Amit Shah Operation Kagar: దశాబ్దాల పాటుగా దండకారణ్యంలో సమాంతర పరిపాలన సాగించారు మావోయిస్టులు.. మహారాష్ట్ర నుంచి మొదలు పెడితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వరకు మావోయిస్టులు విస్తరించి.. దండకారణ్యంలో ప్రభుత్వానికి పరిపాలించే అవకాశం లేకుండా చేశారు. రోడ్లు నిర్మిస్తే గుంతలు తవ్వారు. సెల్ఫోన్ టవర్లు నిర్మిస్తే కూల్చేశారు. వంతెనలు నిర్మిస్తే పేల్చేశారు.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఘాతుకాలకు పాల్పడ్డారు.
Also Read: ఏపీ వ్యాప్తంగా మావోయిస్టులు.. ఈరోజు మరో ఎన్కౌంటర్లో ఏడుగురు!
మంత్రులను హతం చేసి.. ఎమ్మెల్యేలను అంతం చేసి.. కీలకమైన నేతలను అపహరించి.. పోలీస్ కోవర్టులను హతమార్చి.. దండకారణ్యంలో రక్త చరిత్ర పారించిన నేపథ్యం మావోయిస్టులది. కానీ ఎప్పుడైతే కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఆపరేషన్ కగార్ కు శ్రీకారం చుట్టారో.. అప్పుడే పరిస్థితి మారిపోయింది. 2026 జనవరి వరకు డెడ్ లైన్ పెట్టుకున్నప్పటికీ.. ఆ లోగానే కేంద్ర బలగాలు మావోయిస్టులను అంతం చేసే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే కీలకమైన మావోయిస్టు నాయకులు జనజీవన స్రవంతిలో కలిసిపోయారు. మిగతావారు వరుసగా హతమవుతున్నారు. మావోయిస్టు దళంలో కీలకమైన హిడ్మా మారేడుమిల్లి అడవుల్లో హతం కావడంతో సంచలనం నెలకొంది. ఈ ఘటన తర్వాత మావోయిస్టు దళం మొత్తం పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిందని హోం మంత్రిత్వ శాఖ వర్గాలు చెబుతున్నాయి.
గడచిన 5 నెలల కాలంలో ఐదుగురు సభ్యులు మృతి చెందారు. వారిలో సుధన్న అలియాస్ సుధాకర్, కృష్ణన్న అలియాస్ బాలకృష్ణ, చంద్రన్న అలియాస్ రామచంద్రారెడ్డి, సత్తన్న అలియాస్ సత్యనారాయణ రెడ్డి, అంజన్న అలియాస్ అంజు దాదా ఉన్నారు. మల్లోజుల వేణుగోపాల్, చంద్రన్న, ఆశన్న వంటి కీలక సభ్యులు లొంగిపోయారు. ఇంకా కొంతమంది కీలక సభ్యులు పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఆశ్రయం పొందుతున్నారు. కేంద్ర నాయకత్వంలో కీలకంగా ఉన్న హిడ్మా మరణించడంతో అది మరింత బలహీనపడింది. కీలకమైన మావోయిస్టు నేతలు లొంగిపోయినప్పటికీ.. పెద్దపెద్ద నాయకులు కన్నుమూస్తున్నప్పటికీ బలగాలు కూంబింగ్ ను ఏమాత్రం ఆపడం లేదు. పైగా దండకారణ్యంలోకి మరింత లోతుగా దూసుకుపోతున్నాయి.
Also Read: బాలుడిగా ఉద్యమంలోకి.. మావోయిస్టు అగ్ర నేత హిడ్మా ప్రస్థానం ఇది!
బలగాలు లోతుగా దూసుకుపోవడంతో మావోయిస్టులకు స్థావరాలు అనేవి లేకుండా పోతున్నాయని తెలుస్తోంది. కర్రె గుట్టల నుంచి మావోయిస్టులను బయటికి పంపించిన తర్వాత.. బలగాలు మరింత విస్తృతంగా తనిఖీలను చేస్తున్నట్టు తెలుస్తోంది. అందువల్లే మావోయిస్టులు జన జీవన స్రవంతిలో కలవడానికి మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. రిక్రూట్మెంట్ ఆగిపోవడం.. దళంలో పనిచేయడానికి ఎవరూ ముందుకు రాకపోవడంతో మావోయిస్టులు తీవ్ర ప్రతిఘటన ఎదుర్కొంటున్నట్టు తెలుస్తోంది. ఇదే తిరోగమనం గనక కొనసాగితే మావోయిస్టులు పూర్తిగా తుడిచిపెట్టుకుపోవడం ఖాయమని విశ్లేషకులు చెబుతున్నారు.