అనుభవించకుండానే, క్షమాభిక్ష ప్రసాదిస్తున్న విషయం రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ దృష్టికి కూడా తీసుకెళ్లలేదు. నేరస్థులు విడుదలతో తన ప్రాణాలకు కూడా ముప్పు ఉందని పిటిషనర్ భయపడుతున్నారు. ఈ విషయాన్ని పోలీసులకు కూడా చెప్పింది. అయినా ప్రభుత్వం గవర్నర్‌కు పూర్తి వివరాలు ఇవ్వలేదు. ప్రభుత్వ నిర్ణయమే చట్ట విరుద్ధం. క్షమాభిక్ష ప్రసాదిస్తూ జారీ చేసిన 121 జీవో చెల్లదు’’ అని వివరించారు.

161 సెక్షన్ ఏం చెబుతుంది..
దీనిపై ప్రభుత్వం తరఫు న్యాయవాది కూడా తన వాదనలు వినిపించారు. 161 సెక్షన్ ప్రకారం ఖైదీలకు క్షమాభిక్ష పెట్టే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని కోర్టుకు తెలిపారు. పశ్చాత్తాపం– సత్‌ప్రవర్తన కోణంలో కమిటీ సిఫారసు మేరకు 14 ఏళ్లు జైలుశిక్ష అనుభవించకపోయినా విడుదల చేయవచ్చన్నారు. ఈ ఆనవాయితీ ఎప్పటి నుంచో ఉందని వాదించారు. ఇద్దరి వాదనలు విన్న కోర్టు విచారణను 26వ తేదీకి వాయిదా వేసింది. క్షమాభిక్ష ప్రసాదించడాని సంబంధిత వివరాలన్నీ కోర్టుకు సమర్పించాలని న్యాయమూర్తి ప్రభుత్వాన్ని ఆదేశించారు. ఇలాంటి కేసుల్లో ఒక రాష్ట్ర ప్రభుత్వం అధికారాలేమిటో తెలపాలని, తరువాత వాటికి పరిమితులేమిటో చెబుతామని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ క్రమంలో ఈ కేసు ఇప్పుడు చర్చనీయాంశమైంది.