Amit Shah Vizag Visit: కార్మికుల ‘ఉక్కు’ సంకల్పం.. బీజేపీకి ప్రాణసంకటం

అమిత్ షాకు తాము కూడా స్వాగతం పలుకుతామని విశాఖ ఉక్కు కర్మాగారం ఉద్యమకారులు ఆరాటపడుతున్నారు. కానీ నిరసన రూపంలో స్వాగతం పలుకుతామని చెప్పేసరికి కమలం పార్టీలో కలవరం రేపుతోంది.

Written By: Dharma, Updated On : June 10, 2023 5:57 pm
Follow us on

Amit Shah Vizag Visit: విశాఖ పర్యటనకు అమిత్ షా వస్తున్న వేళ బీజేపీకి కొత్త తలనొప్పి ప్రారంభమైంది. సరిగ్గా విశాఖ ఉక్కు కార్మికులు అగ్గిమీద గుగ్గిలమవుతున్న వేళ అమిత్ షా పర్యటన ఏర్పాటుచేయడంపై భిన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. అటు కేంద్ర ప్రభుత్వంలో పవర్ ఫుల్ ప్రజాప్రతినిధిగా అమిత్ షా ఉన్నారు. తొలుత ఆయన ఈ నెల 8న పర్యటిస్తారంటూ ప్రకటించారు. కానీ టూర్ షెడ్యూల్ మారింది. 11న సాయంత్రం విశాఖ రానున్నఆయన..బహిరంగ సభలో మాట్లాడతారు. రాత్రికి అక్కడే బస చేస్తారు. 12న మధ్యాహ్నం వరకూ ఉంటారు. సాయంత్రం తిరిగి ఢిల్లీ పయనమవుతారు.

అగ్రనేత వస్తుండడంతో బీజేపీ పక్కగా ఏర్పాట్లు చేస్తోంది. భారీ జన సమీకరణకు సిద్ధమైంది. అయితే అమిత్ షాకు తాము కూడా స్వాగతం పలుకుతామని విశాఖ ఉక్కు కర్మాగారం ఉద్యమకారులు ఆరాటపడుతున్నారు. కానీ నిరసన రూపంలో స్వాగతం పలుకుతామని చెప్పేసరికి కమలం పార్టీలో కలవరం రేపుతోంది. ఈ నెల 10, 11 తేదీలలో వారు విశాఖ ఉక్కు కర్మాగారం వద్ద విశాఖ నగరంలో ఆందోళనలు పెద్ద ఎత్తున నిర్వహించడం ద్వారా అమిత్ షా కు ఉక్కు సెగ ఏంటో చూపించనున్నారు. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేట్ కాకుండా చూడాలంటూ కార్మికులు చేస్తున్న ఆందోళన ఈ నెల 11 నాటికి 850 రోజులు పూర్తవుతోంది. దీంతో ఉద్యమాన్ని పతాక స్థాయికి తీసుకెళ్లేందుకు వ్యూహరచన చేస్తున్నారు.

గత కొన్నిరోజులుగా బీజేపీ విశాఖ నగరంపై ఫోకస్ పెంచింది. గతంలో విశాఖ వేదికగా బీజేపీ ఎన్నో రాజకీయాలు చూసింది. 1982లో అటల్ బిహరీ వాజ్ పేయ్ నేతృత్వంలో విశాఖ కార్పొరేషన్ పీఠాన్ని దక్కించుకుంది. అటు తరువాత చెప్పుకోదగ్గ విజయాలను సొంతం చేసుకుంది. వచ్చే ఎన్నికల్లో పొత్తులు ఉన్నా లేకున్నా… విశాఖ లోక్ సభ స్థానాన్ని కైవసం చేసుకోవాలని ప్లాన్ చేస్తోంది. కానీ విశాఖ ఉక్కు వ్యవహారం అడ్డంకిగా మారనుంది. విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేయాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయం మైనస్ గా మారింది.

ప్రస్తుతం విశాఖ ఉక్కు కార్మిక సంఘాలు, ప్రజాసంఘాలు బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నాయి. కార్మికులు బీజేపీకి వ్యతిరేక వైఖరిగా ఉన్నారు. ఈ తరుణంలో బీజేపీ అగ్రనేత అమిత్ షా వస్తుండడంతో తమ నిరసన సెగ చూపించాలని భావిస్తున్నారు. అమిత్ షా విశాఖ ఉక్కు ని ప్రైవేట్ కానీయబోమని మాట ఇవ్వాలని ఉద్యమకారులు డిమాండ్ చేస్తున్నారు. దీంతో విశాఖలో పరిస్థితి నివురుగప్పిన నిప్పులా మారుతోంది. స్థానిక బీజేపీలో మాత్రం కలవరపాటుకు గురవుతోంది.